సమస్యల ప్రాతిపదికన చర్చ
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి సమావేశాల్లో సమస్యల ప్రాతిపదికనే ఆయా అంశాలపై చర్చ ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్ అధ్యక్షతన మంగళవారం రూల్స్ కమిటీ సమావేశం జరిగింది. శాసనసభా వ్యవహారాల మంత్రి టి.హరీశ్‌రావు, కమిటీ సభ్యులు హాజరయ్యా రు. ఉమ్మడి ఏపీ మండలి నిబంధనలకే సవరణలు చేసి తెలంగాణ మండలికి అనుగుణంగా మార్పులు చేయనున్నారు. శనివారం నుంచి మొదలుకానున్న మండలి సమావేశాలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరపనున్నారు.
ప్రశ్నోత్తరాల తర్వాతనే వాయిదా తీర్మానాలకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. మండలిలో పార్టీలు మారిన సభ్యుల అనర్హత గురించి కాంగ్రెస్ సభ్యుడు ఎం.ఎస్ ప్రభాకర్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఇక, మండలిలో పార్లమెంటరీ కార్యదర్శులు సమాధానం చెప్పే అవకాశం ఉందా అన్న అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశంలో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్(ఎజి) నుంచి స్పష్టత తీసుకోవాల్సి ఉందన్న చర్చ జరిగింది