సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: ఉద్యమాల పురిటిగడ్డ సిద్దిపేటలో ఎన్నికల వేళ జనచైతన్యం కరువైంది. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలంటూ నెలరోజులుగా అధికారులు ఊరూవాడా ప్రచారం చేసినా అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో ఓటెత్తిన ఓటర్లు సార్వత్రిక సమరంలో విజేతను ఎంపిక చేసేందుకు మాత్రం ఉత్సాహం చూపలేదు. దీంతో సిద్దిపేటలో ఓటింగ్ శాతం పడిపోయింది. కేవలం నెలరోజుల్లోనే 12 శాతం పోలింగ్ శాతం తగ్గడం చూస్తుంటే ఓటుహక్కుపై ప్రజలను మరింత చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది.
సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో 1,01,271 మంది మహిళలు, 1,01,071 మంది పురుషులు మొత్తంగా 2,02,359 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,50,141 మంది సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విస్తృతంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు ఓటరు పండుగ పేరుతో జిల్లా యంత్రాంగం ప్రోత్సాహకాలను ప్రకటించినప్పటికి, సార్వత్రిక పోరుకు 52,218 మంది ఓటర్లు దూరంగా ఉన్నారు. మరోవైపు ఓటు హక్కును వినియోగించుకున్నవారిలో మహిళలే అత్యధికంగా ఉన్నారు. పోలింగ్ సరళిని విశ్లేషిస్తే సిద్దిపేట నియోజకవర్గంలో 74.20 శాతం పోలింగ్ నమోదైంది.
స్థానిక సంస్థల్లో ఉత్సాహం...
గత నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో 82 శాతం పోలింగ్ శాతం నమోదు కాగా, అప్పట్లో సుమారు 80 శాతం మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోనే అత్యధికం సిద్దిపేట మండలం పుల్లూర్ గ్రామ మధిర బండచెర్లపల్లి 20 నంబరు పోలింగ్ కేంద్రంలో 96.34 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా సిద్దిపేట పట్టణంలోని మెరిడియన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 141/ఎ పోలింగ్ కేంద్రంలో 41.90 శాతం పోలింగ్ నమోదైంది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో సగటున 83 శాతం పోలింగ్ నమోదైంది.
సార్వత్రికంలో నిరుత్సాహం..
సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో సిద్దిపేట, నంగునూరు, చిన్నకోడూరుతో పాటు అర్బన్ ప్రాంతంలోని 243 కేంద్రాల్లో బుధవారం పోలింగ్ జరిగింది. ఇప్పటికే అధికారులు ఓటు హక్కుపై విస్తృత ప్రచారం నిర్వహించారు. మరోవైపు జిల్లా కలెక్టర్ ఒక అడుగు ముందుకు వేసి అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు కోసం అనేక ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఓటువేసిన వారికి పెట్రోల్, డిజిల్, నిత్యవసర కొనుగోళ్లలో రాయితీని ప్రకటించారు. అదే విధంగా 95 శాతం పోలింగ్ నమోదైన ప్రాంతానికి రూ. 2 లక్షల నజరానాను ఇస్తామన్నారు. అయితే సిద్దిపేటలో మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే చెప్పాలి.
సిద్దిపేట పట్టణం ఝలక్..
మెరుగైన పోలింగ్ శాతం నమోదుతో భారీ మెజార్టీ వస్తుందనే నేతల అలోచనలకు, అంచనాలకు సిద్దిపేట పట్టణం ఝలక్ ఇచ్చింది. పోలింగ్ ప్రక్రియ రికార్డుల ప్రకారం నియోజకవర్గంలో అత్యల్పంగా సిద్దిపేట పట్టణంలో పోలింగ్ నమోదు కావడం విశేషం. మిగతా మూడు మండలాల్లో 80శాతంపైగా పోలింగ్ నమోదు కాగా, పట్టణంలో అంచనాలకు భిన్నంగా 63.42 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. సిద్దిపేట అర్బన్‌లో ఏర్పాటు చేసిన 91 పోలింగ్ కేంద్రాల్లో 87,451మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉండగా, బుధవారం జరిగిన పోలింగ్‌లో కేవలం 55,463మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వీరిలో పురుషులు 27,899 మంది కాగా, మహిళలు 27, 564 మంది ఉన్నారు. అదే విధంగా సిద్దిపేట మండల పరిధిలో 44,135 మంది ఓటర్లకు గాను 36, 143 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఇక్కడ 81.89 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు చిన్నకోడూరు మండలంలో 40,985 ఓట్లకు గాను 34,073 ఓట్లు పోలయ్యాయి. మండలంలో 83.14 శాతం నమోదైంది. నంగునూరు మండల పరిధిలో 29,788 ఓట్లకు గాను 24,462 ఓట్లు పడ గా, పోలింగ్ శాతం 82.12 శాతంగా నమోదైంది.
ఓటెత్తని ఉద్యమగడ్డ
Published Fri, May 2 2014 12:01 AM | Last Updated on Tue, Aug 14 2018 4:51 PM
Advertisement
Advertisement