
బోనమెత్తుకుంటున్న పొన్నాల, ఇందిరా శోభన్
టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బుడ్డర్‌ఖాన్‌లా మాట్లాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. నిత్యం ఫాం హౌస్‌లో పడుకునే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసిందెప్పుడని ప్రశ్నించారు.
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బుడ్డర్‌ఖాన్‌లా మాట్లాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. నిత్యం ఫాం హౌస్‌లో పడుకునే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసిందెప్పుడని ప్రశ్నించారు. ఏనాడూ పార్లమెంట్‌లో తెలంగాణపై ఒక్క మాట కూడా మాట్లాడని కేసీఆర్ తనవల్లే తెలంగాణ వచ్చిందని చెప్పడం విడ్డూరమన్నారు. ఆదివారం పొన్నాల గాంధీభవన్‌లో, అలాగే తెలంగాణ ఇంగ్లిష్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ఎ విజన్ ఆఫ్ తెలంగాణ’ అనే అంశంపై జరిగిన మీట్ దిప్రెస్‌లోనూ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘‘ఆయనెవరో (కేవీపీ రామచంద్రరావును ఉద్దేశించి) కేసీఆర్‌కు డబ్బులిస్తానన్నాడట. తెలంగాణ ఉద్యమాన్ని బంద్ పెట్టమని అప్పుడెప్పుడో చెప్పిండట. ఆ విషయాన్ని కేసీఆర్ ఈ ఎన్నికల సమయంలో చెప్తుండు. నిజంగా డబ్బులు ఆఫర్ చేస్తే ఆనాడే ఎందుకు బయటపెట్టలేదు? ఇప్పుడీ నాటకాలెందుకు? విశ్వసనీయత లేకుండా బుడ్డర్‌ఖాన్ మాదిరిగా మాట్లాడితే నమ్మేదెవరు? అసలు నువ్వు తెలంగాణ కోసం ఉద్యమం చేసిందెప్పుడు? ఫాంహౌస్‌లో పడుకోవడం తప్ప నువ్వు చేసిందేమిటి? ఫాంహౌస్‌లో ఒక్క చెట్టుకు 300 క్వింటాళ్ల టమోటాలు పండిస్తానన్నట్లుగానే నీ మాటలున్నాయి. ఏయ్ కేసీఆర్... ఇప్పటికైనా నీ మాటలు కట్టిపెట్టు. చేతైనె తే పార్టీ విధానాలు, సిద్ధాంతాలపై మాట్లాడు’’అని పొన్నాల మండిపడ్డారు. ఐదేళ్లు పాలమూరు ఎంపీగా ఉన్న కేసీఆర్ జిల్లా గురించి, తెలంగాణ గురించి పార్లమెంట్‌లో ఒక్క అంశం కూడా ప్రస్తావించలేదన్నారు. ఐదేళ్ల కాలంలో పార్లమెంట్‌లో రెండుసార్లు మాత్రమే కేసీఆర్ పెదవి విప్పారని, ఆ రెండు కూడా తెలంగాణకు సంబంధం లేని ఇతర అంశాలేనని చెప్పారు. ఉద్యమ నాయకుడు ఇలాగే ఉంటాడా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ హాజరుపట్టీలో అతి తక్కువగా హాజరైన వారిలో కేసీఆర్ ఒకరని పేర్కొన్నారు. తెలంగాణకోసం మిలియన్ మార్చ్‌తోపాటు వివిధ ఆందోళనల్లో తాము పాల్గొన్నామని, కాంగ్రెస్ అధిష్టానంతోపాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామని అన్నారు. అలాగే నాలుగు నెలలపాటు కేబినెట్ సమావేశాలకు హాజరుకాకుండా నిరసన తెలిపామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలను ఒప్పించి, ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చిందన్నారు. కేసీఆర్ టికెట్లు అమ్ముకున్నదీ లేనిది పైసలు ఇచ్చిన వారికి, ఆయనకే తెలుసని అన్నారు. ఆయన టికెట్లు అమ్ముకున్నారన్న మాటకు తాను కట్టుబడి ఉంటానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఆస్తులపై విచారణ జరుపుతారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఆస్తులపై ఆరోపణలు వస్తే కచ్చితంగా విచారణ ఉంటుందని అన్నారు. కేవీపీ వల్లే తనకు టీపీసీసీ అధ్యక్షపదవి వచ్చిందనడంలో వాస్తవం లేదన్నారు.
కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ నేతల చేరిక: టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, ముషీరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆగిరి వెంకటేశ్, తెలంగాణ జాగృతి సంస్థ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు ఇందిరా శోభన్ సహా పలువురు టీఆర్‌ఎస్ నేతలు ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వినయ్‌కుమార్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.