సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై రామోజీరావు, శైలజా కిరణ్‌లతో పాటు ఆ సంస్థకు చెందిన పలువురు కీలక వ్యక్తులు, ఉద్యోగులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.
ఈ కేసులో తాము దాఖలు చేసిన చార్జిషీట్‌లను గుంటూరు, విశాఖపట్నంలోని డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ప్రత్యేక కోర్టులు ‘రిటర్న్’ చేస్తూ గత నెల 28న జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ అప్పీళ్లలో ప్రతివాదులుగా ఉన్న మార్గదర్శి చైర్మన్ చెరుకూరు రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్, ఆడిటర్ కుదరవల్లి శ్రవణ్‌లతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్లు ఇలా మొత్తం 15 మందికి నోటీసులు జారీచేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని వీరందరినీ ఆదేశించింది.
విచారణ 18కి వాయిదా..
తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్‌లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్‌ఫండ్ చట్టాల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది.
ప్రత్యేక కోర్టుల్లో చార్జిషీట్లు..
దర్యాప్తు చేసి డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసింది. వీటిని పరిశీలించిన ప్రత్యేక కోర్టులు వాటిని రిటర్న్ చేశాయి. గుంటూరులో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఉత్తర్వులు జారీచేయగా, విశాఖపట్నంలో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. ఈ రెండు కోర్టులు కూడా ఆగస్టు 28వ తేదీనే ఉత్తర్వులు వెలువరించడం విశేషం. రెండు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు దాదాపుగా ఒకే రకంగా ఉండటం మరో విశేషం. ఈ రెండు కోర్టులిచ్చిన ‘రిటర్న్’ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ హైకోర్టులో గత వారం క్రిమినల్ అప్పీళ్లు దాఖలు చేసింది. ఈ అప్పీళ్లపై సోమవారం జస్టిస్ శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబు కేసు అప్‌డేట్స్.. ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్
Comments
Please login to add a commentAdd a comment