
మరో బషీర్‌బాగ్ ఉద్యమం తప్పదు
రుణమాఫీ, విద్యుత్ సమస్యలను పరిష్కరించకుంటే బషీర్ బాగ్ తరహా ఉద్యమం తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
* టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల
* బషీర్‌బాగ్ మృతులకు టి.కాంగ్రెస్ నేతల నివాళి
సాక్షి, హైదరాబాద్ : రుణమాఫీ, విద్యుత్ సమస్యలను పరిష్కరించకుంటే బషీర్ బాగ్ తరహా ఉద్యమం తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నో హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు. బషీర్‌బాగ్ కాల్పుల ఘటనకు 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ నేతలు పొన్నాల, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్ తదితరులు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ 14 ఏళ్ల క్రితం రాష్ట్రంలో రాక్షస పాలన సాగిందని, కరెంటు చార్జీలను తగ్గించమని అడిగిన పాపానికి ప్రజలను పిట్టల్లా కాల్చిన చరిత్ర చంద్రబాబు సర్కారుదని అన్నారు. కేసీఆర్ సైతం చంద్రబాబు తరహా పాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు. డీఎస్ మాట్లాడుతూ 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచిత విద్యుత్‌ను అమలు చేయడంతోపాటు రుణాలనూ రద్దు చేస్తే.. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం రుణమాఫీ అంశాన్ని నాన్చుతోందన్నాని విమర్శించారు. జానారెడ్డి మాట్లాడుతూ రుణమాఫీపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడం బాధాకరమన్నారు.
హామీల అమలుకు పోరాటం: రఘువీరా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలుకు విద్యుత్ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో పోరాటం చేస్తామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. బషీర్‌బాగ్‌లో పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డిలకు గురువారం ఆయన నివాళులర్పించారు.
వామపక్షనేతల నివాళి...
బషీర్‌బాగ్ కాల్పుల ఘటనకు 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద గురువారం సీపీఐ నేత నారాయణ, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం నాయకులు రాఘవులు, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు నివాళులర్పించారు. విద్యుత్ కష్టాలు తీర్చాలంటూ ఉద్యమించిన వారిపై కాల్పులు జరిపించిన చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా, ఆయన సహచరుడు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని వారు గుర్తుచేశారు. ఈ మూడు నెలల కాలంలోనే వారిద్దరూ పాలనలో విఫలమయ్యారని విమర్శించారు.
హామీలు విస్మరిస్తే మరో ఉద్యమం
విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో ప్రజాసమస్యలపై కలసికట్టుగా పోరాడాలని పది వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఈమేరకు గురువారమిక్కడ డిక్లరేషన్‌ను ప్రకటించాయి. విద్యుత్ ఉద్యమం జరిగి 14 ఏళ్లయిన సందర్భంగా ఆనాటి కాల్పుల్లో మరణించిన ముగ్గురు అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం’ అనే అంశంపై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయా పార్టీల నేతలు పాల్గొన్నారు.