సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం..30 లక్షలమందికిపైగా ఓటర్లు..హేమాహేమీలు పోటీచేశారు..అయినా చివరకు పోలింగ్ శాతం పెరగలేదు. విస్తృత ప్రచారం చేసినప్పటికీ మల్కాజిగిరి నియోజకవర్గంలో పోలింగ్ పెద్దగా పుంజుకోలేదు. అంతా పట్టణ ఓటర్లు ఉన్నప్పటికీ ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. 51.27 శాతం మేర మాత్రమే పోలింగ్ నమోదైన ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి. 2009 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్‌శాతం తగ్గడం గమనార్హం.
తగ్గిన జాబితాలో ఎల్బీనగర్,మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్,కూకట్‌పల్లి నియోజకవర్గాలున్నాయి. స్వల్పంగా పోలింగ్‌శాతం పెరిగిన జాబితాలో ఉప్పల్, మేడ్చల్ నియోజకవర్గాలున్నాయి. పోలింగ్‌శాతాలను బట్టి చూస్తే మేడ్చల్ మినహా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో సగ ంమంది ఓటర్లు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం.
పోలింగ్ బేజార్ : మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టణ ఓటర్లు,విద్యావంతులు, మేధావులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు అధికంగా ఉన్నారు. సీమాంధ్ర జిల్లాలతో పాటు,దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వారు విద్య,ఉద్యోగ,ఉపాధి,వ్యాపార,వాణిజ్య అవసరాల కోసం ఆయా ప్రాంతాల్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. భిన్నవర్గాలు, మతాలు,ప్రాంతాల వారు నివసిస్తున్నందున ఈ ప్రాంతాన్ని ‘మినీఇండియా’ అని కూడా అంటుంటారు. వృత్తివిద్య, ఉన్నత విద్యావకాశాలు, బల్క్‌డ్రగ్, ఫార్మా పరిశ్రమలు,ఐటీ సంస్థలకు నెలవుకావడంతో ఈ ప్రాంతం శరవేగంగా విస్తరిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఓటింగ్ విషయానికి వచ్చే సరికి ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
పోలింగ్ శాతం తగ్గడానికి కారణాలివే..
18 నుంచి 35 ఏళ్ల మధ్యనున్న మెజార్టీ యువత ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. సెలవుదినం కావడంతో ఇంటికి లేదా ఇతర వ్యాపకాలతో కాలక్షేపం చేశారు.
ప్రసార మాధ్యమాలు,సోషల్ మీడియాలో ప్రచారహోరు పెరగడంతో ఏ పార్టీ అభ్యర్థికి ఓటేయాలో తేల్చుకోలేక అయోమయానికి గురయ్యారు.
జీహెచ్‌ఎంసీ యంత్రాంగం పోలింగ్ చీటీలు సరిగ్గా పంపిణీ చేయకపోవడంతో చాలామంది స్లిప్పు లేదన్న సాకుతో పోలింగ్ కేంద్రం తెలియక ఇంటికి పరిమితమయ్యారు.
పోలింగ్ బూత్‌ల కేటాయింపు అస్తవ్యస్తంగా మారడం కూడా పోలింగ్ శాతం తగ్గడానికి ఒక కారణమని చెప్పొచ్చు.
ఏ పార్టీకి ఓటు వేసినా తమ తలరాత మారదన్న నిస్పృహ పెరగడం.
అపార్ట్‌మెంట్‌వాసులు తమ సమస్యల పరిష్కారానికి రాజకీయ నేతలు ఏమాత్రం ఉపయోగపడరన్న అభిప్రాయంతో ఉండడం.
పలు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఆయా పార్టీల అభ్యర్థులు పలు కాలనీలు,బస్తీల్లో అసలు ప్రచారమే చేయలేదు. ప్రచార బాధ్యతలను ద్వితీయశ్రేణి నాయకగణం,కార్యకర్తలపైనే నెట్టివేశారు. దీంతో మొక్కుబడిగా ప్రచారం సాగింది.
స్థానిక సమస్యల పరిష్కారానికి అభ్యర్థులు నిర్దుష్టమైన ప్రణాళికలను,హామీలను మేనిఫెస్టోలో పేర్కొనకపోవడం.
జాబితాలో తమ పేరు లేదేమోనన్న ఆందోళనతో చాలామంది పోలింగ్‌బూత్‌ల ముఖమే చూడలేదు.
ఓటేసేందుకు పోలింగ్‌బూత్‌లకు వెళ్లిన పలువురు జాబితాలో తమ పేరు లేకపోవడంతో ఇంటికి తిరుగుముఖం పట్టారు.
ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్న నవయువత ఓటు వేసేందుకు ఉత్సాహం చూపలేదు.
‘మల్కాజ్’పై ఓటరు నారాజ్
Published Fri, May 2 2014 12:24 AM | Last Updated on Mon, Oct 8 2018 8:52 PM
Advertisement
Advertisement