పొన్నాలకు వ్యతిరేకంగా అర్చకుల సర్పయాగం
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు వ్యతిరేకంగా బుధవారం ఆ ప్రాంత అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో పాశుపత సహిత మూల మంత్రయుక్త మహా సర్పయాగం నిర్వహించారు. సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంవీ సౌందరరాజన్, కార్యనిర్వాహక అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అర్చక సమస్యలను తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చుతామని హామీ ఇచ్చి మోసం చేసినందుకు నిరసనగా ఈ యాగాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు. 2007లో సవరించిన చట్టాన్ని అమలు పర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఇప్పుడు కొత్త వాగ్దానాలతో తెలంగాణ ప్రాంతంలోని 11,220 దేవాలయాల అర్చక ఉద్యోగులను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వరంగల్ జిల్లా హన్మకొండ పశ్చిమ నియోజవర్గంలో 1952 నుండి బ్రాహ్మణులకు స్థానం ఉండేదని, గత శాసనసభ ఎన్నికల్లో కొండపల్లి దయాసాగర్ బ్రాహ్మణ అభ్యర్థిని ఓడించిన వారికి ఇప్పుడు టికెట్ ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు తమ మేనిఫెస్టోలలో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాయని పేర్కొన్నారు. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారికి తగిన బుద్ది చెప్పేందుకు సమయం ఆసన్నమైందని చెప్పారు.