సాక్షి, హైదరాబాద్: ‘నాపై సుపారీ ఇచ్చి అంతమెందించాలనే కుట్ర జరుగుతోంది. నన్ను ఖతం చేయాలని చూస్తున్నారు. నాకేమి జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత’’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం శాసన మండలి ఛైర్మన్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఛైర్మన్ నుంచి నోటీసు వచ్చినందున వివరణ ఇచ్చానని వెల్లడించారు. తగిన కారణాలు తెలిపేందుకు నాలుగు వారాల సమయం కోరానని తెలిపారు.
సామాజిక సేవకుడిగానే తనకు గవర్నర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, తమపై స్వామిగౌడ్ తీరు బాగోలేదని అసహనం వ్యక్తం చేశారు. ఎస్టీని ఐనందుకే తానపై ప్రభుత్వం కుట్ర చేస్తోందని, అక్రమ కేసులు పెట్టి వేధించాలని ప్రభుత్వం చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ సమస్యలపైనే గతంలో తాను రాహుల్ గాంధీని కలిశానని, కాంగ్రెస్ సభ్యుడిని మాత్రం కానని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వాళ్లకో న్యాయం, మాకో న్యాయమా అని ప్రశ్నించారు. తనకు జరిగిన అన్యాయంపై కోర్టుకి వెళ్తానని, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
బ్లాక్ డే..
చట్టాన్ని రక్షించాల్సిన మండలి ఛైర్మన్, రాష్ట్ర సీఎంలే ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్‌పై అనర్హత వేటు వేయాలని శాసన మండలి ఛైర్మన్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక పార్టీని మరోక పార్టీలో విలీనం చేసే అధికారం ఎలక్షన్ కమిషన్‌కు మాత్రమే ఉంటుందని అన్నారు. సీఎల్పీ విలీనం డ్రాఫ్ట్ ప్రగతి భవన్‌లో తయారు చేశారని, కేసీఆర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ చర్రితలో ఇదో బ్లాక్ డే అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment