అహంభావంతో పాలిస్తే మేలు జరగదు: పొన్నాల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని సమస్యల పరిష్కారం కోసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రశేఖరరావుకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సూచించారు. అరవయ్యేళ్ల తెలంగాణ కల సాకారమైనా ఒంటెద్దు పోకడలు, అహంభావంతో పాలనసాగిస్తే ఇక్క డి ప్రజలకు మేలు జరగదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు బుధవారం పొన్నాల ఒక లేఖ రాశారు. దానిని గాంధీభవన్‌లో మీడియాకు విడుదల చేశారు. ప్రధానమైన అంశాలపై అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలని కేసీఆర్‌కు సూచించారు.
రిజర్వుబ్యాంక్‌ను ఒప్పించేందుకే రైతుల రుణమాఫీ ఉత్తర్వులను ఇస్తున్నామనే భావనను ప్రభుత్వం కలిగిస్తోందని చెప్పారు. విద్యుత్ లేక, అప్పులు దొరకక రెండు నెలల్లోనే 130 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ పగ్గాలను చేపట్టి 70 రోజులు దాటినా ఒక్క అంశంపైనా స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. గత కేబినెట్ భేటీలో 43 అంశాలపై చర్చించినా ఒక్కటి కూడా కార్యరూపం దాల్చకపోవడమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు బూచిని చూపిస్తూ సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారా అని అన్నారు.