T PCC
-
సీపీఐ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన
సాక్షి, హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరికి నిరసనగా సీపీఐ శుక్రవారం హైదరాబాద్ అర్థనగ్న ప్రదర్శన చేపట్టింది. ఎమ్మెల్యేల కొనుగోలు ఆపాలంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ ఎంపీ అజీజ్ పాషాతో పాటు పలువురు పార్టీ నేతలు అర్థ నగ్నంగా నిరసన తెలిపారు. ’పదవులను అమ్ముకున్న ప్రజా ప్రతినిధులు ఏదైనా అమ్ముకునే సమర్థులు.. అమ్ముడపోయిన ఎమ్మెల్యేల కుటుంబసభ్యులారా...తస్మాస్ ...జాగ్రత్త....’ అని బ్యానర్లు, ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నారాయణ మాట్లాడుతూ... వేలాదిమంది ఓటర్లు నమ్మి అసెంబ్లీకి పంపితే సిగ్గు విడిచి పార్టీలు మారుతున్నారని దుయ్యబట్టారు. జనాన్ని మోసం చేసిన వ్యక్తి కుటుంబ సభ్యులను అమ్మడానికి కూడా వెనకాడరని ఆయన మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన వాళ్లు సిగ్గుపడాలని విమర్శించారు. కేసీఆర్ కంటే వైఎస్ జగన్ చిన్నవాడని, అతడిని చూసి కేసీఆర్ నేర్చుకోవాలంటూ హితవు పలికారు. నరేంద్ర మోదీ, అమిత్ షా, కేసీఆర్ ముగ్గురు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని నారాయణ మండిపడ్డారు. ప్రతిపక్షం లేకపోతే ప్రజలే ప్రతిపక్షంగా తయారవుతారని అన్నారు. టీఆర్ఎస్కు ఎంఐఎం వంటింటి కుందేలంటూ ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: ఎమ్మెల్సీల అనర్హతపై తీర్పు వాయిదా తప్పు చేయకపోతే చర్చకు సిద్ధమా? -
కాంగ్రెస్‌లో మిగిలేది ‘ఆ ముగ్గురే’
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనం ఖాయమని ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌లో ‘ఆ ముగ్గురు’ మాత్రమే మిగులుతారని, మిగిలిన వారంతా టీఆర్ఎస్లోకే వస్తారని అన్నారు. మూడు, నాలుగు రోజుల్లో విలీన ప్రక్రియ పూర్తి అవుతుందని, విలీనానికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల బీఫారం కోసం వచ్చామని తెలిపారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఆదివారం అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ పథకాలకు ఆకర్షితులమయ్యాయం. మా ప్రాంతం, మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం... పెండింగ్ సమస్యల పరిష్కారం, ప్రాజెక్టుల పూర్తి కోసం కేసీఆర్ నాయకత్వంలో పని చేయాలని నిర్ణయించుకున్నాం. టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభపక్షం విలీనం కచ్చితంగా జరుగుతుంది. కాంగ్రెస్ మెజారిటీ ఎమ్మెల్యేలం మేమే ఉన్నాం. ఇప్పటికే పది మంది కలిసి వచ్చాం. ఒకటిరెండు రోజుల్లో అది కూడా జరుగుతుంది. విలీనం ఖాయం. ఎప్పుడనేది అందరికీ కంటే ముందుగా మీడియాకే చెబుతాం. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో పుట్టగతులు ఉండవు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇస్తారు. సీఎం కేసీఆర్ కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ రాష్ట్రంలో, దేశంలోనే బలమైన రాజకీయశక్తిగా ఏర్పడుతుంది. కాంగ్రెస్‌లో ఆ ముగ్గురే మిగులుతారు. మిగిలిన వారంతా టీఆర్ఎస్లోకి వస్తారు’ అని అన్నారు. టీఆర్ఎస్ బీపారాల పంపిణీ... స్థానిక సంస్థల ఎన్నికల బీఫారాలను పంపిణీని టీఆర్ఎస్ మొదలుపెట్టింది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించిన వారికి సైతం టీఆర్ఎస్ బీఫారాలను ఇవ్వాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం అసెంబ్లీకి వచ్చారు. వారి నియోజకవర్గాల్లోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల సంఖ్యకు అనుగుణంగా జాబితాను అందజేసి టీఆర్ఎస్ బీఫారాలను తీసుకెళ్లారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్‌రెడ్డిని కలిసి బీఫారాలను తీసుకెళ్లినట్లు తెలిసింది. మరోవైపు టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభపక్షం విలీనం ప్రక్రియ కోసమే ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినట్లు తెలిసింది. విలీనం ప్రక్రియకు సంబంధించిన పత్రాలను సిద్ధం చేయడంలో భాగంగానే ఈ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ అధిష్టానం ఆహ్వానించినట్లు తెలిసింది. -
అనారోగ్యంతో టీపీసీసీ సభ్యుడి మృతి
నారాయణఖేడ్ : మాజీ ప్రభుత్వ న్యాయవాది టీపీసీసీ సభ్యులు పి.విష్ణువర్ధన్‌రెడ్డి(50) అనారోగ్యంతో గురువారం మృతిచెందారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గోదుమగామలో జన్మించిన విష్ణువర్ధన్‌రెడ్డి చిన్నతనం నుంచి నారాయణఖేడ్‌లో మేనమామ దివంగత మాజీ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి ఆధ్వర్యంలో నారాయణఖేడ్‌లో చదువుకొని న్యాయవాదిగా పట్టాపొంది సేవలందించారు. రెండుమార్లు దాదాపు పదేళ్ళపాటు సంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సమర్థవంతంగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం జుక్కల్ నియోజకవర్గం నుంచి టీపీసీసీ సభ్యులు కూడా కొనసాగుతున్నారు. ఆయన గత కొద్ది రోజుల కిందట అనారోగ్యానికి గురి కావడంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. న్యాయవాది విష్ణువర్ధన్‌రెడ్డి మృతి చెందడం పట్ల పలువురు న్యాయవాదులు సంతాపాన్ని ప్రకటించారు. విష్ణువర్ధన్‌రెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన మృతిపై టీపీసీసీ సభ్యులు సంజీవరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భోజిరెడ్డిలు సంతాపం తెలిపారు. -
మద్దతా... తటస్థమా!
నిరుద్యోగ నిరసనపై టీపీసీసీ తర్జనభర్జన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన ర్యాలీపై ఎలాంటి వైఖరిని ప్రకటించాలనే దానిపై టీపీసీసీలో తర్జనభర్జన జరుగుతోంది. మా ఉద్యోగాలు మాకు కావాలనే నినాదంతో ఈ నెల 22న హైదరాబాద్‌లో నిరుద్యోగ నిరసన ర్యాలీని నిర్వహించాలని తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చింది. దీనికి ఇప్పటికే పలు విద్యా ర్థి, యువజన, ప్రజా, సామాజిక, తెలంగాణ ఉద్యమ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారం లోకి వచ్చిన టీఆర్ఎస్ రెండున్నరేళ్లు దాటినా అన్ని స్థాయిల్లోని అన్ని శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య 6–7 వేల మధ్యనే ఉందని టీపీసీసీ నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఉద్యమ కాలంలో ఎన్నో ఇబ్బందు లకోర్చిన విద్యార్థు లు, నిరుద్యోగులు ఈ రెండున్నరేళ్ల టీఆర్ ఎస్ పాలనలతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నార ని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు... ‘ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడంలేదని, ఉపాధి అవకాశాలను తెలంగాణ రాష్ట్రంలో నూ పొందలేకపోతున్నామని నిరుద్యోగులు ఆగ్రహావేశాల్లో ఉన్నారు. జేఏసీ మంచి సమ స్యను వెలుగులోకి తెస్తున్నది. నిరుద్యోగ నిరసన ర్యాలీ మంచి కార్యక్రమమే. అయితే మద్దతు ఇవ్వాలా... వద్దా అనేదానిపైనే ఒక రాజకీయ పార్టీగా కొన్ని సమస్యలు, భిన్నాభి ప్రాయాలున్నాయి’ అని టీపీసీసీ ముఖ్య నాయకుడొకరు వెల్లడించారు. ‘ఇప్పుడు జేఏసీగా చేస్తున్న పోరాటానికి ప్రతిపక్ష పార్టీ గా మద్దతు ఇవ్వడం, కలసి పోరాడటంలో అభ్యంతరమేమీ లేదు. అయితే భవిష్యత్తులో జేఏసీ ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందితే ఉత్పన్నం కాబోయే పరిణామాలపై నే మీమాంస’ అని టీపీసీసీలో మరో కీలక నేత చెప్పారు. బహిరంగంగా మద్దతు ప్రక టించకుండా, ఎక్కడికక్కడ ఈ ర్యాలీ విజయ వంతం అయ్యేలా సహకరిస్తే సరిపోతుందని కొందరు భావిస్తున్నారు. తటస్థంగా ఉంటే మేలని ఎక్కువమంది నేతలు అభిప్రాయప డుతున్నట్టు తెలుస్తోంది. -
దామోదర దురుసుప్రవర్తన పట్ల భట్టి విచారం
మీడియా ప్రతినిధులపై దామోదర రాజనరసింహ అసభ్య పదజాలంతో విరుచుకుపడిన ఘటనపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క విచారం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపురం గ్రామంలో బుధవారం ఓ కార్యక్రమం సందర్భంగా కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధుల పై దామోదర తిట్ల పురాణం అందుకున్న సంగతి తెలిసిందే. దామోదర అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీనిపై మీడియా ప్రతినిధులు తోగుట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, గురువారం గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా దామోదర వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు నిరసన తెలిపారు. క్షమాపణలు చెబితేనే కార్యక్రమాన్ని కవర్ చేస్తామని తేల్చిచెప్పారు. భట్టి విక్రమార్క విచారం వ్యక్తం చేయడంతో వారు శాంతించారు. -
రాజ్యసభ ఎన్నికల బరిలో వీహెచ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంనుంచి రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో పోటీచేయాలని పీసీసీ నిర్ణయించింది. సిట్టింగ్ సభ్యుడైన వి.హన్మంతరావునే పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనికి అనుగుణంగానే ఏఐసీసీకి, పీసీసీ నివేదికను కూడా పంపింది. వి.హన్మంతరావు, ఇటీవలే టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన గుండు సుధారాణి పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీయే ఈ రెండుస్థానాలను గెలుచుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. అయినా గెలుపోటములకు సంబంధం లేకుండా పోటీకి దిగాలని పీసీసీ భావిస్తోంది. -
'ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే..'
అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే రూల్స్ కమిటీ నిర్ణయాలను తీసుకుందని, రాజ్యాంగవిరుద్ధమైన ఈ నిర్ణయాలను స్పీకరు పున:సమీక్షించాలని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గవర్నరు ప్రసంగానికి అడ్డు తగిలితే, ప్లకార్డులు ప్రదర్శిస్తే ఏడాదిపాటు సస్పెన్షన్ చేయాలనే నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ప్రజల సమస్యలను గవర్నరు ప్రసంగం ప్రతిబింబించకుంటే నిలదీసే హక్కు ఎమ్మెల్యేలకు ఉండాలన్నారు. శాంతియుతంగా, నిర్మాణాత్మకంగా సమస్యల గురించి చర్చించడానికి అవకాశాన్ని ప్రభుత్వం ఇవ్వకుంటే ఎమ్మెల్యేలకు మార్గం ఏమిటని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు ఈటెల, హరీష్‌రావు, కేటీఆర్ పోటీలు పడి బెంచీలు ఎక్కారని, గవర్నరు ప్రసంగాలను చింపేశారని శ్రవణ్ గుర్తుచేశారు. ప్రజల సమస్యలను మాట్లాడనివ్వకుండా, ప్రతిపక్ష సభ్యుల గొంతునొక్కేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కాగా, మాజీ స్పీకరు డి.శ్రీపాదరావు 79వ జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మాజీమంత్రి డి.శ్రీధర్‌బాబు, టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఈ శిభిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నేతలు రక్తదానం చేశారు. -
'నా వంతుగా లక్ష రూపాయలు ఇస్తున్నా'
హైదరాబాద్: తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను పార్టీ తరపున ఆర్థికంగా ఆదుకోవాలని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి లేఖ రాశారు. తన వంతు సాయంగా లక్ష రూపాయలు విరాళం ఇస్తున్నట్టు సుధాకర్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తాజా, మాజీ ప్రజా ప్రతినిధుల నుంచి విరాళాలు సేకరించి రైతులను ఆదుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. రైతు కుటుంబాలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. -
పొన్నాలపై వేటు లేనట్టే(నా)?!
-
ఎంసెట్‌లో ‘నిమిషం’ నిబంధన దారుణం: టీపీసీసీ
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించకపోవడం అమానవీయమని టీపీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. విద్యార్థులు ట్రాఫిక్ ఇబ్బందులు కారణంగా పరీక్షా కేంద్రానికి కాస్త ఆలస్యంగా వస్తున్నారని, ఈ నేపథ్యంలో నిమిషం ఆలస్యమైతే పరీక్షకు అనుమతించకపోవడం దుర్మార్గమైన చర్య అని అభిప్రాయపడ్డారు. నిమిషం నిబంధన వల్ల వేలాది మంది విద్యార్థులు పరీక్షకు దూరమయ్యారన్నారు. కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు ఆలస్యంగా వస్తున్నవారిని అనుమతిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎంసెట్ విషయంలో నిబంధనలను సడలించాలని ప్రభుత్వాన్ని కోరారు. -
ఓటమికి కారణమేమి‘టి’..?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీలు లోక్‌సభ ఎన్నికల్లో పరాజయానికి కారణాలు విశ్లేషించుకునే పనిలో పడ్డారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మరీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించినా ఓటమిపాలవడానికి గల కారణాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలు చర్చించేందుకు గురువారం మధ్యాహ్నం ఢిల్లీలోని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో టీ మాజీ ఎంపీలంతా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, రాజయ్య, వివేక్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వీరు జైపాల్‌రెడ్డితో చర్చించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌పార్టీనే అన్న అంశాన్ని జనంలోకి బలంగా తీసుకుపోవడంలో విఫలమయ్యామని వారు విశ్లేషించుకున్నట్టు సమాచారం. రాష్ట్ర సాధనలో సమష్టిగా పోరాడినట్టే ఎన్నికల ప్రచారంలో కలిసి ముందుకు వెళ్లలేకపోయామని కొందరు నాయకులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఇన్చార్జీలు, ఇతర ద్వితీయ శ్రేణి నాయకుల వ్యవహార శైలి కారణంగానే ఓటమి పాలయ్యామని మరికొందరు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలోనూ తమకు స్వేచ్ఛ ఇవ్వలేదని, అభ్యర్థుల ఎంపికలో కొందరు సీమాంధ్ర నాయకుల మాటలను పరిగణనలోకి తీసుకున్నారన్న వాదనలు కొందరు వినిపించినట్టు తెలిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గెలిచే అభ్యర్థులకు, తమకు అనుకూలంగా ఉండే వారికి సీట్లు ఇప్పించుకుని ఉంటే వారంతా తమ గెలుపునకు సహకరించేవారన్న ఉద్దేశాన్ని వెలిబుచ్చినట్టు సమాచారం. కాగా, తెలంగాణలో పార్టీ ఓటమికి కారణాలపై ఓ నివేదికను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపాలని వీరు తీర్మానించినట్టు తెలిసింది.