న్యూఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం పరిపాటి. అయితే, ఇలాంటి కోర్టులకు రాజ్యాంగబద్ధత ఉందా? అని మద్రాస్ హైకోర్టుకు చెందిన త్రిసభ్య క్రిమినల్ రూల్స్ కమిటీ ప్రశ్నించింది. ప్రత్యేక కోర్టులు నేరస్తుడి కేంద్రంగా కాకుండా నేరం కేంద్రంగా(అఫెన్స్ సెంట్రిక్) ఉండాలని తేల్చిచెప్పింది. వీటిని చట్టసభల్లో శాసనం ద్వారా ఏర్పాటు చేయడం లేదని తప్పుపట్టింది. న్యాయ, కార్యనిర్వాహక విభాగం నిర్ణయాలతో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం ఏమిటని వ్యాఖ్యానించింది.త్రిసభ్య కమిటీ తన 80 పేజీల నివేదికను సీనియర్ అడ్వొకేట్ విజయ్ హన్సారియాకు సమర్పించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రత్యేక కోర్టుల అంశంలో సుప్రీంకోర్టు ఆయనను అమికస్ క్యూరీ(విచారణ సందర్భంగా కోర్టుకు సహాయపడే నిష్పక్షపాత సలహాదారు)గా గతంలో నియమించింది. ఈ నివేదికను విజయ్ హన్సారియా సోమవారం సుప్రీంకోర్టుకు అందజేశారు. దీనిపై జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది. రాజ్యాంగబద్ధత లేని ప్రత్యేక కోర్టులతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని త్రిసభ్య కమిటీ తేల్చిచెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment