సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. సంక్షేమ కార్యక్రమాల అమలు, ఇతర ఖర్చులకు డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున తీసుకున్న రుణాలకు గాను భారీ మొత్తంలో వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది’అని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
ఈ ఆర్థిక కష్టాలు బయటపడకుండా ఉండేందుకుగాను రాజకీయ ప్రకటనలతో కాలం వెళ్లదీసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా, ఆర్థిక ఆంక్షలు విధిస్తూ తెలంగాణను అణగదొక్కేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రమని చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిజాలను మరుగున పెడుతోందన్నారు. ఇతరులను నిందించడం, రాజకీయ ప్రకటనల ద్వారా కాలక్షేపం చేయడంతో ఆర్థిక కష్టాలు తీరవని, అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment