సాక్షి, హైదారాబాద్ : కాంగ్రెస్‌లో అసమ్మతి మంటలు ఇంకా చల్లారడం లేదు. మొదటి జాబితాలో పేరు లేని వాళ్లు రెండో జాబితాకోసం ఎదురు చూశారు. బుధవారం ప్రకటించిన రెండో జాబితాలోనూ తమ పేర్లు లేకపోవడంతో టికెట్‌పై ఆశ పెట్టుకున్న నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి కాదని టికెట్ దక్కలేదని పలువురు నేతలు ఆందోళనకు దిగారు. తమ నేతకు టికెట్ ఇవ్వకుండా మరో నేతకు ఇచ్చారని కొన్ని చోట్ల పార్టీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
ఖైరతాబాద్ టికెట్‌ను దాసోజు శ్రవణ్‌కు కేటాయించడం పట్ల స్థానిక కార్యకర్తలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు దానం నాగేందర్ రాజీనామా చేసిన తర్వాత ఖైరతాబాద్ నియోజకవర్గ వ్యవహారాలు చూస్తున్న రోహిణ్ రెడ్డిని కాదని దాసోజ్ శ్రవణ్‌కు ఇవ్వడమేంటని మండిపడుతున్నారు. ముషిరాబాద్‌లో తనకు ఓటేయండని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్న శ్రవణ్‌కు ఖైరతాబాద్ ఎలా ఇస్తారని రోహిణ్ రెడ్డి అనుచరులు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు ఖైరతాబాద్ టికెట్ కాంగ్రెస్‌కు ఇవ్వడం పట్ల టీడీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ టికెట్‌ను తెలుగుదేశం పార్టీకే కేటాయించాలంటూ ఎన్టీఆర్ భవన్ ముందు ఆందోళనకు దిగారు. ఖైరతాబాద్ టికెట్ టీడీపీకి కేటాయించాలంటూ ఓ కార్యకర్త కరెంట్ పోల్ ఎక్కి నిరసన తెలిపారు.
రెండో జాబితాలోనూ పొన్నాల లక్ష్మయ్య చోటు లభించకపోవడంతో ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు జనగామలో ఆందోళనకు దిగారు. టికెట్ ఇవ్వకుండా బీసీ నేతను అవమానిస్తారా అంటూ పొన్నాల అనుచరులు మండిపడుతున్నారు. పొన్నాలకు టికెట్ ప్రకటించనందుకు నిరసనగా జనగామలోని 14మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు తమ పదవికి రాజీనామా చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ న్యాయకత్వంపై రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ క్యామ మల్లేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెమ్మెల్యే టికెట్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. టికెట్లను అమ్ముకుంటూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. గొల్ల కురుమ సామాజిక వర్గానికి చెందిన తనకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తనకు అన్యాయం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గొల్ల,కురుమలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తారని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment