సాక్షి, అమరావతి : తమపై సీఐడీ తాజాగా నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఎండీ చెరుకూరి శైలజా కిరణ్ హైకోర్టును ఆశ్రయించారు. రామోజీరావు తమను తుపాకీతో బెదిరించి, సంతకాలు ఫోర్జరీ చేసి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తమకున్న షేర్లను ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ అయిన శైలజా కిరణ్ పేరు మీద అక్రమంగా బదలాయించుకున్నారని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో వాటాదారు అయిన జీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. యూరి రెడ్డి ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉండటంతో సీఐడీ అధికారులు రామోజీరావు ఏ1గా, శైలజా కిరణ్ ఏ2గా కేసు నమోదు చేశారు.
ఈ కేసును కొట్టేయాలంటూ రామోజీరావు, శైలజా కిరణ్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి మంగళవారం విచారణ జరిపారు. రామోజీరావు, శైలజా కిరణ్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, నాగముత్తు, హైకోర్టు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హాజరయ్యారు. సీఐడీ తరఫున స్పెషల్ పీపీ వై.శివకల్పనారెడ్డి వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యాలు మొదటిసారి విచారణకు వస్తున్నందున కేసు పూర్తి వివరాలను తెలుసుకుని, వాటిని కోర్టు ముందుంచాల్సి ఉందని, అందువల్ల విచారణను గురువారానికి వాయిదా వేయాలని శివకల్పనారెడ్డి కోరారు. లూథ్రా జోక్యం చేసుకుంటూ.. ఈలోపు పిటిషనర్లను అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు.
ఈలోపు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని పోసాని వెంకటేశ్వర్లు కోరారు. ఇందుకు న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈలోపు పిటిషనర్ల విషయంలో కఠిన చర్యలేవైనా తీసుకోబోతున్నారా.. అని శివకల్పనారెడ్డిని ప్రశ్నించారు. ఈలోపు ఎలాంటి కోర్టు ఉత్తర్వులు అవసరం లేదని, పూర్తి వివరాలు కోర్టు ముందుంచుతామని శివకల్పనారెడ్డి చెప్పారు. బుధవారం వరకు కఠిన చర్యలు తీసుకోబోమంటే విచారణను వాయిదా వేస్తానని న్యాయమూర్తి తెలిపారు. దీంతో అప్పటి వరకు పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని శివకల్పనారెడ్డి చెప్పారు. దీనిని రికార్డ్ చేసిన న్యాయమూర్తి తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment