జయమెవరిదో..! | Tough competition in store for jangaon assembly constituency ? | Sakshi
Sakshi News home page

జయమెవరిదో..!

Published Fri, Apr 11 2014 2:25 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

జయమెవరిదో..! - Sakshi

జయమెవరిదో..!

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బరిలో ఉన్న జనగామ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అదృష్టం కలిసి వచ్చి టీపీసీసీ చీఫ్ అయిన పొన్నాలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుందన్న ఉత్కంఠ కన్నా జనగామ ముఖచిత్రం ఎలా ఉండబోతుందన్న విశ్లేషణలే ఎక్కువయ్యాయి.  
 
హింగె మాధవరావు, జనగామ: పొన్నాల లక్ష్మయ్య మరోసారి ఎన్నికల బరిలో దిగారు. నాలుగుసార్లు గెలిచిన పొన్నాల ఈసారి టీపీసీసీ అధ్యక్షుడిగా బరిలోకి దూకారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యే గా, పదేళ్లు మంత్రిగా పనిచేసిన ఆయన సహజంగా ఉండే వ్యతిరేకతను దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణవాదం, తెలంగాణ ఏర్పాటు, అభివృద్ధి అంశాలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. పొన్నాలను గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.
 
మరోవైపు జనగామ నియోజకవర్గ అభివృద్ధికి పొన్నాల చేపట్టిన కార్యక్రమాలేవీ కార్యరూపం దాల్చకపోవడం ఆయనకు ప్రతికూల అంశంగా మారింది. నియోజకవర్గంలో ఐదు రిజర్వాయర్లు, నాలుగు పెద్ద జలాశాయాల ద్వారా దేవాదుల నీటిని ఇక్కడికి తరలించే బృహత్తర కార్యక్రమం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. దీనికితోడు కాంగ్రెస్ కార్యదర్శులు ఇద్దరు రెబెల్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. వీరు ఉపసంహరించుకుంటారా పోటీలో కొనసాగుతారా అనేది ఆసక్తికరంగా ఉంది.
 
 దూసుకెళ్తున్న ముత్తిరెడ్డి
టీ పీసీసీ చీఫ్‌పై గెలవాలన్న పట్టుదలతో టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పొన్నాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ పాల్గొనలేదని.. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని చెబుతూ ప్రచారంలో ముందంజలో ఉన్నారు.  
 
 కసిగా ‘కొమ్మూరి’
 గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో పొన్నాల చేతిలో ఓటమికి గురై.. ఫలితం విషయంలో వివాదం చోటుచేసుకున్న కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఇప్పుడు బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. ఈసారి ఎలాగైనా పొన్నాల ను ఓడించాలనే కసితో ఉన్నారు.  ఇక వైఎస్సార్ సీపీ నుంచి బరిలో ఉన్న వజ్రోజు శంకరాచారి వైఎస్సార్ సంక్షేమ పథకాలే ఎజెండాగా ముందుకు వెళ్తున్నారు. వైఎస్ అభిమానులు తనకు అండగా ఉంటారన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ పథకాలే తనను గెలిపిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకుడు మండలి శ్రీరాములు ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
 
 అసెంబ్లీ నియోజకవర్గం
 జనగామ
 ఎవరెన్నిసార్లు గెలిచారు: కాంగ్రెస్ - 9,
 సీపీఎం-2, టీడీపీ-1, పీడీఎఫ్-1, సీపీఐ-1
 తొలి ఎమ్మెల్యే: సయిద్ ఏ హుస్సేన్ (పీడీఎఫ్)
 ప్రస్తుత ఎమ్మెల్యే: పొన్నాల లక్ష్మయ్య (కాంగ్రెస్)
 రిజర్వేషన్: జనరల్
 నియోజకవర్గ ప్రత్యేకతలు: రాజకీయ చైతన్యం గల నియోజకవర్గం. మైనార్టీ ఓట్ల ప్రభావం. బీసీ ఓటర్లు అధికం.
 ప్రస్తుతం బరిలో నిలిచింది: 24
 ప్రధాన అభ్యర్థులు వీరే..
 పొన్నాల లక్ష్మయ్య (కాంగ్రెస్)
 కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి (బీజేపీ)
 ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (టీఆర్‌ఎస్)
 వజ్రోజు శంకరాచారి (వైఎస్సార్‌సీపీ)

