హీరోయిన్లంతా ఆ నియోజకవర్గంలోనే! | Ponnala laxmaiah focuses on his own constituency, leaves congress to lurch | Sakshi
Sakshi News home page

హీరోయిన్లంతా ఆ నియోజకవర్గంలోనే!

Published Fri, Apr 25 2014 12:27 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

హీరోయిన్లంతా ఆ నియోజకవర్గంలోనే! - Sakshi

హీరోయిన్లంతా ఆ నియోజకవర్గంలోనే!

ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఆయన. అలాంటి బాధ్యతల్లో ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలోని మొత్తం అభ్యర్థులందరి గెలుపు బాధ్యతలను భుజానికెత్తుకోవాలి. కానీ, తన సొంత నియోజకవర్గంలో గెలవడమే అనుమానంగా కనిపించడంతో ముందు తన విషయం చూసుకోడానికి నానా తంటాలు పడుతున్నారు. ఆయనెవరో కాదు.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య.ఆయనిప్పుడు చాలా జోరుగా ప్రచారం చేస్తున్నారు. పలువురు సినీ తారలను ప్రచార పర్వంలోకి దించుతున్నారు. విజయం కోసం చెమటోడుస్తున్నారు. కానీ అదంతా పార్టీలోని ఇతర అభ్యర్థుల విజయం కోసం కాదు.. తన సొంత గెలుపు కోసమే!!

తెలంగాణలో ఇప్పటి వరకు ఇతర సెగ్మెంట్లలో ఎక్కడా కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేయని పాత తరం నటీమణులు విజయశాంతి, జయసుధ , జయప్రద.. వీళ్లంతా ఇప్పుడు వరంగల్ జిల్లా జనగాం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి సిద్దమయ్యారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి మెదక్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రాములమ్మ కూడా పొన్నాల నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఇక సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ తరపున మళ్లీ బరిలోకి దిగిన నటి జయసుధ, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ మిత్రపక్షమైన ఆర్‌ఎల్‌డీ తరపున లోక్‌సభకు పోటీ చేస్తున్న ఎంపీ జయప్రద కూడా జనగాం నియోజకవర్గంలో ప్రచారానికి రెడీ అవుతున్నారు.
 
ఇలా గెలుపు కోసం పొన్నాల పడుతున్న పాట్లు ఆయన్ను విమర్శల పాల్జేస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ అయిన పొన్నాల.. అభ్యర్ధులందరి బాధ్యత తీసుకోవాల్సింది పోయి, కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కావడాన్ని అంతా తప్పు పడుతున్నారు. హీరోయిన్లందరినీ కేవలం జనగాంకే పరిమితం చేసి, తామందరి అవకాశాలను దెబ్బతీస్తున్నారని కూడా ఇతర అభ్యర్థులు వాపోతున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న స్ధానాలేవో గుర్తించి వాటిపై ఆయన దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement