డెమొక్రటిక్ పార్టీ ‘కమిటీల్లో’ భారతీయులు
వాషింగ్టన్: అధికారిక డెమొక్రటిక్ పార్టీ ‘కన్వెన్షన్ స్టాండింగ్ కమిటీ’ల్లో భారత సంతతికి చెందిన ముగ్గురు ప్రముఖులు చోటు దక్కించుకున్నారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఎన్నికల్లో పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థులను ప్రకటించడంతో పాటు, ప్రచారానికి అవసరమైన నిధులు సమకూర్చడం వంటి కీలక కార్యకలాపాలు ఈ కమిటీలు నిర్వర్తిస్తాయి. షికాగోకు చెందిన ‘స్పాన్ టెక్’ సీఈఓ స్మితా షా ‘రూల్స్ కమిటీ’ వైస్‌చైర్మన్‌గా నియమితులయ్యారు. అలాగే అధ్యక్షుడు ఒబామా, ప్రస్తుతం హిల్లరీ క్లింటన్‌కు ప్రధాన ఫండ్ రైజర్స్‌లో ఒకరైన షెఫాలీ రజ్దాన్ దుగ్గల్‌ను ఈ కమిటీ సభ్యురాలిగా నియమించారు.
ప్రముఖ నేత్రవైద్యుడు, ఎంటర్‌ప్రెన్యూర్ డాక్టర్ శ్రీధర్ పోతరాజు ‘క్రిడెన్షియల్ కమిటీ’కి నియమితులయ్యారు. ‘డెమొక్రటిక్ నేషనల్ కమిటీ (డీఎన్‌సీ) చైర్‌వుమన్ డెబ్బీ వాజర్‌మాన్ షల్జ్ ఈ వివరాలు వెల్లడించారు. వీరితోపాటు పాకిస్తాన్ సంతతికి చెందిన సైఫ్ ఖాన్ కూడా రూల్స్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారన్నారు. గతంలో పార్టీ రూల్స్ కమిటీలో పనిచేసిన షా... 2012లో డీఎన్‌సీ పార్లమెంటేరియన్‌గా సేవలందించిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అమెరికా హోలోకౌస్ట్ మెమోరియల్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా దుగ్గల్ సేవలిందిస్తున్నారు. పోతరాజు... ‘వైటల్ స్ప్రింగ్ టెక్నాలజీస్ ఇంక్’ సాఫ్ట్‌వేర్ కంపెనీ వ్యవస్థాపకుడుగా ఉన్నారు.