సాక్షి, అమరావతి : మార్గదర్శి సహ వ్యవస్థాపకుడు గాదిరెడ్డి జగన్నాథ రెడ్డి (జీజే రెడ్డి) షేర్లను అక్రమంగా బదలాయించిన వ్యవహారంపై నమోదైన కేసులో నిందితులైన ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు, మార్గదర్శి ఎండీ అయిన ఆయన కోడలు శైలజా కిరణ్‌పై తదుపరి చర్యలన్నింటినీ 8 వారాలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
వారిద్దరిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సీఐడీకి ఒక్క రోజే గడువిచ్చిన న్యాయస్థానం
తన తండ్రి జీజే రెడ్డికి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో ఉన్న వాటాల కోసం వెళితే రామోజీరావు తనను తుపాకీతో బెదిరించి, తమ వాటాలను శైలజా కిరణ్ పేరిట అక్రమంగా బదలాయించారంటూ యూరి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ ఈ నెల 13న కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టేయాలంటూ ఈ నెల 16న రామోజీ, శైలజా కిరణ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. సాధారణంగా క్వాష్ పిటిషన్లలో ఆ కేసు పూర్తి వివరాలను తెలుసుకొని, కోర్టు ముందుంచేందుకు పోలీసులకు న్యాయమూర్తులు వారం, మూడు రోజులు ఇలా కొంత గడువు ఇస్తారు.
రామోజీరావు, శైలజా కిరణ్ వ్యాజ్యాలు న్యాయమూర్తి జస్టిస్ చక్రవర్తి ముందుకు మంగళవారం విచారణకు వచ్చాయి. పూర్తి వివరాలు కోర్టు ముందుంచేందుకు రెండు రోజులు గడువివ్వాలన్న సీఐడీ స్పెషల్ పీపీ వై.శివకల్పనారెడ్డి వినతిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఒక్క రోజే గడువిచ్చి, విచారణను బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం రామోజీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, శైలజా కిరణ్ తరఫున మరో సీనియర్ న్యాయవాది నాగముత్తు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు.
షేర్లు కొన్నందుకు యూరి రెడ్డికి చెక్కు రూపంలో చెల్లించామని, వాటాలను బదలాయిస్తూ ఆయన సంతకాలు కూడా చేశారని తెలిపారు. ఆ తర్వాత ఆయన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కి ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదు అక్కడ పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు సీఐడీకి ఫిర్యాదు చేశారని తెలిపారు.
మార్గదర్శి అక్రమాలపై దర్యాప్తు చేస్తున్నాం కాబట్టే సీఐడీకి ఫిర్యాదు చేశారు
సీఐడీ తరఫున వై.శివకల్పనా రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో అత్యంత కీలకమైన ఎస్‌హెచ్–4 ఫారంను వ్యాజ్యాలతో జత చేయలేదని, దీనిని కోర్టు తప్పక పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మార్గదర్శి అక్రమాలపై ఏపీ సీఐడీ విచారణ జరుపుతోందన్న విషయం తెలిసి ఫిర్యాదుదారు తమకు ఫిర్యాదు చేశారని వివరించారు. మార్గదర్శికి ఏపీలో కూడా శాఖలున్నాయన్నారు.
వాటాల బదిలీ డాక్యుమెంట్లపై ముద్రించిన స్టాంపు ఎక్కడిదో పరిశీలించాల్సి ఉందన్నారు. అందువల్ల ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. దర్యాప్తునకు సంబంధించిన కేసుల్లో యాంత్రికంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు చెప్పిందంటూ ఆ కేసు గురించి శివకల్పన ప్రస్తావించారు. అన్ని కేసులూ తనకు తెలుసునని న్యాయమూర్తి జస్టిస్ చక్రవర్తి అన్నారు. రామోజీ, శైలజా కిరణ్‌పై తదుపరి చర్యలన్నీ 8 వారాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment