Special courts
-
మార్గదర్శి దందాపై విచారించాలి
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై రామోజీ, శైలజా కిరణ్ తదితరులపై నమోదు చేసిన కేసులో తాము దాఖలు చేసిన చార్జిషీట్లను గుంటూరు, విశాఖపట్నంలోని డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ప్రత్యేక కోర్టులు ‘రిటర్న్’ చేస్తూ గత నెల 28న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు, కేసును విచారణకు స్వీకరించేలా ఆ కోర్టులను ఆదేశించాలని కోరుతూ సీఐడీ అదనపు ఎస్పీ ఈ అప్పీళ్లను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాల్లో మార్గదర్శి చైర్మన్ చెరుకూరు రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్, ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్‌లతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్లు ఇలా మొత్తం 15 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ అప్పీళ్లపై హైకోర్టు వచ్చే వారం విచారణ జరిపే అవకాశం ఉంది. ఒకే రోజు రెండు కోర్టులు దాదాపు ఒకే రకం ఉత్తర్వులు మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్‌లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్‌ఫండ్ చట్టాల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. దర్యాప్తు చేసి డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లను పరిశీలించిన ప్రత్యేక కోర్టులు, సీఐడీ దాఖలు చేసిన చార్జిషీట్లను రిటర్న్ చేశాయి. గుంటూరులో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఉత్తర్వులు జారీ చేయగా, విశాఖపట్నంలో మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. రెండు కోర్టులు కూడా ఆగస్టు 28వ తేదీనే ఉత్తర్వులు వెలువరించడం విశేషం. రెండు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు దాదాపు ఒకే రకంగా ఉండటం గమనార్హం. జాప్యానికి చాలా కారణాలు.. ‘డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కింద ప్రత్యేక కోర్టు తన పరిధిని వినియోగించాలంటే, నిందితులు చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాలను ఎగవేసినట్లు ఫిర్యాదుతో పాటు ప్రాథమిక ఆధారాలను కోర్టు ముందుంచాల్సి ఉంటుంది. చార్జిషీట్లను పరిశీలిస్తే, ఏ చందాదారు కూడా తమకు చెల్లించాల్సిన మొత్తాలను నిందితులు ఎగవేసినట్లు ఎక్కడా చెప్పలేదు. జాప్యానికి అనేక కారణాలుంటాయి. నిధుల మళ్లింపు డిపాజిటర్ల చట్టం పరిధిలోకి రాదు. భవిష్యత్తు చందా చెల్లింపుల కోసం కొంత మొత్తాలను మార్గదర్శి తమ వద్దే అట్టిపెట్టుకున్నట్లు, ఆ మొత్తాలకు వడ్డీ చెల్లిస్తామని చెప్పినట్లు కొందరు చందాదారులు తమ వాంగ్మూలాల్లో చెప్పారు. దీనిని ఎగవేతగా భావించడానికి వీల్లేదు. ప్రైజ్ మొత్తాలను ఎగవేశారనేందుకు ఆధారాలు సమర్పిస్తేనే ప్రత్యేక కోర్టు జోక్యం చేసుకోవడానికి వీలుంటుంది. కేసు విచారణకు స్వీకరించేంత ఆధారాలు ఏవీ చార్జిషీట్లో లేవు. అందువల్ల చార్జిషీట్లను రిటర్న్ చేస్తున్నాం. ఫిర్యాదుదారు సంబంధిత కోర్టును గానీ, సంబంధిత సమార్థాధికారిని గానీ ఆశ్రయించాలి’ అని రెండూ ప్రత్యేక కోర్టులు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. కళ్లెదుటే చట్ట ఉల్లంఘన కనిపిస్తున్నా.. ఈ ఉత్తర్వులపై సీఐడీ తన అప్పీళ్లలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘గడువు ముగిసి, ష్యూరిటీలు సమర్పించిన తర్వాత కూడా బ్రాంచ్ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయలేదని పలువురు చందాదారులు దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం ఇచ్చారు. కుంటిసాకులు చెబుతూ ష్యూరిటీలను తిరస్కరించడం, అదనపు ష్యూరిటీలు సమర్పించాలని కోరడంతో పాటు ప్రైజ్ మొత్తాలను చెల్లించకుండా మార్గదర్శి ఇబ్బంది పెడుతోందంటూ చందాదారులు స్పష్టంగా చెప్పారు. తమ బ్రాంచ్ బ్యాంకు ఖాతాల్లో తమ మొత్తాలున్నాయో లేదో తెలుసుకోకుండా చందాదారులను మార్గదర్శి అధికారులు అడ్డుకున్నారు. సకాలంలో చెల్లింపులు చేయకపోవడం, చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్‌గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవేయడం వంటివన్నీ కూడా డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 కిందకే వస్తాయి. ఇన్ని ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ప్రత్యేక కోర్టు మాత్రం వాటిని పట్టించుకోకుండా ప్రైజ్ మొత్తాల ఎగవేత జరిగినట్లు కనిపించడం లేదని పేర్కొనడం సరికాదు. చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్‌మనీ చెల్లించకుండా వడ్డీ చెల్లింపు పేరుతో తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, చెల్లింపులు చేయడానికి సరిపడనంత డబ్బు లేకపోవడమే. తమ వద్ద డబ్బు లేదు కాబట్టి, చందాదారులకు చెల్లించాల్సిన డబ్బునే భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాగా తమ వద్ద అట్టిపెట్టుకుని ఆ మొత్తాలను మార్గదర్శి రోటేషన్ చేస్తూ వస్తోంది. ప్రత్యేక ఖాతాల్లో చందాదారుల డబ్బు ఉంచాల్సి ఉన్నప్పటికీ, అలా ఉంచకుండా దానిని ఇతర అవసరాలకు మళ్లించేస్తోంది. ఈ విషయాలన్నింటినీ తగిన ఆధారాలతో చార్జిషీట్లో స్పష్టంగా పేర్కొన్నాం. చార్జిషీట్లను రిటర్న్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రత్యేక కోర్టులు పలు అంశాలను స్పష్టంగా నిర్ధారించాయి. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినకుండానే అలా నిర్ధారించడం చట్ట విరుద్ధం’ అని సీఐడీ తన అప్పీళ్లలో వివరించింది. ఎగవేతలపై స్పష్టంగా వాంగ్మూలాలు ‘చార్జిషీట్లోని అంశాలపై మినీ ట్రయల్ నిర్వహించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5కు ప్రత్యేక కోర్టులు భాష్యం చెప్పాయి. అలా చెప్పి ఉండకూడదు. డిపాజిటర్ల పరిరక్షణచట్ట నిబంధనల ప్రకారం ప్రైజ్ మొత్తాల ఎగవేత శాశ్వతమా లేక తాత్కాలికమా అన్న దాని మధ్య ఎలాంటి తేడా లేదు. కేసును విచారణకు స్వీకరించకుండానే ఆయా అంశాల మధ్య తేడాలు లేవనెత్తడం సమంజసం కాదు. చార్జిషీట్లను లోతుగా పరిశీలిస్తే మార్గదర్శి పాల్పడిన ఉల్లంఘనలు, ఎగవేతలపై చందాదారుల వాంగ్మూలాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. డిపాజిటర్ల పరిరక్షణచట్ట నిబంధనల ప్రకారం ఓ ఆర్థికసంస్థ ఉల్లంఘనలు, ఎగవేతలపై చందాదారుడే ఫిర్యాదుదారు అయి ఉండాల్సిన అవసరం లేదు. చందాదారులకు చెల్లించాల్సిన మొత్తాల ఎగవేత, చెల్లింపుల్లో జాప్యం అంశాలను ప్రత్యేక కోర్టులు పరిగణనలోకి తీసుకోలేదు. సీతంపేట బ్రాంచ్‌లో చందాదారులకు చెల్లింపులు చేయడానికి తగినంత మొత్తాలు లేవన్న విషయం చార్జిషీట్లో స్పష్టంగా ఉంది. ప్రత్యేక కోర్టు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. చార్జిషీట్లో పేర్కొన్నవన్నీ ప్రాథమిక ఆధారాలే అయినప్పటికీ, వాటిని సరైన దృష్టికోణంలో ప్రత్యేక కోర్టులు చూడలేకపోయాయి’ అని సీఐడీ తన అప్పీళ్లలో పేర్కొంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చార్జిషీట్లను రిటర్న్ చేస్తూ ప్రత్యేక కోర్టులు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరింది. తదుపరి తమ కేసును విచారణకు స్వీకరించేలా కూడా ప్రత్యేక కోర్టులను ఆదేశించాలని అభ్యర్థించింది. -
ప్రత్యేక కోర్టులు అక్కర్లేదు: సుప్రీం
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్, పన్నుల ఎగవేత వంటి ఆర్థిక నేరాల కేసుల విచారణ కోసం జిల్లాకో ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేయాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆర్థిక నేరాల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేసేలా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌ను సీజేఐ జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. ‘ ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసుల విచారణకు కోర్టులున్నాయి. పోక్సో కోర్టులున్నాయి. ప్రతి ఒక్క అంశానికి విడిగా కోర్టులు ఏర్పాటుచేస్తూ పోతే కింది స్థాయి జ్యుడీషియల్ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అందుకు ఒప్పకోం’ అంటూ పిల్‌ను తిరస్కరించింది. -
ఎర్రచందనం అక్రమ రవాణా.. హత్య కంటే తీవ్రం
తిరుపతి లీగల్: ఎర్రచందనం అక్రమ రవాణాను మనిషి హత్య కంటే తీవ్రమైన నేరంగా భావించి మరణశిక్ష విధించేలా చట్టంలో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. తిరుపతిలో ఎర్రచందనం కేసుల విచారణ నిమిత్తం గురువారం రెండు కోర్టులను ప్రారంభించిన అనంతరం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాలులో సమావేశం నిర్వహించారు. చదవండి: రాష్ట్రపతి ఎన్నికలో ఏపీ వాటా ఇదీ.. ప్రత్యేకతలెన్నో.. ఎన్నిక ఇలా.. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అత్యంత అరుదైన, విలువైన ఎర్రచందనం తిరుపతి శేషాచలం అడవుల్లో మాత్రమే లభిస్తుందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ అధికంగా ఉండడంవల్లే అక్రమ రవాణా జరుగుతోందన్నారు. స్మగ్లర్లు అటవీ సంపదను కొల్లగొట్టడమే కాకుండా ప్రజలకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా చట్టంలో శిక్షా కాలాన్ని, జరిమానాలను పెంచినా అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడలేదన్నారు. సత్వర న్యాయం అందించాలి.. న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల పాత్ర ఎంత ఉందో.. న్యాయవాదుల పాత్ర అంతే ఉందన్నారు. న్యాయవాదులు కేసులను వాయిదాలు తీసుకోకుండా కేసుల పరిష్కారానికి సహకరించాలన్నారు. భవిష్యత్తు డిజిటల్ వైపు పరుగులు తీస్తోందని, అందుకు తగ్గట్లుగా సీనియర్, జూనియర్ న్యాయవాదులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. ఇక దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న హైకోర్టుల్లో 195 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండగా అందులో 167 పోస్టుల్లో హైకోర్టు న్యాయమూర్తులను నియమించినట్లు తెలిపారు. 11మంది సుప్రీంకోర్టు జడ్జిలను నియమించామన్నారు. 180 న్యాయమూర్తుల నియామక ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నట్లు సీజేఐ తెలిపారు. కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయి న్యాయమూర్తుల పనిలేకుండా కోర్టులు మాత్రమే ఉండేటట్లు భవిష్యత్తులో జరగాలని జస్టిస్ ఎన్వీ రమణ ఆకాంక్షించారు. కేసుల సంఖ్య పెరుగుతోంది : హైకోర్టు సీజేఐ అనంతరం, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోందని, ప్రధానంగా ఐదు జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు త్వరలో ఎర్రచందనం కేసుల విచారణకు మరికొన్ని కోర్టులను ఏర్పాటుచేస్తామన్నారు. అనంతరం సీజేఐని న్యాయమూర్తులు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల న్యాయవాదుల సంఘాల కార్యవర్గ సభ్యులు, న్యాయశాఖ ఉద్యోగులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పోర్ట్‌ఫోలియో జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి, బదిలీపై వెళ్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమానుల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా జడ్జి భీమారావ్, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, హైకోర్టు రిజి్రస్టార్ దుప్పల వెంకటరమణ, తిరుపతి న్యాయవాదుల సంఘ అధ్యక్షులు దినకర్, స్థానిక న్యాయమూర్తులు, న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయశాఖ సిబ్బంది, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు.. ఎర్రచందనం కేసుల విచారణకు ఏర్పాటుచేసిన రెండు కోర్టులను ప్రారంభించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక కోర్టు సెషన్స్ జడ్జిగా ఎన్.నాగరాజు, స్థానిక నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి గ్రంధి శ్రీనివాస్ ఇన్చార్జ్ న్యాయమూర్తిగా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. మరిన్ని కోర్టులు ఏర్పాటుచేయాలి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎర్రచందనం కేసుల విచారణకు తాజాగా ఏర్పాటుచేసిన రెండు కోర్టులే కాకుండా మరిన్ని కోర్టులను రాష్ట్ర హైకోర్టు ఏర్పాటుచేయాలని సీజేఐ సూచించారు. కోర్టులతో పాటు న్యాయమూర్తులు, న్యాయ శాఖ సిబ్బంది నియామకాలు వెంటనే జరగాలని అభిప్రాయపడ్డారు. కోర్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతమిస్తున్న నిధులను పెంచాలన్నారు. ఇన్ని రోజులు ఎర్రచందనం విచారణకు ప్రత్యేక కోర్టు లేకపోవడంతో ప్రస్తుతం 2,340 కేసులకు పైగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు అమాయక ప్రజలు వెళ్లకుండా అటవీ శాఖ సిబ్బంది అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్జీఓలను నియమించి అక్రమ రవాణాను ఆపాలని సీజేఐ సూచించారు. అడవులను కొల్లగొట్టడంవల్ల మానవజాతికి కలిగే దు్రష్పభావాలను అందరూ గమనించాలన్నారు. ఇక తుడా కాంప్లెక్స్‌లోని రెండు భవనాలను రెండు కోర్టుల ఏర్పాటుకు తక్కువ అద్దెకు ఇవ్వడానికి అంగీకరించిన చంద్రగిరి ఎమ్మెల్యే, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సీజేఐ కృతజ్ఞతలు తెలిపారు. -
చెక్ బౌన్స్ కేసులు ఒక ‘వింత’
న్యూఢిల్లీ: భారీగా పేరుకుపోయిన చెక్‌బౌన్స్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టుల ఏర్పాటే సరైనమార్గమని సుప్రీంకోర్టు కేంద్రానికి గురువారం స్పష్టం చేసింది. ఈ దిశలో పార్లమెంటుకు అధికారం కల్పిస్తున్న రాజ్యాంగంలోని 247వ అధికరణను వినియోగించుకోవాలని కేంద్రానికి సూచించింది. కోర్టుల్లో 35 లక్షల చెక్‌బౌన్స్ కేసులు (జిల్లా కోర్టుల్లో పెండింగులో ఉన్న మొత్తం క్రిమినల్ కేసుల్లో 15 శాతం పైగా) పేరుకుపోవడం ఒక ‘వింత’ని కూడా చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల అత్యున్నతస్థాయి ధర్మాసనం వ్యాఖ్యానించింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, బీఆర్ గవాయ్, ఏఎస్ బోపన్న, ఎస్ రవీంద్రభట్‌లు ఉన్నారు. నిర్దిష్ట సమయంలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ (ఎన్ఐ) యాక్ట్ కేసుల పరిష్కార అవసరం ఉందని స్పష్టం చేసిన ధర్మాసనం కేసు తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది. కేంద్రం అభిప్రాయంతో విభేదం ప్రత్యేక కోర్టుల ఏర్పాటుతో చెక్‌బౌన్స్ కేసులు సత్వర పరిష్కారం అయిపోవన్న కేంద్రం అభిప్రాయంతో ధర్మాసనం విభేదించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఆర్థిక సేవల శాఖ (డీఎఫ్ఎస్) తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జిత్ బెనర్జీ తన వాదనలు వినిపిస్తూ, నిందితులు కోర్టులకు హాజరుకాకపోవడం వల్లే ఎన్ఐ యాక్ట్ కేసులు భారీగా పెండింగులో ఉంటున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు వల్ల తగిన ప్రయోజనం ఉండబోదని అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయాన్ని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అంతక్రితం ఈ కేసులో స్వతంత్ర సలహాదారుగా ఉన్న సిద్ధార్థ్ లుథ్రా కూడా డీఎఫ్ఎస్ వాదలను కొట్టిపారేశారు. చట్ట ప్రక్రియ సజావుగా సాగడానికి 247వ అధికరణను కేంద్రం వినియోగించుకోవచ్చని తన వాదనల్లో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ధర్మాసనం బిహార్‌లో పెండింగులో ఉన్న వందలాది బెయిల్ మేటర్లను కూడా ప్రస్తావించడం విశేషం. లిక్కర్ ప్రొహిబిషన్ యాక్ట్ తర్వాత బిహార్‌లో ఈ తరహా పరిస్థితి నెలకొందని బెంచ్ పేర్కొంది. వాదనల తర్వాత అడిషనల్ సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జిత్ బెనర్జీ కూడా చెక్‌బౌన్స్ కేసులపై సుప్రీం సూచనలను స్వాగతించడం గమనార్హం. సుప్రీం అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. అయితే దీనిపై మరింత చర్చ అవసరమని పేర్కొన్నారు. ‘‘ఈ అంశంపై మేము ముందుకు వెళతాం. అయితే ప్రభుత్వం తొలుత ముందుకు రావాలని కోరుతున్నాం’’ అని బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ‘2005 నాటి కేసు విచారణ’ నేపథ్యం.. చెక్‌బౌన్స్‌లు వివిధ కోర్టుల్లో భారీగా పేరుకుపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సూ మోటోగా (తనకు తానుగా) ఈ కేసు గత ఏడాది విచారణకు చేపట్టింది. 2005కు ముందు ఒక కేసు విచారణ సందర్భంగా ఈ సమస్య (కోర్టుల్లో చెక్ బౌన్స్ కేసుల దీర్ఘకాలిక విచారణ అంశం) అత్యున్నత న్యాయస్థానం దృష్టికి వచ్చింది. ఈ అంశంపై ధర్మాసనానికి సలహాలు ఇవ్వడానికి సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లుథ్రా, అడ్వకేట్ కే. పరమేశ్వర్లు నియమితులయ్యారు. కేసులో ఇప్పటికే కేంద్రం, హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్, డీజీపీలు, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ అయ్యాయి. ఈ అంశంపై సిఫారసులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటును బుధవారం ప్రతిపాదించింది. కమిటీలో సభ్యుల పేర్లను సూచించాలని కేంద్రాన్ని ఆదేశించింది. -
ప్రత్యేక కోర్టులకు రాజ్యాంగబద్ధత ఉందా?
న్యూఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం పరిపాటి. అయితే, ఇలాంటి కోర్టులకు రాజ్యాంగబద్ధత ఉందా? అని మద్రాస్ హైకోర్టుకు చెందిన త్రిసభ్య క్రిమినల్ రూల్స్ కమిటీ ప్రశ్నించింది. ప్రత్యేక కోర్టులు నేరస్తుడి కేంద్రంగా కాకుండా నేరం కేంద్రంగా(అఫెన్స్ సెంట్రిక్) ఉండాలని తేల్చిచెప్పింది. వీటిని చట్టసభల్లో శాసనం ద్వారా ఏర్పాటు చేయడం లేదని తప్పుపట్టింది. న్యాయ, కార్యనిర్వాహక విభాగం నిర్ణయాలతో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం ఏమిటని వ్యాఖ్యానించింది.త్రిసభ్య కమిటీ తన 80 పేజీల నివేదికను సీనియర్ అడ్వొకేట్ విజయ్ హన్సారియాకు సమర్పించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రత్యేక కోర్టుల అంశంలో సుప్రీంకోర్టు ఆయనను అమికస్ క్యూరీ(విచారణ సందర్భంగా కోర్టుకు సహాయపడే నిష్పక్షపాత సలహాదారు)గా గతంలో నియమించింది. ఈ నివేదికను విజయ్ హన్సారియా సోమవారం సుప్రీంకోర్టుకు అందజేశారు. దీనిపై జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది. రాజ్యాంగబద్ధత లేని ప్రత్యేక కోర్టులతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని త్రిసభ్య కమిటీ తేల్చిచెప్పింది. -
దిశ: ఫిర్యాదులకు క్వాలిటీ సేవలు అందాలి
