పోలింగ్ శాతంలో నామమాత్రపు వృద్ధి మాత్రమే నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా పెరిగిన సగటుతో పోల్చితే ఇది చాలా తక్కువ. హైదరాబాద్ తర్వాత అత్యల్ప పోలింగ్ జరిగిన జిల్లాగా రంగారెడ్డి చెత్త రికార్డును మరోసారి సొంతం చేసుకుంది. 2009 ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం ఓట్లలో 58.16 శాతం పోలవగా బుధవారం జరిగిన ఎన్నికల్లో 61.11 శాతం పోలింగ్ జరిగింది.
గతం కంటే 3 శాతం వృద్ధి మాత్రమే కనిపిం చింది. కాగా తెలంగాణలో క్రితం సారి కంటే దా దాపు 12 శాతం పోలింగ్ పెరిగింది. జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో అత్యధికంగా 79.68 శాతం పోలింగ్ నమోదయ్యింది. 78.14, 78.12 శాతాలతో ఇబ్రహీంపట్నం, చేవెళ్ల వరుస స్థానాల్లో నిలిచాయి. అత్యల్పంగా ఎల్బీనగర్‌లో 47 శాతం పోలింగ్ జరి గింది. 49.50, 49.63 శాతాలతో శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
గ్రామాలే నయం
జిల్లాలో మొత్తం 53,48,927 మంది ఓటర్లుండగా వారిలో కేవలం 29,88,196 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎప్పటిలాగే పట్టణ, నగర ప్రాంతాల కంటే గ్రామాల్లోనే అత్యధిక శాతం ప్రజలు ఓటు విలువను గుర్తించారు. వెనుకబడిన, గ్రామీణ ప్రాంతాలైన తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నంలలో హర్షించదగిన స్థాయిలో పోలింగ్ నమోదైంది. నగర శివారు స్థానాలు కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్, ఉప్పల్, కూకట్‌పల్లిలో తక్కువ స్థాయిలో ఓట్లు పోలయ్యాయి. పట్టణ ఓటర్లను చైతన్యపరిచేందుకు ఎన్నికల కమిషన్, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిలో మార్పు రాలేదు. ఉద్యోగులు, కార్మికులు, ఉన్నతస్థాయి వర్గాల ప్రజలను ఓటు హక్కు గురించి వివరించినా పట్టించుకోలేదు. ఎన్నికల రోజున ఓటేసేందుకంటే తమ సొంత పనులు చక్కదిద్దుకునేందుకే నగర ఓటర్లు ప్రాధాన్యమిచ్చారు.
ఇతరులు నిల్
జిల్లాలో అటు పురుషులు, ఇటు మహిళలు కాని ఇతర ఓటర్లు 606 మంది ఉండగా ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదు. నేతల నామినేషన్లు, ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్న హిజ్రాలు పోలింగ్ రోజు మాత్రం బయటకు రాలేదు. హిజ్రాలకు సమాన హక్కులు కల్పిస్తూ ఇటీవల సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సందర్భం గా హర్షాతిరేకాలు వ్యక్తం చేసినా.. తమ హక్కులను ఉపయోగించుకోవడంలో వెనుకబడిపోతున్నారు.
ఓటింగ్ తగ్గడానికి కారణాలివే
జిల్లాలో, ముఖ్యంగా శివారు నియోజకవర్గాల్లో అత్యల్ప ఓటింగ్ నమోదుకు ప్రధాన కారణం ఒక్కొక్కరికి రెండు చోట్ల ఓట్లుండటమే. ఈ నియోజకవర్గాల్లో తెలంగాణ, సీమాంధ్ర జిల్లాల నుంచి వలస వచ్చిన వారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నివాసం ఏర్పరుచుకున్న వారు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరంతా తమ నివాస ప్రాంతంతోపాటు సొంత ఊళ్లలో కూడా ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఓట్ల డూప్లికేషన్‌ను గుర్తించి రద్దు చేస్తామన్న ఈసీ ఆ పనిలో విఫలమైంది.
దీంతో ఇక్కడ నివసిస్తున్నవారంతా ఎన్నికల రోజు తమ సొంత ఊళ్లకు వెళ్లి ఓటేసి వచ్చారు. అలా వెళ్లలేని వారు కూడా తమ ప్రాంతం కాదనే ఆలోచనతో ఓటేసేందుకు విముఖత చూపారు. స్వయానా ఉన్నతాధికారులు సైతం ఎన్నికల రోజు కొన్ని ప్రాంతాలకు వెళ్లి ఓటేయాలని కోరగా ‘వేసి ఉపయోగమేముంది. ఇక్కడ ఏ ప్రభుత్వమొస్తే మాకేంది’ అనే నిర్లిప్త సమాధానాలు వచ్చాయి. కొంతమందికి సరైన పోలింగ్ వివరాలు అందక, మరికొంత మందికి ఓటరు స్లిప్పులు చేరక, ఇంకొందరికి పోలింగ్ కేంద్రానికి వెళ్లే ఓపిక లేక ఓటు వేయలేదు. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో కొందరు కుటుంబ సమేతంగా విహారయాత్రలకు వెళ్లి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోలేకపోయారు. కాగా.. ఏ పార్టీ వారు గెలిచినా తమను పట్టించుకోవడం లేదని నిరసిస్తూ కొన్ని ఊళ్లు ఓటింగ్‌ను బహిష్కరించాయి.
చైతన్యం కొంతే..
Published Fri, May 2 2014 12:19 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement