
విభజనతోనే రెండు రాష్ట్రాల అభివృద్ధి: పొన్నాల
హన్మకొండ: విభజనతోనే రెండు రాష్ట్రాలు అభివృద్ధి సాధిస్తాయని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గురువారం వరంగల్ జిల్లా హన్మకొండలో ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో తెలంగాణ విజయోత్సవ సభ జరిగింది. ఈ సభలో తెలంగాణ 10 జిల్లాల నుంచి ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
సభలో మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ రెండు రోజులు ప్రయాణిస్తే గానీ హైదరాబాద్ చేరుకోని ఆంధ్ర ప్రాంత పేదలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటుండగా.. వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, సీమాంధ్ర రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక రాష్ట్రంలో 250 ఏళ్లుగా వేరుగా ఉన్న తెలంగాణ ప్రజలు ఆందోళన చెందితే లేనిది.. 60 ఏళ్లు కలిసి ఉన్నందుకే సీమాంధ్రులు ఆందోళన చెందుతూ సమైక్యంగా ఉండాలని కోరడంలో అర్థం లేదన్నారు.
జై ఆంధ్ర ఉద్యమంలో అసువులు బాసిన కాకాని వెంకటరత్నం చితాభస్మం సాక్షిగా నాయకులు రౌతు లచ్చన్న, వెంకయ్యనాయుడు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితర నాయకులు ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుకోవడం మరచిపోయారా అని నిలదీశారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీని రక్షించుకుంటేనే బతుకు ఉంటుందని, కార్మికులు తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడారని తెలిపారు.
ఎన్‌ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ మహమూద్ మాట్లాడుతూ తెలంగాణకు ప్రత్యేక ఎన్‌ఎంయూ శాఖ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ శాఖకు జిల్లాకు చెందిన లింగాల శ్రీరాములరెడ్డిని ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు తెలిపారు. ఈ నెల 30వ తేదీన హైదరాబాద్‌లో ఆవిర్భావ సభ నిర్వహించి పూర్తి స్థాయి కమిటీని ప్రకటించనున్నట్లు చెప్పారు. ఆర్టీసీ యాజమాన్యంతో ఇటీవల జరిగిన చర్చలలో చేసుకున్న ఒప్పందాలను తమ ఘనతగానే ఎంప్లాయూస్ యూనియన్ చెప్పుకోవడం విడ్డూరమని విమర్శించారు.