సాక్షి, అమరావతి: మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించి విచారణకు ప్రత్యేక కోర్టులు త్వరగా ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అయితే దీనికి సంబంధించిన ఫైలు కేంద్ర హోం శాఖ వద్ద పెండింగులో ఉందని అధికారులు చెప్పగా.. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. క్రిమినల్ లాలో సవరణలు చేస్తూ పంపిన బిల్లుకు ఆమోదం వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం సీఎం జగన్ 'దిశ' చట్టం అమలుపై సమీక్ష నిర్వహించారు. దిశ చట్టాన్ని సమర్థవంతగా అమలు చేయాలని పేర్కొన్నారు. దిశ యాప్ కింద వచ్చే ఫిర్యాదులకు క్వాలిటీ సేవలు అందాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు. వీలైనంత త్వరగా ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి ఈ సందర్భంగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంపైనా సీఎం జగన్ ఆరా తీశారు. దిశ చట్టం కింద కేసుల విచారణకు 13 జిల్లాల్లో 11 మంది ప్రాసిక్యూటర్లు, పోక్సో కేసుల విచారణకు 8 మంది ప్రాసిక్యూటర్లను ప్రత్యేకంగా నియమించామని అధికారులు తెలియజేశారు. దీంతో మిగిలిన చోట్ల కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను త్వరగా నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దిశ చట్టం, యాప్, నంబర్లకు సంబంధించిన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు, ప్రజలు ఎక్కువగా వచ్చి పోయే ప్రాంతాలు, వారు సమావేశమయ్యే చోట్ల పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. అలాగే వీలైనంత త్వరగా ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాలు చేయాలని ఆదేశించారు. (యువతిని కాపాడిన 'దిశ' యాప్) త్వరలో దిశ పెట్రోల్స్ ప్రారంభం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏపీ ప్రభుత్వం దిశ పెట్రోల్‌ను ప్రారంభించనుంది. అందులో భాగంగా 900 స్కూటర్లను ఏర్పాటు చేసింది. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో దిశ మహిళా హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేకంగా కంప్యూటర్, ఫోన్ నంబర్ ఏర్పాటు కానుంది. ఇక్కడ సైకాలజిస్ట్, ఎన్జీఓ సహా న్యాయ సహాయం కూడా లభిస్తుంది. (మహిళల రక్షణ కోసం ఈ–రక్షాబంధన్‌కు శ్రీకారం) దిశ చట్టం కింద ఇప్పటివరకు ముగ్గురికి మరణశిక్ష మరోవైపు దిశ యాప్ 11 లక్షల డౌన్లోడ్లు పూర్తి చేసుకుంది. ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు 502 కాల్స్, 107 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దిశ చట్టం కింద మొత్తం 390 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 7 రోజుల్లోపు ఛార్జి షీటు దాఖలు కాగా 74 కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయి. ఇందులో మరణ శిక్షలు 3, జీవితఖైదు 5, 20 సంవత్సరాల శిక్ష 2, 10 సంవత్సరాల శిక్ష 5, ఏడేళ్లపైన 10, 5 సంవత్సరాలలోపు శిక్షలు మిగతా కేసుల్లో విధించారు. మరో 1130 కేసుల్లో ఛార్జిషీటు దాఖలు చేసినప్పటికీ, ఇంకా కేసు నంబర్లు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. కోవిడ్ కారణంగా కోర్టుల కార్యకలాపాలపై ప్రభావం చూపిందదన్నారు. సైబర్ మిత్ర ద్వారా 265 ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. ('వైఎస్సార్ చేయూత' పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్) 27 వేల సైబర్ ఫిర్యాదులు సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులు ఆపడానికి సైబర్ బుల్లీ వాట్సాప్ నంబర్ అందుబాటులో ఉంది. ఇందులో ఇప్పటి వరకూ 27 వేల ఫిర్యాదులు వచ్చాయి. 780 మంది తరచుగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని గుర్తించగా వీరందరిపైనా కేసులు నమోదు చేశారు. సైబర్ నేరాలు, సైబర్ చట్టాలపైనా అవగాహన కల్పించే ఈ-రక్షా బంధన్‌లోని ప్రత్యేక కార్యక్రమంలో 3.5 లక్షల మంది పాల్గొన్నారు. దిశ వన్ స్టాఫ్ సెంటర్లు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ సెంటర్లు 13 జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో పెట్టామన్నారు. జనవరి నుంచి ఆగస్టు వరకూ 2285 కేసులు వన్‌స్టాప్ సెంటర్లకు వచ్చాయని అధికారులు వివరించారు. -
