సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాత్రికి రాత్రే ఎత్తేస్తామని ప్రకటించారని.. అవివేకం, అహంకారం, అనాలోచితంగా ఆయన తీసుకునే నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. కేసీఆర్ చర్యల వల్ల రాష్ట్ర రైతాంగం ప్రమాదంలో పడుతుందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కేసీఆర్‌కు ప్రజలు తగిన శిక్ష విధించడం ఖాయం. మిషన్ భగీరథకు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశావు కదా! నీళ్లు ఇచ్చావా?. కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి రెండు ప్రాజెక్టులకు లక్ష కోట్లకుపైగా ప్రభుత్వం సొమ్ము ఖర్చు చేశారు.
ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు. కేసీఆర్ రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోతారు. కేసీఆర్ తీసుకునే 90 శాతం నిర్ణయాలు ప్రజలను ఇబ్బందుల పాలు చేసేవే. కొనుగోలు కేంద్రాలను ఎత్తేయడాన్ని.. ప్రజల్లో ఎండగడుతాం. కేసీఆర్, బీజేపీ ఆడే నాటకాలతో.. ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. కేసీఆర్ శేష జీవితం చర్లపల్లి జైలులోనే’’ అని అన్నారు. ( పల్లెల్లో పంట కొనుగోలు కుదరదు!)
కేసీఆర్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారు: ఉత్తమ్
‘‘కేసీఆర్ ఒక తుగ్లక్‌లాగా వ్యవహరిస్తున్నారు. చెప్పిన పంటలే వేయాలని రైతులను ఇబ్బందులు పెట్టారు. మళ్లీ ఇప్పుడు ఇష్టం వచ్చిన పంటలు వేసుకోవచ్చు అంటున్నారు. నియంత్రిత సాగుపై మొదటి నుండి చెప్తూనే ఉన్నాం కానీ వినలేదు. పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం సాధ్యం కాదని చెప్పడం మంచిది కాదు. పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. లేదంటే రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. టీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే.. రెండూ రహస్య ఒప్పందం చేసుకున్నాయి. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టంపై కేసీఆర్ మాట మార్చారు. పీసీసీ చీఫ్ విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాను’’.
Comments
Please login to add a commentAdd a comment