నిస్సారథ్యం | No perfect leader to run Telangana congress party | Sakshi
Sakshi News home page

నిస్సారథ్యం

Published Tue, Apr 8 2014 2:07 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

నిస్సారథ్యం - Sakshi

నిస్సారథ్యం

* తెలంగాణ కాంగ్రెస్‌లో అంతా కంగాళే
* నేతల్లో నిస్తేజం, కార్యకర్తల్లో నిరాశ
* వైఎస్‌లా నడిపించే నాయకుడు లేక దిగాలు
* ప్రతిదానికీ బేలగా అధిష్టానం వైపు చూపులు
* సీఎం ఆశావహుల గెలుపే అనుమానాస్పదం!

 
పసునూరు మధు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు మరో మూడు వారాలే ఉంది. ఈ పరిస్థితుల్లో మామూలుగానైతే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తున్న పార్టీగా తెలంగాణలో కాంగ్రెస్ దూసుకుపోవాలి. కానీ వాస్తవంలో మాత్రంఆ పార్టీలో అంతా రివర్స్ గేరులో నడుస్తోంది. సర్వత్రా నిస్తేజం. ఎటుచూసినా నీరసపూరిత వాతావరణం. పార్టీలో చేరేందుకు పలువురు ఉత్సాహం చూపుతున్నా, వారిని అక్కున చేర్చుకునే దిక్కు కూడా లేని అయోమయం. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలు పెట్టి కూడా జాబితాల ప్రకటనలో ఆద్యంతం అంతులేని గందరగోళం. చిన్నాచితకా విషయాలకు కూడా అధిష్టానం కేసి బేలగా చూడాల్సిన నిస్సహాయత. అసలు పార్టీ బరువు బాధ్యతలను పూర్తిగా భుజాన వేసుకుని ముందుకు నడిపే నాయకుడంటూ ఎవరూ కన్పించని దైన్యం. వెరసి విచిత్రమైన నిస్సహాయత తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పట్టి పీడిస్తోంది!
 
 ప్రత్యేక రాష్ట్రాన్నిచ్చిన పార్టీగా కాంగ్రెస్, ఉద్యమ చాంపియన్‌గా టీఆర్‌ఎస్ తెలంగాణలో ప్రధానంగా పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ప్రభావం ఇక్కడ నామమాత్రమే. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఇతర పార్టీల నేతలను ఆకర్షించడం మొదలుకుని అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం దాకా అన్ని విషయాల్లోనూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. కానీ కాంగ్రెస్‌లో మాత్రం పరిస్థితి ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిని నియమిస్తే ఇలాంటి ఇబ్బందులు తొలగిపోతాయని మొన్నటిదాకా భావించారు. కానీ టీపీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించిన తరవాత కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం తొలగలేదు. వ్యక్తిస్వామ్యం నడుస్తున్న నేటి రాజకీయాల్లో పార్టీ ఎలాంటిదనేది మాత్రమే కాకుండా నాయకుడెవరనేది కూడా ప్రధానాంశంగా మారింది.
 
 తెలంగాణ సాధనే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్‌ఎస్‌ను కేసీఆర్ అన్నీ తానై నడిపిస్తున్నారు. పార్టీ తరఫున సీఎం అభ్యర్థి కూడా ఆయనేనని జనమూ భావిస్తున్నారు. కానీ కాంగ్రెస్ విషయం మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. గెలిస్తే ఎవరు సీఎం అవుతారనేది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నే. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా తమ సారథి ఎవరనే విషయంలో స్పష్టత లేదు. పొన్నాల, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, దామోదర రాజనర్సింహ, డి.శ్రీనివాస్, వి.హన్మంతరావు, మర్రి శశిధర్‌రెడ్డి... ఇలా కనీసం ఓ డజను మంది కాంగ్రెస్ నేతలు తామే సీఎం అవుతామనే భావనలో ఉన్నారు. 2004, 2009 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో ఇలాంటి అయోమయానికి తావే లేని పరిస్థితి! సీఎం అభ్యర్థిని అధిష్టానం ప్రకటించకపోయినా, ఇప్పట్లాగే అప్పుడూ ఎంతోమంది నేతలు రేసులో ఉన్నామని భావించినా, కాంగ్రెస్ గెలిస్తే వైఎస్సే ముఖ్యమంత్రి అని పార్టీ కార్యకర్తలతో పాటు రాష్ట్ర ప్రజలంతా ముందే అంచనాకు వచ్చారు.
 
