ఓటమికి కారణమేమి‘టి’..?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీలు లోక్‌సభ ఎన్నికల్లో పరాజయానికి కారణాలు విశ్లేషించుకునే పనిలో పడ్డారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మరీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించినా ఓటమిపాలవడానికి గల కారణాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలు చర్చించేందుకు గురువారం మధ్యాహ్నం ఢిల్లీలోని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో టీ మాజీ ఎంపీలంతా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, రాజయ్య, వివేక్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వీరు జైపాల్‌రెడ్డితో చర్చించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌పార్టీనే అన్న అంశాన్ని జనంలోకి బలంగా తీసుకుపోవడంలో విఫలమయ్యామని వారు విశ్లేషించుకున్నట్టు సమాచారం.
రాష్ట్ర సాధనలో సమష్టిగా పోరాడినట్టే ఎన్నికల ప్రచారంలో కలిసి ముందుకు వెళ్లలేకపోయామని కొందరు నాయకులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఇన్‌చార్జీలు, ఇతర ద్వితీయ శ్రేణి నాయకుల వ్యవహార శైలి కారణంగానే ఓటమి పాలయ్యామని మరికొందరు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలోనూ తమకు స్వేచ్ఛ ఇవ్వలేదని, అభ్యర్థుల ఎంపికలో కొందరు సీమాంధ్ర నాయకుల మాటలను పరిగణనలోకి తీసుకున్నారన్న వాదనలు కొందరు వినిపించినట్టు తెలిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గెలిచే అభ్యర్థులకు, తమకు అనుకూలంగా ఉండే వారికి సీట్లు ఇప్పించుకుని ఉంటే వారంతా తమ గెలుపునకు సహకరించేవారన్న ఉద్దేశాన్ని వెలిబుచ్చినట్టు సమాచారం. కాగా, తెలంగాణలో పార్టీ ఓటమికి కారణాలపై ఓ నివేదికను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపాలని వీరు తీర్మానించినట్టు తెలిసింది.