- జనగామలో మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తా.  
-  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పగలే నిరంతరాయంగా 7 గంటల కరెంటు సరఫరాకు చర్యలు తీసుకుంటా.
-  ఐటీఐఆర్‌లో జిల్లాకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తా.  
- నియోజకవర్గంలోని రిజర్వాయర్‌ల నిర్మాణాలు పూర్తి చేస్తా.   
- జనగామకు దేవాదుల గోదావరి జలాలు తెప్పిస్తున్న ఘనత కాంగ్రెస్‌దే
  - పొన్నాల లక్ష్మయ్య
 
- రైతులకు సాగునీరు అందిస్తా..  గోదావరి నీళ్లను ప్రతి ఇంటికీ అందించి తాగునీటి సమస్యను పరిష్కరిస్తా.
- జనగామలోని.53/1 సర్వే నెంబర్‌లో గత 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న వాళ్లకు  ఆర్నెళ్లల్లో
- ఇళ్ల పట్టాలు ఇప్పిస్తా..
-  వైద్య సదుపాయాలు మెరుగుపరుస్తా.. మౌలిక వసతులను కల్పిస్తా . జనానికి అందుబాటులో ఉంటా.  
-   విద్యాభివృద్ధికి, పరిశ్రమల ఏర్పాటుకు చొరవ చూపుతా..    
- కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి  
 
 నే.. గెలిస్తే..
 -    మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటా
-  వైఎస్ ఆశయ సాధన కోసం పాటుపడతా..
 - రైతాంగానికి సాగునీరందించేందుకు పనిచేస్తా.. తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతా
-  ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తా..
-  ఇళ్లు.. పింఛన్‌లు.. రేషన్‌కార్డులు.. తదితర సమస్యల పరిష్కారం కోసం పాటుపడతా.
 - వజ్రోజు శంకరాచారి  
 
-     చిన కోటూరు రిజర్వాయర్ నుంచి వస్తున్న కలుషిత నీటి నుంచి ప్రజలకు ఊరట కల్పిస్తా. జనగామలోని తాగునీటి సమస్యను పరిష్కరిస్తా.
-  ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా.  
-  ఆయకట్టుకు సాగునీరందించేందుకు చర్యలు తీసుకుంటా
-  అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తా, అభివృద్ధికి జనం మద్దతుతో కృషి చేస్తా.
 - ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
 
 ఇదేనా ‘సత్తా’..!
 ఆయనో మాజీ ఐఏఎస్ అధికారి... ప్రస్తుతం ఓ పార్టీకి అధినేత... ‘అవినీతిని నిర్మూలిద్దాం. సమగ్ర అభివృద్ధికి పాటుపడి సత్తా చాటుదాం’ అనేది ఆయన నినాదం. కానీ తాను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో సీడీపీ(నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం) నిధులు పైసా ఖర్చు చేయలేదు. పదవీకాలం ముగియనుండడంతో ఈ నిధులిక ఖర్చుచేసే అవకాశం కూడా లేదు.   సీడీపీ  కింద  ప్రతి నియోజకవర్గానికి ఏటా రూ.కోటి విడుదల చేస్తుంది. ఇందులో సగం నిధులు ఎమ్మెల్యే సొంతంగా గుర్తించిన పనులకు వినియోగించాలి.
 
 మిగతా సగం నిధులు ఇన్‌చార్జి మంత్రి అనుమతితో ఖర్చు చేయాలి. కూకట్‌పల్లి శాసనసభ్యుడు, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణకు   2013-14 ఆర్థిక సంవత్సరంలో  ఎమ్మెల్యే కోటా కింద రూ.49.75లక్షలు, ఇన్‌చార్జి మంత్రి కోటా కింద రూ.49.75 లక్షల చొప్పున మొత్తం రూ.99.5 లక్షలు విడుదలయ్యాయి. వీటిని ఖర్చు చేయకపోవడంతో ఖజానాలో మూలుగుతున్నాయి. జేపీ ఎమ్మెల్యే కోటాలో 9 పనులను, ఇన్‌చార్జి మంత్రి కోటాలో మరో 16 పనులను ప్రతిపాదించినా వాటి పురోగతిని పట్టించుకోలేదు.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement