rules committee
-
ప్రత్యేక కోర్టులకు రాజ్యాంగబద్ధత ఉందా?
న్యూఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం పరిపాటి. అయితే, ఇలాంటి కోర్టులకు రాజ్యాంగబద్ధత ఉందా? అని మద్రాస్ హైకోర్టుకు చెందిన త్రిసభ్య క్రిమినల్ రూల్స్ కమిటీ ప్రశ్నించింది. ప్రత్యేక కోర్టులు నేరస్తుడి కేంద్రంగా కాకుండా నేరం కేంద్రంగా(అఫెన్స్ సెంట్రిక్) ఉండాలని తేల్చిచెప్పింది. వీటిని చట్టసభల్లో శాసనం ద్వారా ఏర్పాటు చేయడం లేదని తప్పుపట్టింది. న్యాయ, కార్యనిర్వాహక విభాగం నిర్ణయాలతో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం ఏమిటని వ్యాఖ్యానించింది.త్రిసభ్య కమిటీ తన 80 పేజీల నివేదికను సీనియర్ అడ్వొకేట్ విజయ్ హన్సారియాకు సమర్పించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రత్యేక కోర్టుల అంశంలో సుప్రీంకోర్టు ఆయనను అమికస్ క్యూరీ(విచారణ సందర్భంగా కోర్టుకు సహాయపడే నిష్పక్షపాత సలహాదారు)గా గతంలో నియమించింది. ఈ నివేదికను విజయ్ హన్సారియా సోమవారం సుప్రీంకోర్టుకు అందజేశారు. దీనిపై జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది. రాజ్యాంగబద్ధత లేని ప్రత్యేక కోర్టులతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని త్రిసభ్య కమిటీ తేల్చిచెప్పింది. -
లోక్‌సభ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు
న్యూఢిల్లీ: ప్లకార్డులు పట్టుకుని ఆందోళనలు చేస్తూ లోక్‌సభలో గందరగోళం సృష్టిస్తున్న ఎంపీలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీల ప్రవర్తనను పరిశీలించేందుకు రూల్స్ కమిటీతో సమావేశం అవుతానని ఆమె పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా గురువారం సభా కార్యకలాపాలకూ పలు పార్టీల ఎంపీలు ఆటంకం కలిగించారు. విపక్ష సభ్యులు వివిధ అంశాలపై నిరసనలు, ఆందోళనలు కొనసాగించారు. ఎంతకీ ఆందోళనలు నియంత్రణలోకి రాకపోవడంతో దీనిపై అఖిలపక్ష నేతలతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సమావేశమయ్యారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సభ నడుస్తున్న తీరుపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారని సమాచారం. రూల్స్ కమిటీకి స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఈ కమిటీ సభ్యులు సభలో నిబంధనలు, సభ్యుల ప్రవర్తన, సభా కార్యక్రమాలు జరగాల్సిన తీరుపై స్పీకర్‌కు సలహాలు, సూచనలు చేస్తారు. అవసరమైతే సభా నిబంధనలు, ప్రవర్తనా నియమావళిలో సవరణలు కూడా ప్రతిపాదిస్తారు. కాగా, ఈ ఆందోళనల నడుమనే లోక్‌సభలో రెండు బిల్లులకు ఆమోదం లభించింది. ఉభయసభల్లోనూ రఫేల్, కావేరీ డ్యాం వివాదాలపై కాంగ్రెస్, డీఎంకే, అన్నా డీఎంకే పార్టీ ల సభ్యులు ఆందోళనలు చేపట్టారు. కాగా, లోక్‌సభలో వినియోగదారుల హక్కుల రక్షణ బిల్లు, నేషనల్ ట్రస్ట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ పర్సన్స్ విత్ ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్డేషన్, మల్టిపుల్ డిజెబిలిటీస్ (సవరణ) బిల్లులకు ఆమోదం లభించింది. దివ్యాంగుల బిల్లును ఇప్పటికే రాజ్యసభ ఆమోదించింది. -
'ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే..'
అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే రూల్స్ కమిటీ నిర్ణయాలను తీసుకుందని, రాజ్యాంగవిరుద్ధమైన ఈ నిర్ణయాలను స్పీకరు పున:సమీక్షించాలని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గవర్నరు ప్రసంగానికి అడ్డు తగిలితే, ప్లకార్డులు ప్రదర్శిస్తే ఏడాదిపాటు సస్పెన్షన్ చేయాలనే నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ప్రజల సమస్యలను గవర్నరు ప్రసంగం ప్రతిబింబించకుంటే నిలదీసే హక్కు ఎమ్మెల్యేలకు ఉండాలన్నారు. శాంతియుతంగా, నిర్మాణాత్మకంగా సమస్యల గురించి చర్చించడానికి అవకాశాన్ని ప్రభుత్వం ఇవ్వకుంటే ఎమ్మెల్యేలకు మార్గం ఏమిటని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు ఈటెల, హరీష్‌రావు, కేటీఆర్ పోటీలు పడి బెంచీలు ఎక్కారని, గవర్నరు ప్రసంగాలను చింపేశారని శ్రవణ్ గుర్తుచేశారు. ప్రజల సమస్యలను మాట్లాడనివ్వకుండా, ప్రతిపక్ష సభ్యుల గొంతునొక్కేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కాగా, మాజీ స్పీకరు డి.శ్రీపాదరావు 79వ జయంతి సందర్భంగా గాంధీభవన్‌లో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మాజీమంత్రి డి.శ్రీధర్‌బాబు, టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఈ శిభిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నేతలు రక్తదానం చేశారు. -
డెమొక్రటిక్ పార్టీ ‘కమిటీల్లో’ భారతీయులు
వాషింగ్టన్: అధికారిక డెమొక్రటిక్ పార్టీ ‘కన్వెన్షన్ స్టాండింగ్ కమిటీ’ల్లో భారత సంతతికి చెందిన ముగ్గురు ప్రముఖులు చోటు దక్కించుకున్నారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఎన్నికల్లో పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థులను ప్రకటించడంతో పాటు, ప్రచారానికి అవసరమైన నిధులు సమకూర్చడం వంటి కీలక కార్యకలాపాలు ఈ కమిటీలు నిర్వర్తిస్తాయి. షికాగోకు చెందిన ‘స్పాన్ టెక్’ సీఈఓ స్మితా షా ‘రూల్స్ కమిటీ’ వైస్‌చైర్మన్‌గా నియమితులయ్యారు. అలాగే అధ్యక్షుడు ఒబామా, ప్రస్తుతం హిల్లరీ క్లింటన్‌కు ప్రధాన ఫండ్ రైజర్స్‌లో ఒకరైన షెఫాలీ రజ్దాన్ దుగ్గల్‌ను ఈ కమిటీ సభ్యురాలిగా నియమించారు. ప్రముఖ నేత్రవైద్యుడు, ఎంటర్ప్రెన్యూర్ డాక్టర్ శ్రీధర్ పోతరాజు ‘క్రిడెన్షియల్ కమిటీ’కి నియమితులయ్యారు. ‘డెమొక్రటిక్ నేషనల్ కమిటీ (డీఎన్సీ) చైర్‌వుమన్ డెబ్బీ వాజర్‌మాన్ షల్జ్ ఈ వివరాలు వెల్లడించారు. వీరితోపాటు పాకిస్తాన్ సంతతికి చెందిన సైఫ్ ఖాన్ కూడా రూల్స్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారన్నారు. గతంలో పార్టీ రూల్స్ కమిటీలో పనిచేసిన షా... 2012లో డీఎన్సీ పార్లమెంటేరియన్‌గా సేవలందించిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అమెరికా హోలోకౌస్ట్ మెమోరియల్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా దుగ్గల్ సేవలిందిస్తున్నారు. పోతరాజు... ‘వైటల్ స్ప్రింగ్ టెక్నాలజీస్ ఇంక్’ సాఫ్ట్వేర్ కంపెనీ వ్యవస్థాపకుడుగా ఉన్నారు. -
సమస్యల ప్రాతిపదికన చర్చ
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి సమావేశాల్లో సమస్యల ప్రాతిపదికనే ఆయా అంశాలపై చర్చ ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్ అధ్యక్షతన మంగళవారం రూల్స్ కమిటీ సమావేశం జరిగింది. శాసనసభా వ్యవహారాల మంత్రి టి.హరీశ్‌రావు, కమిటీ సభ్యులు హాజరయ్యా రు. ఉమ్మడి ఏపీ మండలి నిబంధనలకే సవరణలు చేసి తెలంగాణ మండలికి అనుగుణంగా మార్పులు చేయనున్నారు. శనివారం నుంచి మొదలుకానున్న మండలి సమావేశాలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరపనున్నారు. ప్రశ్నోత్తరాల తర్వాతనే వాయిదా తీర్మానాలకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. మండలిలో పార్టీలు మారిన సభ్యుల అనర్హత గురించి కాంగ్రెస్ సభ్యుడు ఎం.ఎస్ ప్రభాకర్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఇక, మండలిలో పార్లమెంటరీ కార్యదర్శులు సమాధానం చెప్పే అవకాశం ఉందా అన్న అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశంలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్(ఎజి) నుంచి స్పష్టత తీసుకోవాల్సి ఉందన్న చర్చ జరిగింది