ప్రత్యేక కోర్టుల్లో న్యాయమూర్తుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలపై జరిగే అత్యాచార కేసులను విచారించేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలు జరిగాయి. 11 ప్రత్యేక కోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేస్తూ హైకోర్టు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం వేర్వేరు పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న న్యాయమూర్తులు ఈ నెల 28 లోగా బాధ్యతలను స్వీకరించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కోర్టు–న్యాయమూర్తుల వివరాలు.. హైదరాబాద్–బి.శ్రీనివాసరావు, ఎల్బీనగర్ –కె.మారుతిదేవి, ఆదిలాబాద్–వై.జయప్రసాద్, వరంగల్–పి.ముక్తి దా, మహబూబ్‌నగర్–పి.ఆనీరోజ్, నల్లగొండ –వి.శారదాదేవి,ఖమ్మం–కె.అరుణకుమారి, కూకట్పల్లి(రంగారెడ్డిజిల్లా) –జె.మైత్రేయి,కరీంనగర్–డి.మాధవికృష్ణ, సంగారెడ్డి (మెదక్ జిల్లా)–ఎం.శ్యాం శ్రీ, నిజామాబాద్–టి.నర్సి రెడ్డి. -
ఏపీలో 8 ప్రత్యేక కోర్టులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది ప్రత్యేక కోర్టులను మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చిన్నారులపై లైంగిక దాడుల కేసులను ఈ ప్రత్యేక కోర్టులు విచారించనున్నాయి. చిత్తూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా,నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. బాలలపై లైంగిక వేధింఫుల పోస్కో చట్టం కింద నమోదైన కేసులను త్వరితగతిన విచారణకు ఈ ప్రత్యేక కోర్టులు మంజూరు చేసినట్లుగా ప్రభుత్వం పేర్కొంది. వందకు పైగా పోస్కో చట్టం కేసులు పెండింగ్ లో ఉన్న జిల్లాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కోర్టులను ఏర్పాటు చేసింది. -
జిల్లాల్లో ‘పోక్సో’ ప్రత్యేక కోర్టులు
న్యూఢిల్లీ: చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించి గురువారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించే చట్టం(పోక్సో) కింద 100కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదైన జిల్లాల్లో, పూర్తిగా కేంద్ర నిధులతో 60 రోజుల్లోపు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర నిధులతో ఏర్పాటయ్యే ఈ కోర్టులు ప్రత్యేకంగా పోక్సో కేసులను మాత్రమే విచారించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి అవగాహన కల్పించేలా, అలాంటి నేరాలు శిక్షార్హమని తెలిపేలా ఒక చిన్న వీడియోను అన్ని సినిమాహాళ్లలో సినిమా ప్రదర్శనకు ముందు చూపాలని ఆదేశించింది. అన్ని టీవీ చానళ్లలోనూ తప్పనిసరిగా ఆ క్లిప్పింగ్‌ను చూపాలని స్పష్టం చేసింది. ఆ వీడియోలో ‘చైల్డ్ హెల్ప్‌లైన్’ నంబరును పొందుపర్చాలని పేర్కొంది. ఫోరెన్సిక్ నివేదిక ఆలస్యం కావడంతో దర్యాప్తులో జాప్యం చోటు చేసుకుంటోం దని సీనియర్ న్యాయవాది గిరి పేర్కొనడంపై స్పందిస్తూ.. ప్రతీ జిల్లాలో పోక్సో కేసుల కోసం ప్రత్యేకంగా ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈలోగా ఫోరెన్సిక్ ల్యాబ్‌లు.. పోక్సో కేసుల నివేదికలను సాధ్యమైనంత త్వరగా అందించాలన్నారు. జడ్జీల నియామకం, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు సిబ్బంది, చిన్నారులకు అనుకూలంగా ఉండే కోర్టు భవనాల్లో మౌలిక వసతులు.. ఇవన్నీ కేంద్ర నిధుల ద్వారానే జరగాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 26వ తేదీకి వాయిదా వేసింది. -
నేతలపై విచారణకు ప్రత్యేక కోర్టులు!
న్యూఢిల్లీ: రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్న నేరపూరిత కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడం పట్ల సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. ఇందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించి, అవసరమైన నిధులను కూడా అంచనా వేసి ఆ వివరాలను తమకు అందించాలని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నవీన్ సిన్హాల ధర్మాసనం బుధవారం కేంద్రాన్ని ఆదేశించింది. ప్రత్యేక కోర్టులకు జడ్జిలు, న్యాయవాదులు, ఇతర సిబ్బంది, మౌలిక వసతుల కల్పన విషయాలను తామే పర్యవేక్షిస్తామంది. 2014 సార్వత్రిక ఎన్నికల నామినేషన్లలో పేర్కొన్న వివరాల ప్రకారం దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై మొత్తంగా 1,581 కేసులు ఉన్నట్లు తేలడం తెలిసిందే. ఈ కేసుల్లో ఎన్నింటిని పరిష్కరించారు? ఎన్ని కేసుల్లో నిందితులను దోషులు లేదా నిర్దోషులుగా తేల్చారనే వివరాలను తమకు అందించాలని కోర్టు కేంద్రాన్ని కోరింది. ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఆత్మారామ్ నాదకర్ణి వాదనలు వినిపిస్తూ రాజకీయ నాయకులు నిందితులుగా ఉన్న కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని ధర్మాసనానికి విన్నవించారు. దోషులుగా తేలిన నేతలు ఎన్నికల్లో పోటీచేయకుండా జీవితకాలం నిషేధం విధించాలన్న ఎన్నికల సంఘం సిఫార్సులను కూడా కేంద్రం పరిశీలిస్తోందన్నారు. కొత్తగా ఏర్పాటు చేయదలచిన ప్రత్యేక కోర్టులను ప్రస్తుతం ఉన్న సీబీఐ కోర్టులతో కలపవచ్చా అని కేంద్రం కోరగా, ‘ప్రత్యేక కోర్టులను మరే కోర్టుతోనూ కలపకూడదు. ఇవి దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేయాల్సినవి’ అని కోర్టు పేర్కొంది. ఒక్కో కోర్టులో 4 వేల కేసులు పెండింగ్! ప్రస్తుతం దేశంలోని కిందిస్థాయి న్యాయస్థానాల్లో ప్రతి కోర్టులో దాదాపు 4 వేల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయని ధర్మాసనం వెల్లడించింది. సుప్రీంకోర్టు గత ఆదేశాల ప్రకారం రాజకీయ నేతలపై కేసుల్లో ఏడాదిలోపు విచారణ పూర్తి చేయాలంటే ఓ జడ్జి ప్రత్యేకంగా ఆ కేసులను మాత్రమే విచారించాల్సి ఉంటుందని ధర్మాసనం అంచనా వేసింది. ప్రజాప్రతినిధుల చట్టంలోని ప్రస్తుత సెక్షన్ల ప్రకారం ఓ రాజకీయ నాయకుడు ఏదైనా నేరపూరితమైన కేసులో దోషిగా తేలిన సందర్భంలో శిక్షా కాలం పూర్తయిన తర్వాత ఆరు సంవత్సరాల వరకు అతను పోటీ చేయడానికి అనర్హుడు. ఇది రాజ్యాంగ విరుద్ధమనీ, ఆ సెక్షన్‌ను కొట్టేయాలని వచ్చిన పిటిషన్‌ను కోర్టు విచారిస్తూ పై వ్యాఖ్యలు చేసింది. వివరాలను సమర్పించేందుకు తమకు ఆరు వారాల గడువు కావాలని ఏఎస్జీ కోరడంతో కేసును డిసెంబరు 13కు వాయిదా వేసింది. -
అత్యాచార కేసులకు ప్రత్యేక కోర్టులు...
హైదరాబాద్: మహిళలపై అత్యాచార కేసులను సత్వరమే విచా రించేందుకు వీలుగా రాష్ట్రంలో కొత్త గా 13 ప్రత్యేక కోర్టులు ఏర్పాట య్యాయి. హైకోర్టు నుంచి వచ్చిన ప్రతిపాదన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో 2, రంగారెడ్డి జిల్లా లో 2 (ఎల్బీనగర్, సైబరాబాద్ డివిజన్), వికారాబాద్, ఆదిలా బాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున ప్రత్యేక కోర్టులు ఏర్పాటయ్యాయి.