మార్గదర్శి దందాపై విచారించాలి | Abolish orders of Special Courts in fraud cases | Sakshi
Sakshi News home page

మార్గదర్శి దందాపై విచారించాలి

Published Fri, Sep 8 2023 4:37 AM | Last Updated on Fri, Sep 8 2023 4:37 AM

Abolish orders of Special Courts in fraud cases - Sakshi

సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై రామోజీ, శైలజా కిరణ్‌ తదితరులపై నమోదు చేసిన కేసులో తాము దాఖలు చేసిన చార్జిషీట్‌లను గుంటూరు, విశాఖపట్నంలోని డిపా­జి­టర్ల పరిరక్షణ చట్టం ప్రత్యేక కోర్టులు ‘రిటర్న్‌’ చేస్తూ గత నెల 28న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ హైకోర్టును ఆశ్రయించింది.

ఈ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు, కేసును విచారణకు స్వీకరించేలా ఆ కోర్టులను ఆదేశించాలని కోరుతూ సీఐడీ అదనపు ఎస్‌పీ ఈ అప్పీళ్లను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాల్లో మార్గదర్శి చైర్మన్‌ చెరుకూరు రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్, ఆడిటర్‌ కుదరవల్లి శ్రవణ్‌లతో పాటు వైస్‌ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, జనరల్‌ మేనేజర్లు, బ్రాంచ్‌ మేనేజర్లు ఇలా మొత్తం 15 మందిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ అప్పీళ్లపై హైకోర్టు వచ్చే వారం విచారణ జరిపే అవకాశం ఉంది.

ఒకే రోజు రెండు కోర్టులు దాదాపు ఒకే రకం ఉత్తర్వులు
మార్గదర్శి చిట్‌ ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆర్థిక అవ­క­తవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్‌  అసిస్టెంట్‌ రిజిస్ట్రార్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్‌లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్‌ఫండ్‌ చట్టాల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. దర్యాప్తు చేసి డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది.

ఈ చార్జిషీట్లను పరిశీలించిన ప్రత్యేక కోర్టులు, సీఐడీ దాఖలు చేసిన చార్జిషీట్లను రిటర్న్‌ చేశాయి. గుంటూరులో ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జి ఉత్తర్వులు జారీ చేయగా, విశాఖపట్నంలో మెట్రో పాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఉత్తర్వులిచ్చారు. రెండు కోర్టులు కూడా ఆగస్టు 28వ తేదీనే ఉత్తర్వులు వెలువరించడం విశేషం. రెండు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు దాదాపు ఒకే రకంగా ఉండటం గమనార్హం. 

జాప్యానికి చాలా కారణాలు..
‘డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్‌ 5 కింద ప్రత్యేక కోర్టు తన పరిధిని వినియోగించాలంటే, నిందితులు చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్‌ మొత్తాలను ఎగవేసినట్లు ఫిర్యాదుతో పాటు ప్రాథ­మిక ఆధారాలను కోర్టు ముందుంచాల్సి ఉంటుంది. చార్జిషీట్‌లను పరిశీలిస్తే, ఏ చందాదారు కూడా తమకు చెల్లించాల్సిన మొత్తాలను నిందితులు ఎగవేసినట్లు ఎక్కడా చెప్పలేదు. జాప్యానికి అనేక కారణాలుంటాయి. నిధుల మళ్లింపు డిపాజిటర్ల చట్టం పరిధిలోకి రాదు.

భవిష్యత్తు చందా చెల్లింపుల కోసం కొంత మొత్తాలను మార్గదర్శి తమ వద్దే అట్టిపెట్టుకున్నట్లు, ఆ మొత్తాలకు వడ్డీ చెల్లిస్తామని చెప్పినట్లు కొందరు చందాదారులు తమ వాంగ్మూలాల్లో చెప్పారు. దీనిని ఎగవేతగా భావించడా­నికి వీల్లేదు. ప్రైజ్‌ మొత్తాలను ఎగవేశారనేందుకు ఆధా­రాలు సమర్పిస్తేనే ప్రత్యేక కోర్టు జోక్యం చేసు­కోవడానికి వీలుంటుంది. కేసు విచారణకు స్వీకరించేంత ఆధారాలు ఏవీ చార్జిషీట్‌లో లేవు. అందువల్ల చార్జిషీట్‌లను రిటర్న్‌ చేస్తున్నాం. ఫిర్యాదు­దారు సంబంధిత కోర్టును గానీ, సంబంధిత సమార్థాధికారిని గానీ ఆశ్రయించాలి’ అని రెండూ ప్రత్యేక కోర్టులు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. 

కళ్లెదుటే చట్ట ఉల్లంఘన కనిపిస్తున్నా..
ఈ ఉత్తర్వులపై సీఐడీ తన అప్పీళ్లలో అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘గడువు ముగిసి, ష్యూరిటీలు సమ­ర్పించిన తర్వాత కూడా బ్రాంచ్‌ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయలేదని పలువురు చందాదా­రు­లు దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం ఇచ్చారు. కుంటిసాకులు చెబుతూ ష్యూరిటీలను తిరస్కరించడం, అదనపు ష్యూరిటీలు సమర్పించాలని కోర­డంతో పాటు ప్రైజ్‌ మొత్తాలను చెల్లించకుండా మార్గ­­దర్శి ఇబ్బంది పెడుతోందంటూ చందాదా­రులు స్పష్టంగా చెప్పారు. తమ బ్రాంచ్‌ బ్యాంకు ఖాతాల్లో తమ మొత్తాలున్నాయో లేదో తెలుసు­కోకుండా చందాదారులను మార్గదర్శి అధికారులు అడ్డుకున్నారు.

సకాలంలో చెల్లింపులు చేయకపోవ­డం, చెల్లించాల్సి­న ప్రైజ్‌ మొత్తాన్ని డిపాజిట్‌గా తమ వద్దే అట్టిపెట్టుకో­వడం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవే­య­డం వంటివన్నీ కూడా డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్‌ 5 కిందకే వస్తాయి. ఇన్ని ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ప్రత్యేక కోర్టు మాత్రం వాటిని పట్టించుకో­కుండా ప్రైజ్‌ మొత్తాల ఎగవేత జరిగినట్లు కనిపించడం లేదని పేర్కొనడం సరికాదు. చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్‌మనీ చెల్లించకుండా వడ్డీ చెల్లింపు పేరుతో తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, చెల్లింపులు చేయడానికి సరిప­డ­నంత డబ్బు లేకపో­వ­డమే.

తమ వద్ద డబ్బు లేదు కాబట్టి, చందాదా­రులకు చెల్లించాల్సిన డబ్బునే భవి­ష్యత్తులో చెల్లించాల్సిన చందాగా తమ వద్ద అట్టిపెట్టుకుని ఆ మొత్తాలను మార్గదర్శి రోటేషన్‌ చేస్తూ వస్తోంది. ప్రత్యేక ఖాతాల్లో చందాదారుల డబ్బు ఉంచాల్సి ఉన్నప్పటికీ, అలా ఉంచకుండా దానిని ఇతర అవస­రా­లకు మళ్లించేస్తోంది. ఈ విషయాలన్నింటినీ తగిన ఆధారాలతో చార్జిషీట్‌లో స్పష్టంగా పేర్కొ­న్నాం. చార్జిషీట్లను రిటర్న్‌ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రత్యేక కోర్టులు పలు అంశాలను స్పష్టంగా నిర్ధారించాయి. స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూ­టర్‌ వాదనలు వినకుండానే అలా నిర్ధారించడం చట్ట విరుద్ధం’ అని సీఐడీ తన అప్పీళ్లలో వివరించింది.

ఎగవేతలపై స్పష్టంగా వాంగ్మూలాలు
‘చార్జిషీట్‌లోని అంశాలపై మినీ ట్రయల్‌ నిర్వహించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్‌ 5కు ప్రత్యేక కోర్టులు భాష్యం చెప్పాయి. అలా చెప్పి ఉండకూడదు. డిపాజిటర్ల పరి­రక్షణచట్ట నిబంధనల ప్రకారం ప్రైజ్‌ మొత్తాల ఎగవేత శాశ్వతమా లేక తాత్కా­లి­కమా అన్న దాని మధ్య ఎలాంటి తేడా లేదు. కేసును విచారణకు స్వీకరించకుండానే ఆయా అంశాల మధ్య తేడాలు లేవనెత్తడం సమంజసం కాదు. చార్జిషీట్‌లను లోతుగా పరిశీలిస్తే మార్గదర్శి పాల్పడిన ఉల్లంఘనలు, ఎగవేతల­పై చందా­దారుల వాంగ్మూలాలు చాలా స్పష్టంగా ఉన్నా­యి.

డిపాజిటర్ల పరి­రక్షణచట్ట నిబంధనల ప్రకారం ఓ ఆర్థికసంస్థ ఉల్ల­ం­ఘనలు, ఎగవేత­లపై చందాదారుడే ఫిర్యా­దు­దారు అయి ఉండాల్సిన అవసరం లేదు. చందాదా­రులకు చెల్లిం­చా­ల్సిన మొత్తాల ఎగ­వేత, చెల్లింపుల్లో జాప్యం అంశాలను ప్రత్యేక కోర్టులు పరిగణ­నలోకి తీసుకోలేదు. సీతంపేట బ్రాంచ్‌లో చందాదారులకు చెల్లింపులు చేయడానికి తగినంత మొత్తాలు లేవన్న విష­యం చార్జిషీట్‌లో స్పష్టంగా ఉంది.

ప్రత్యేక కోర్టు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. చార్జి­షీట్‌­లో పేర్కొన్నవన్నీ ప్రాథమిక ఆధారాలే అయినప్పటికీ, వాటిని సరైన దృష్టికోణంలో ప్రత్యేక కోర్టులు చూడలే­క­పో­యాయి’ అని సీఐడీ తన అప్పీళ్లలో పేర్కొంది. ఈ అంశాల­న్నింటినీ పరిగణనలోకి తీసుకుని చార్జిషీట్‌­లను రిటర్న్‌ చేస్తూ ప్రత్యేక కోర్టులు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయా­లని హైకోర్టు­ను కోరి­ంది. తదుపరి తమ కేసు­ను విచారణకు స్వీక­రించేలా కూడా ప్రత్యేక కోర్టులను ఆదేశించాల­ని అభ్యర్థించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement