సాక్షి, సంగారెడ్డి: సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. మెదక్, జహీరాబాద్ లోక్‌సభతో పాటు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం నిర్వహించిన పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నిక్షిప్తమైంది. మే 16వ తేదీన కౌటింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. దీంతో అభ్యర్థులు అప్పటివరకు ఉత్కంఠగా నిరీక్షించక తప్పని పరిస్థితి నెలకొంది.
జిల్లావ్యాప్తంగా 2,678 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించిన 6 వేల ఈవీఎం యంత్రాలను స్ట్రాంగ్ రూంలకు తరలించి భద్రపరుస్తున్నారు. ఈవీఎంలను భద్రపరిచేందుకు మూడు ప్రైవేటు విద్యాలయాల్లో స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేశారు. ఈ స్ట్రాంగ్ రూంల చుట్టూ మూడంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశారు. వీటి పరిసర ప్రాంతాల్లో వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలను బిగించారు. స్ట్రాంగ్ రూముల కిటికీలకు సైతం సీలు వేశారు.
జహీరాబాద్ లోక్‌సభ పరిధిలోని జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను సంగారెడ్డి మండలం కాశీపూర్‌లోని డీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు.
మెదక్ లోక్‌సభ పరిధిలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను సంగారెడ్డి మండలం ఫసల్‌వాదిలోని ఎంఎన్‌ఆర్ వైద్య కళాశాల భవనంలోని స్ట్రాంగ్ రూంలో ఉంచారు.
మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను పటాన్‌చెరు మండలం రుద్రారం పరిధిలో గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు.
ఓటు యంత్రాల్లో... అభ్యర్థుల భవితవ్యం
Published Wed, Apr 30 2014 11:40 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement