మున్సిపల్ చైర్మన్లు, మండలాధ్యక్షుల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వ్యూహం మార్చాయి.
* జెడ్పీ పీఠాల కైవసంపై కాంగ్రెస్, టీడీపీ నిర్ణయం
* రంగారెడ్డి టీడీపీకి .. వరంగల్, మహబూబ్‌నగర్ పీఠాలు కాంగ్రెస్‌కు..
* జానారెడ్డితో పొన్నాల.. చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీలు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ చైర్మన్లు, మండలాధ్యక్షుల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వ్యూహం మార్చాయి. ఎక్కువ స్థానాలు సాధించినా.. ఇతర పార్టీలతో పొత్తులేని కారణంగా పీఠాలను దక్కించుకోలేపోయామని గ్రహించి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో కలిసిపోవాలని నిర్ణయించాయి. అందులో భాగంగా రంగారెడ్డి జెడ్పీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతిచ్చేలా.. దీనికి ప్రతిగా మహబూబ్‌నగర్, వరంగల్ జెడ్పీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు టీడీపీ సహకరించేలా ఒప్పందం కుదర్చుకున్నాయి. ఈ వ్యూహం ఫలిస్తే అధికార టీఆర్‌ఎస్ ఎత్తుగడలను తిప్పికొట్టవచ్చని భావిస్తున్నాయి.
జానారెడ్డితో పొన్నాల మంతనాలు..
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం సాయంత్రం సీఎల్పీ నేత కె.జానారెడ్డితో ఇదే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ అధికార, అర్థ బలాన్ని తట్టుకుని సొంతంగా కాంగ్రెస్ ఒక్క జెడ్పీ పీఠాన్ని కూడా దక్కించుకునే పరిస్థితి కనిపించడం లేదని అభిప్రాయపడినట్లు సమాచారం. పూర్తి మెజారిటీ ఉన్న నల్గొండ జిల్లాలోనూ టీఆర్‌ఎస్ ‘ఆకర్ష్’తో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలని యోచిస్తున్నందున.. ఆ పార్టీ ఎత్తుగడను తిప్పికొట్టేందుకు టీడీపీ మద్దతు కూడగట్టాల్సిన అవసరముందని వారు భావించారు.
టీడీపీతో కలిస్తే ఆ పార్టీ రెండు, కాంగ్రెస్ మూడు జెడ్పీలను దక్కించుకునే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జెడ్పీ ఎన్నికల్లో తమకు మద్దతిస్తే మిగతా జిల్లాల్లో కాంగ్రెస్‌కు సహకరిస్తామని టీడీపీ తెలంగాణ నేతలు చేసిన ప్రతిపాదన తమకు సమ్మతమేనంటూ పొన్నాల, జానారెడ్డిలు టీటీడీపీ నేతలకు సమాచారం పంపారు. దీంతో టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్ తదితరులు ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిసి కాంగ్రెస్ ప్రతిపాదనను ముందుంచారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. ‘టీఆర్‌ఎస్‌కు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతిచ్చే ప్రసక్తే లేదు. ఆ పార్టీని ఎదుర్కొనేందుకు కలిసొచ్చే పార్టీలతో ముందుకెళ్లండి. రంగారెడ్డి జెడ్పీ పీఠం దక్కించుకునేందుకు సహకరిస్తే మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్‌కు మద్దతివ్వండి. లేదంటే ఆయా జిల్లాల్లో ఎన్నికలను బహిష్కరించండి..’ అని బాబు స్పష్టం చేసినట్లు సమాచారం.