సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు బుధవారం చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. రెండు లోక్‌సభ, పది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల సంఘం, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ఓటుపై ప్రచారం సాగించడంతో ఓటర్లలో అవగాహన పెరిగింది. ఫలితంగా ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2009లో 74.56 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి 77.90 శాతం నమోదైంది. అంటే దాదాపు 3.30 శాతం పెరిగింది. ఎండ తక్కువగా ఉండటం కూడా పోలింగ్ పెరగడానికి కారణంగా చెప్పవచ్చు.
ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అన్ని కేంద్రాల వద్ద ఓటర్ల సందడి నెలకొంది. దస్నాపూర్ పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ అహ్మద్‌బాబు, తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం కూడా ఇదే పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కాగా, ఈవీఎంల మొరాయించడంతో వందలాది కేంద్రాల్లో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. సరిచేసేందుకు అధికారుల ఉరుకులు పరుగులు పెట్టారు. దీంతో ఓటర్ల పడిగాపులు కాశారు. పలు కేంద్రాల్లో ఓట్లు గల్లంతు కావడంతో ఓటర్లు ఆందోళనకుఆందోళనకు దిగారు.
పోలింగ్ సరళి
ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 12 గంటల వరకు ఉధృతంగా సాగింది. తర్వాత మూడు గంటలు మందకొడిగా సాగింది. మళ్లీ సాయంత్రం ఊపందుకుంది. పోలింగ్ సమయం ముగిసేలోపు పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చిన ఓటర్లకు స్లిప్పులు పంపిణీ చేసి, ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. మొదటి గంటలో 6.91 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు 14.28 శాతం, 10 గంటలకు 23.19 శాతం, 11 గంటలకు 31.69 శాతం, మధ్యాహ్నం ఒంటి గంటకు 53 శాతం, 3 గంటల వరకు 62 శాతం, ఆరు గంటల వరకు 77.90 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు సిర్పూర్, చెన్నూర్, ఆసిఫాబాద్, ఖనాపూర్‌లలో సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల అధికారులు సరైన సదుపాయాలు కల్పించక పోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. కొన్ని కేంద్రాల్లో టెంట్లు లేకపోవడంతో ఎండలో క్యూలో నిలబడాల్సి వచ్చింది. కొన్నిచోట్ల మంచినీరు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. చెట్ల నీడను ఆశ్రయించాల్సి వచ్చింది.
చెదురుమదురు ఘటనలు
పోలింగ్ సందర్భంగా జిల్లాలో పలుచోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. మామడ మండలం నల్దుర్తిలో పోలింగ్ కేంద్రం వద్ద టెంటు తొలగింపు విషయంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల తీరును నిరసిస్తూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు పోలీసుల వాహన అద్దాలను ధ్వంసం చేశారు. ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లి గ్రామ పంచాయతీలోని వట్టివాగు ప్రాజెక్టు పునరావాస కేంద్రంలోని సుమారు 450 మంది ఓటర్లు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఓటింగ్‌ను బహిష్కరించారు. అధికారులు అక్కడికి చేరుకుని వారితో చర్చించడంతో మధ్యాహ్నం నుంచి ఆ గ్రామస్తులు ఓటేశారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన వేమనపల్లి మండలం ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించారు. జిల్లా ఉన్నతాధికారులు పోలిం గ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. కలెక్టర్ అహ్మద్‌బాబు పలు కేంద్రాలను సందర్శిం చారు. జేసీ లక్ష్మీకాంతం మంచిర్యాల నియోజకవర్గంలో పోలింగ్ తీరును పరిశీలించారు.
ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం
ఓటర్ల నాడిని తమలో బంధించుకున్న ఈవీఎంలు అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తును తేల్చనున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. జిల్లా కేంద్రంలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ(బాయ్స్)లో సిర్పూర్, ఆసిఫాబాద్, ముథోల్, ఆదిలాబాద్, మంచిర్యాల నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపరిచారు. ఏపీఎస్‌డబ్ల్యుఆర్‌జేసీ(గర్ల్స్)లో ఖానాపూర్, చెన్నూరు, బెల్లంపల్లి, నిర్మల్ నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపరిచారు. ఓటరన్న వ్యక్తపరిచిన తీర్పు ఈ నెల 16న వెలవడనుంది. ఫలితాలపై అభ్యర్థులు, నాయకుల ఉత్కంఠ నెలకొంది.
ఓటేశారు..
Published Thu, May 1 2014 2:21 AM | Last Updated on Fri, Aug 17 2018 5:57 PM
Advertisement
Advertisement