  పదేళ్ల టీడీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు, కాంగ్రెస్‌ను గెలిపిస్తే వైఎస్ సీఎం అవుతారనే భావనతోనే ఆ మేరకు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో పార్టీకి సమర్థ సారథి మాట అటుంచి, కనీసం పార్టీలో చేరాలని ఆశ పడుతున్న ఇతర పార్టీల నేతలకు భరోసా ఇచ్చే నాయకుడు కూడా కరువయ్యాడు. కాంగ్రెస్‌లో చేరాలంటే ఎవరిని కలవాలో, ఎవరి సమక్షంలో చేరితే టికెట్లు వస్తాయో, రాకపోయినా మున్ముందు భవిష్యత్తు ఉంటుందోననే అనేకానేక సందేహాలు వారిని తీవ్రంగా వేధిస్తున్నాయి. పొన్నాలతో సహా, తాము సీఎం రేసులో ఉన్నామని ప్రచారం చేసుకునే నేతల్లోనూ ఏ ఒక్కరిపైనా ఇతర పార్టీల నేతలకు నమ్మకం లేని పరిస్థితి! వారిని నమ్ముకుంటే పని కాదనే ఉద్దేశంతో చాలామంది తమ ఢిల్లీ పరిచయాల సాయంతో అధిష్టానం పెద్దలను కలిసి, వారి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు.కనీసం టికెట్లు రావని నిరాశ పడుతున్న పార్టీ నేతలను బుజ్జగించే దిక్కు కూడా లేకపోవడం చూస్తే తెలంగాణలో నాయకత్వ లోపం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
 సొంతింటిని చక్కదిద్దులేని నాయకులు
 ఇక, సీఎం రేసులో ఉన్నామని భావిస్తున్న పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సొంత నియోజకవర్గాల్లోనే ఎదురుగాలి తరహా వాతావరణం నెలకొని ఉండటం మరో వైచిత్రి! కచ్చితంగా గెలుస్తామనే ధీమా కూడా వారిలో కన్పించడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య 2009లో కేవలం 236 ఓట్ల తేడాతో గట్టెక్కారు. ఈసారి కూడా ఆయన పరిస్థితి అంతకంటే ఏమీ మెరుగు పడలేదు. టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులను తట్టుకుని గెలవాలంటే చెమటోడ్చక తప్పని పరిస్థితి. పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‌ది అంతకంటే దారుణమైన పరిస్థితి. 2009 సాధారణ ఎన్నికల తో పాటు 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా పీసీసీ అధ్యక్షుని హోదాలో ఉంటూ కూడా ఘోర పరాజయం పాలయ్యారాయన. ఈసారి తన గెలుపు ఖాయమని ఆయన చెబుతున్నా నిజానికి పరిస్థితి అంతా ఆశాజనకంగా లేదు. ఇక నిన్నటిదాకా తెలంగాణ కాంగ్రెస్‌కు అన్నీ తానై పార్టీని ముందుకు నడిపించి, టీపీసీసీ చీఫ్‌గా పొన్నాల నియామకం తరవాత ఒక్కసారిగా సెలైంట్ అయిన కుందూరు జానారెడ్డి కూడా సొంత నియోజకవర్గం నాగార్జునసాగర్‌లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
 
  గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి ఆయనను ముప్పుతిప్పలు పెట్టారు. హోంమంత్రిగా ఉంటూ కూడా గెలవడానికి నానా తంటాలు పడ్డారు. చివరికి స్వల్ప మెజారిటీతో బయటపడ్డారు. ఈసారి కూడా జానా గెలుపు అంత తేలిక కాదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఇక టీపీసీసీ ప్రచార సారథి దామోదర రాజనర్సింహకు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన సినీ నటుడు బాబూమోహన్ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. 2009లో కూడా బాబూమోహన్ దెబ్బకు దామోదర కేవలం 2,000 పై చిలుకు ఓట్లతో బయటపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement