అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే రూల్స్ కమిటీ నిర్ణయాలను తీసుకుందని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే రూల్స్ కమిటీ నిర్ణయాలను తీసుకుందని, రాజ్యాంగవిరుద్ధమైన ఈ నిర్ణయాలను స్పీకరు పున:సమీక్షించాలని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గవర్నరు ప్రసంగానికి అడ్డు తగిలితే, ప్లకార్డులు ప్రదర్శిస్తే ఏడాదిపాటు సస్పెన్షన్ చేయాలనే నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.
ప్రజల సమస్యలను గవర్నరు ప్రసంగం ప్రతిబింబించకుంటే నిలదీసే హక్కు ఎమ్మెల్యేలకు ఉండాలన్నారు. శాంతియుతంగా, నిర్మాణాత్మకంగా సమస్యల గురించి చర్చించడానికి అవకాశాన్ని ప్రభుత్వం ఇవ్వకుంటే ఎమ్మెల్యేలకు మార్గం ఏమిటని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నేతలు ఈటెల, హరీష్‌రావు, కేటీఆర్ పోటీలు పడి బెంచీలు ఎక్కారని, గవర్నరు ప్రసంగాలను చింపేశారని శ్రవణ్ గుర్తుచేశారు.
ప్రజల సమస్యలను మాట్లాడనివ్వకుండా, ప్రతిపక్ష సభ్యుల గొంతునొక్కేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కాగా, మాజీ స్పీకరు డి.శ్రీపాదరావు 79వ జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మాజీమంత్రి డి.శ్రీధర్‌బాబు, టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఈ శిభిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నేతలు రక్తదానం చేశారు.