* హంగ్ జెడ్పీ, మున్సిపాలిటీలనూ కైవసం చేసుకుందాం
* తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో అత్యధిక పీఠాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా హంగ్ ఫలితాలొచ్చిన చోట్ల టీడీపీ సహకారం తీసుకోవాలని భావిస్తోంది. అదే సమయంలో మజ్లిస్ పార్టీ సహకారం కూడా తీసుకోవాలని నిర్ణయించింది. ఏఐసీసీ రాష్ర్ట వ్యవహారాల సహాయ ఇన్‌చార్జి రామచంద్ర కుంతియా అధ్యక్షతన సోమవారం సాయంత్రం గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభ, శాసనమండలి ప్రతిపక్ష నేతలు కె.జానారెడ్డి, డి.శ్రీనివాస్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్ తదితరులు హాజరైన ఈ సమావేశంలో జిల్లా, మున్సిపల్, మండల ఎన్నికల ఫలితాలు, అనంతరం అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించారు. కాంగ్రెస్‌కు మెజారిటీ స్థానాలున్న చోట ఇబ్బంది లేనప్పటికీ, హంగ్ ఫలితాలొచ్చిన చోట మాత్రం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కుంతియా సూచించారు.
పార్టీ వర్గాల సమాచారం మేరకు.. వరంగల్, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఎన్నికల్లో హంగ్ ఫలితాలొచ్చినందున ఆయా జెడ్పీ పీఠాలను ఏ విధంగా దక్కించుకోవచ్చని అనే అంశంపై నేతల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. హంగ్ ఫలితాలొచ్చిన జిల్లాల్లో జెడ్పీలను కైవసం చేసుకునేందుకు అధికార టీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలను ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకుంటున్నారని పలువురు నేతలు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అధికార పార్టీ ధాటికి తట్టుకోలేక కాంగ్రెస్ జె డ్పీ చైర్మన్ అభ్యర్థులు సైతం చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ అధికారిక పలుకుబడిని, ఆర్థిక శక్తిని తట్టుకోవాలంటే హంగ్ ఫలితాలొచ్చిన చోట్ల టీడీపీ సహకారం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
ఆ పార్టీ అధినేత చంద్రబాబు సైతం హంగ్ ఫలితాలొచ్చిన చోట్ల ఎవరికి మద్దతివ్వాలనే అంశాన్ని స్థానిక నేతలకే వదిలేసినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అత్యధిక పీఠాలను దక్కించుకోవాలంటే మజ్లిస్ సహకారం తప్పనిసరైనందున ఆ పార్టీ పెద్దలతోనూ మాట్లాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒకరిద్దరు నేతలు టీడీపీ సాయం తీసుకునే విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ అంతిమంగా ఆ పార్టీ సహకారంతో తీసుకుంటేనే బాగుంటుందనే సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చారు. ఈ ఎన్నికలు ఆలస్యమయ్యే కొద్దీ క్యాంపు రాజకీయాలు ఎక్కువుతాయనే ఆందోళన సమావేశంలో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో తక్షణమే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ర్ట ఎన్నికల కమిషన్‌ను కోరుతూ తీర్మానించింది.
కాంగ్రెస్‌ను ఎలా బలోపేతం చేద్దాం
నేడు అనుబంధ సంఘాలతో చర్చించనున్న పొన్నాల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మంగళవారం పార్టీ అనుబంధ సంఘాలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం, మేనిఫెస్టో హామీల అమలుపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను ఇందులో చర్చించనున్నారు. అలాగే ఎన్‌ఎస్‌యూఐ, యువజన, మహిళా కాంగ్రెస్ విభాగాలతోపాటు మొత్తం 12 అనుబంధ సంఘాల నేతల పనితీరును సమీక్షించనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ సమీక్షలో ఒక్కో అనుబంధ సంఘ నేతలతో అరగంటకుపైగా చర్చించనున్నారు.
స్థానికంగా టీడీపీతో కలుద్దాం!
Published Tue, Jun 17 2014 12:57 AM | Last Updated on Sat, Aug 11 2018 7:16 PM
Advertisement