నేను క్లీన్.. మరి నువ్వో..! | Ponnala laxmaiah takes on KCR | Sakshi
Sakshi News home page

నేను క్లీన్.. మరి నువ్వో..!

Published Fri, Apr 18 2014 4:19 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

నేను క్లీన్.. మరి నువ్వో..! - Sakshi

నేను క్లీన్.. మరి నువ్వో..!

* కేసీఆర్‌ను ప్రశ్నించిన పొన్నాల
* సీబీఐ నాకు క్లీన్‌చిట్ ఇచ్చింది
* నీపై ఉన్న కేసుల సంగతేంటి?

 
 సాక్షి, హైదరాబాద్: సీబీఐ, లోకాయుక్త సంస్థలు తనకు క్లీన్‌చిట్ ఇచ్చాయని, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై ఉన్న ఆరోపణలకు ఏ సంస్థ క్లీన్‌చిట్ ఇచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ఆయనపై ఇప్పటికీ అక్రమ పాస్‌పోర్టులు, మనుషుల అక్రమ రవాణా కేసులున్నాయని గుర్తు చేశారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న కేసీఆర్ ముందుగా ఆయనపై ఉన్న ఆరోపణలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
 
 గాంధీభవన్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఒకసారి దేవత, మరోసారి బలిదేవత అంటూ కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు నీచ, నికృష్టమైనవని విమర్శించారు.  మోసానికి, వంచనకు, అవకాశవాదానికి ఆయన ప్రతిరూపమని విమర్శించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న కేసీఆర్ ఆ తర్వాత మహాకూటమితో జతకట్టారని, 2009లో ఫలితాలు రాకముందే బీజేపీ పంచన చేరిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.
 
 యూపీఏ ప్రభుత్వం 2009లో తెలంగాణను ప్రకటిస్తే అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు... కేసీఆర్ కు గురువేనన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీతో పనైపోవడంతో.. ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకమైన మూడో కూటమికి మద్దతిస్తానని కేసీఆర్ కొత్త పల్లవి ఎత్తుకున్నారని పొన్నాల మండిపడ్డారు. మూడో కూటమిలో ఉన్న సీపీఎం, టీఎంసీ, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలు పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును వ్యతిరేకించిన విషయాన్ని కేసీఆర్ మరిచిపోయాడన్నారు. సీమాంధ్ర ఉద్యోగులంతా వెళ్లిపోవాల్సిందేనని, ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘ఉద్యోగులకు ఆప్షన్  విషయాన్ని కమలనాథన్ కమిటీ పరిశీలిస్తోంది. ఈ విషయంలో తెలంగాణ ఉద్యోగుల అభిప్రాయమే కాంగ్రెస్ అభిప్రాయం. ఇందులో మరొక దానికి తావులేదు’అని పొన్నాల పేర్కొన్నారు.
 
 కొప్పులతో కాంగ్రెస్‌కు నష్టం: మానవతారాయ్

 ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చుతున్నారని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకుడు, ఓయూ జేఏసీ నేత మానవతారాయ్ ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడే తనలాంటి వారికి టికెట్ రాకుండా  రాజు అడ్డుకున్నారన్నారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పరిస్థితి, అభ్యర్థుల గురించి సోనియా, రాహుల్‌కు కొప్పుల తప్పుడు సమాచారమిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రాకు చెందిన కొప్పులకు గాంధీభవన్‌లో పనేముందని ప్రశ్నించారు. జైపూర్ డిక్లరేషన్‌కు భిన్నంగా టికెట్ల కేటాయింపు జరిగిందని, సోనియా దృష్టికి తీసుకెళతానని మానవతారాయ్ చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement