ఎనిమిదిలోనూ భారీ పోలింగ్ | Election 2014: Polling in Seven States in Phase 8, uphill battle for Congress | Sakshi
Sakshi News home page

ఎనిమిదిలోనూ భారీ పోలింగ్

Published Thu, May 8 2014 2:54 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

Election 2014: Polling in Seven States in Phase 8, uphill battle for Congress

* 7 రాష్ట్రాల్లోని 64 లోక్‌సభ స్థానాల్లో 63.8 శాతం పోలింగ్
* అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 81.28%
* 41 నియోజకవర్గాలకు మే 12న చివరి విడత ఎన్నికలు

 
 న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరంలో 8వ దశ ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలు సహా ఏడు రాష్ట్రాల్లోని 64 లోక్‌సభ నియోజకవర్గాల్లో బుధవారం పోలింగ్ ముగిసింది. మొదటి విడత నుంచి ఓటెత్తుతున్న భారీ పోలింగ్ ఈ దశలోనూ కొనసాగింది. మొత్తం 9.5 కోట్ల ఓటర్లకు గానూ.. దాదాపు 6.06 కోట్ల మంది (63.8%) తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆయన సోదరుడు వరుణ్ గాంధీ, ఎల్జేపీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి సహా 1737 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయింది.
 
  బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో ఓ పోలింగ్ బూత్‌ను ఆక్రమించేందుకు కొందరు దుండగులు ప్రయత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించారు. దాంతోపాటు, కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్  దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటివరకు ఎన్నికలు జరిగిన 502 స్థానాల్లో రికార్డుస్థాయిలో 66.27% పోలింగ్ నమోదయిందని ఎన్నికల సంఘం డెరైక్టర్ జనరల్ అక్షయ్ రౌత్ వెల్లడించారు. 2009 ఎన్నికల్లో ఈ 502 నియోజకవర్గాల్లో 57.74 శాతం పోలింగ్ మాత్రమే నమోదయిందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తరువాత ఈ శాతం మరింత పెరగొచ్చన్నారు.
 
     ఈ విడతలో అత్యధిక శాతం పోలింగ్ పశ్చిమబెంగాల్‌లో నమోదైంది. అక్కడ 81.28% ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2009 ఎన్నికల్లో ఈ స్థానాల్లో 77.72% ఓటింగ్ నమోదైంది.
     ఉత్తరప్రదేశ్‌లో 55.52%, బీహార్‌లో 58% పోలింగ్ నమోదయింది. ఉత్తరప్రదేశ్‌లోని 15 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు హోరాహోరీ తలపడ్డాయి. రాహుల్‌గాంధీ బరిలో ఉన్న అమేథీలో 55.2% పోలింగ్ నమోదయింది. 2004 నుంచి వరుసగా ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న రాహుల్‌గాంధీ.. మొదటిసారి ఈ ఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల వద్దకు వెళ్లి ఎన్నికల సరళిని పరిశీలించారు.
     జమ్మూ, కాశ్మీర్‌లోని బారాముల్లాలో మాత్రం వేర్పాటు వాదుల భయానికి ఓటర్లు ఓటేసేందుకు ముందుకురాలేదు. బారాముల్లా, లడఖ్ స్థానాల్లో 49.96% పోలింగ్ మాత్రమే నమోదైంది. గత ఎన్నికల్లో ఇది 39.68 శాతమే.
     నాలుగు స్థానాల్లో ఎన్నికలు జరిగిన హిమాచల్‌ప్రదేశ్‌లో 66.5%, ఐదు స్థానాల్లో పోలింగ్ జరిగిన ఉత్తరాఖండ్‌లో 62% పోలింగ్ నమోదైంది. 2009 ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌లో 53.7%, ఉత్తరాఖండ్‌లో 53.68% నమోదయింది.
     మొత్తంమీద ఈ విడత ఎన్నికల్లో బుధవారం నాటికి దేశం మొత్తంమీద 502 స్థానాల్లో పోలింగ్ పూర్తవగా.. మిగిలిన 41 నియోజకవర్గాల్లో మే 12న ఎన్నికలు జరగనున్నాయి.
 
 ఓటేసిన తొలి ఓటరు
 కినౌర్: స్వతంత్ర భారత తొలి ఓటరు.. శ్యాంశరణ్ నేగి బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 97 ఏళ్ల నేగి హిమాచల్ ప్రదేశ్‌లోని కినౌర్ జిల్లా కల్పాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం.. ఇంకు పూసిన చూపుడు వేలిని మీడియాకు చూపారు. హిమాచల్‌ప్రదేశ్ సాంప్రదాయ టోపీ ధరించి, ఊతకర్ర సహాయంతో భార్యతో కలసి ఉదయం 6.55 గంటలకే పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయనకు ఎన్నికల సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఓటేసి బయటకొచ్చిన నేగీని శాలువా కప్పి సత్కరించారు.
 
  ‘నేను తొలి ఓటు వేసిన రోజు ఇప్పటికీ జ్ఞాపకముంది. ఆ ఆనందం, ఆ ఉద్వేగం జ్ఞాపకమున్నాయి. ఈ సారీ ఓటు వేశాను’ అని ఆయన అన్నారు. 1951 అక్టోబర్ 25 నుంచి 1952 ఫిబ్రవరి వరకు జరిగిన దేశ తొలి సాధారణ ఎన్నికల్లో తొలి ఓటు ఆయనే వేశారు. అప్పుడు ఉపాధ్యాయుడిగా ఉన్న నేగి వయస్సు 34 ఏళ్లు. ఆనాడు తొలి పోలింగ్ కేంద్రాన్ని కల్పాలోనే ఏర్పాటుచేశారు. అక్కడే ఎన్నికల విధుల్లో ఉన్న నేగి తొలుత తానే ఓటేశారు. దీంతో ఎన్నికల సంఘం ఆయనను భారత తొలి ఓటరుగా గుర్తించింది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేస్తూనే ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement