యార్లడ్డ లక్ష్మీప్రసాద్ 2001లో టీడీపీ ఎంపీగా తెలంగాణ కోరుతూ రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టారని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
ఎప్పుడో 2001లోనే నాడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా ఉన్న యార్లడ్డ లక్ష్మీప్రసాద్ తెలంగాణ కోరుతూ రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టారని, మరిప్పుడు అదే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం తెలంగాణపై ద్వంద్వ వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1948 నుంచి 56 వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉందని, అప్పుడు బలవంతంగా తమను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని ఆయన అన్నారు. ఇప్పుడు మళ్లీ తెలుగువారు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా గానీ రెండు చోట్లా అపారమైన అభివృద్ధి సాధించడానికి అవకాశాలున్నాయని ఆయన చెప్పారు.
ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిగ్రీ కోర్సుల్లోను వృత్తినైపుణ్యం కోర్సును ప్రవేశపెట్టామని, త్వరలోనే అన్ని విశ్వవిద్యాలయాల అధికారులను సమావేశపరిచి వీటిపై అవగాహన కలిగిస్తామని పొన్నాల చెప్పారు. విద్యార్థులు డిగ్రీ చదివి కళాశాల నుంచి బయటకు వచ్చేసరికి వారు ఉద్యోగాలు చేయడానికి సంసిద్ధంగా ఉండాలన్నదేప తమ లక్ష్యమని ఆయన అన్నారు.