సాక్షి, అమరావతి : ఈనాడు పత్రికాధిపతిగా శ్రీరంగ నీతులు వల్లించే చెరుకూరి రామోజీరావు.. ‘మార్గదర్శి’ అధినేతగా యథేచ్ఛగా ఆర్థిక దోపిడీకి పాల్పడుతుంటారు. చట్టాలను ఎడాపెడా ఉల్లంఘిస్తూ ఆయన సాగించే ఆర్థిక దోపిడీకి ఈనాడు పత్రికను రక్షా కవచంగానే వాడుకుంటున్నారన్నది నగ్న సత్యం. మరోవైపు చంద్రబాబుకు రాజగురువు కాబట్టి తాను చట్టాలకు అతీతమని భావిస్తూ ఉంటారు. పత్రికాధిపతి కాబట్టి ఆయన అక్రమాలను ఎవరూ ప్రశ్నించకూడదని వాదిస్తూ ఉంటారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చేపట్టిన కఠిన కార్యాచరణతో ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ను మూసివేసుకోవాల్సి వచ్చినా, అక్రమ డిపాజిట్ల దందాను మాత్రం విడిచిపెట్టలేదు.
‘మార్గదర్శి చిట్‌ఫండ్స్’ పేరిట డిపాజిట్లు యథేచ్చగా వసూలు చేస్తూ భారీగా ఆర్థిక అక్రమాలను కొనసాగించారు. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం, రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టాలను దర్జాగా ఉల్లంఘిస్తూ అక్రమ డిపాజిట్లు వసూలు చేసి ఆ నిధులను సొంత ప్రయోజనాల కోసం దారి మళ్లించారు. గత ఏడాది స్టాంపులు, రిజిస్ట్రేషన్లు శాఖ, సీఐడీ అధికారులు రాష్ట్రంలోని 38 మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో చేసిన సోదాలతో ఈ ఆర్థిక దోపిడీ ఆధారాలతో సహా బట్టబయలైంది.
దాంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఏ–1గా, ఆయన పెద్ద కోడలు, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ చెరుకూరి శైలజ ఏ–2గా, మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ఏ–3గా సీఐడీ కేసు నమోదు చేసింది. వారిపై సెక్షన్లు 120 (బి), 409, 420, 477 (ఎ) రెడ్‌విత్ 34 సీఆర్‌సీపీ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. రామోజీరావు, శైలజ కిరణ్‌ను విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో రామోజీరావు సాగించిన ఆర్థిక దోపిడీ తీరు ఇదిగో ఇలా ఉంది...
భారీగా అక్రమ డిపాజిట్ల సేకరణ
కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం–1982, బ్యానింగ్ ఆఫ్ నాన్ రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్స్( బీఎన్‌డీఎస్)–1999 చట్టాలను ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో రామోజీరావు యథేచ్ఛగా అక్రమంగా డిపాజిట్లను సేకరించారు. ఆ రెండు చట్టాల ప్రకారం చిట్‌ఫండ్ కంపెనీలు వాటి ఖాతాదారులు, ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించకూడదు. కానీ ఈ చట్టాన్ని రామోజీరావు ఏమాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా అక్రమ డిపాజిట్లు సేకరించారు. రశీదు రూపంలో డిపాజిట్లు సేకరించారు. యాజమాన్య కోటా టికెట్ల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు. చందాదారుల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా రామోజీ సొంత కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్‌లో అక్రమ పెట్టుబడులుగా పెట్టి భారీగా సొంత ఆస్తులు పెంచుకున్నారు.
రశీదుల ముసుగులో అక్రమ డిపాజిట్లే
రశీదులు, భవిష్యత్ చిట్టీలకు ష్యూరిటీల పేరుతో రామోజీరావు అక్రమ డిపాజిట్ల దందా కొనసాగిస్తున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థలో చిట్టీ పాడిన చందాదారులకు వారికి రావాల్సిన సొమ్ములో మొత్తం చెల్లించడంలేదు. అందులో కొంత సొమ్మును సంస్థ వద్ద డిపాజిట్‌గా ఉంచుకుంటోంది. ఆమేరకు ఓ రశీదు ఇస్తోంది. అలా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు చందాదారుల నుంచి రశీదు రూపంలో డిపాజిట్లు సేకరిస్తోంది. ఆ డిపాజిట్లపై 4 శాతం, 5 శాతం వడ్డీ చెల్లిస్తామని చెబుతోంది. ఏదైనా ఆర్థిక సంస్థ ఖాతాదారుల నగదును దాని వద్ద అట్టిపెట్టుకుని దానిపై వడ్డీ చెల్లిస్తామని లిఖితపూర్వకంగా తెలిపితే దానిని డిపాజిట్‌గానే పరిగణిస్తారు. అలా డిపాజిట్లు సేకరించాలంటే ఆర్‌బీఐ నిబంధనలను అనుసరించాలి.
ఆర్‌బీఐ నిబంధన ప్రకారం చిట్‌ఫండ్స్ సంస్థలు డిపాజిట్లు వసూలు చేయకూడదు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ రశీదు ముసుగులో డిపాజిట్లు సేకరిస్తోంది. ఇక చందాదారుల నుంచి ష్యూరిటీ తీసుకోవడానికి కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం నిర్దేశించిన విధానాలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యవహరిస్తోంది. జాతీయ/షెడ్యూల్డ్ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల పత్రాలు, బంగారు ఆభరణాలు, లైఫ్ ఇన్సూ్యరెన్స్ పత్రాలు, స్థిరాస్తి పత్రాలు గానీ ముగ్గురు వ్యక్తుల హామీ గానీ ష్యూరిటీగా తీసుకోవాలని చట్టం నిర్దేశించింది. అంతే కానీ, చిట్టీ పాట కింద చెల్లించాల్సిన మొత్తంలోనే కొంత ష్యూరిటీగా అట్టిపెట్టుకోడానికి అవకాశం లేదు. కానీ రామోజీరావు తమ చందాదారుల చిట్టీ పాట మొత్తం నుంచి కొంత భాగాన్ని ష్యూరిటీ పేరుతో అట్టిపెట్టుకుంటున్నారు. ఆ పేరుతో అక్రమంగా డిపాజిట్లు వసూలు చేస్తున్నారు.
యాజమాన్య టికెట్ల పేరుతో దందా
యాజమాన్య కోటా పేరుతో చిట్టీ గ్రూపుల్లోని టికెట్ల ముసుగులో రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. చిట్‌ఫండ్ కంపెనీలు వేసే చిట్టీలలో నిర్ణీత చందాదారుల సంఖ్య (వీటిని టికెట్స్ అని వ్యవహరిస్తారు)లో కొన్ని ఖాళీగా ఉండిపోతాయి. అలా ఖాళీగా ఉండిపోయే టికెట్స్‌ను ఆ కంపెనీ తీసుకోవాలి. ఆ టికెట్స్‌పై చందాను కంపెనీయే చెల్లించాలి. తరువాత కొత్త చందాదారులు వస్తే వాటితో ఆ టికెట్స్‌ను భర్తీ చేయవచ్చు. చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్లు 27, 32లలో స్పష్టంగా నిర్దేశించిన ఈ నిబంధనలను రామోజీరావు ఏనాడూ పట్టించుకోలేదు.
మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఏర్పాటు చేసినప్పుడు ప్రతి చిట్టీలోనూ కనీసం ఒకటి నుంచి 50శాతం టికెట్లను సొంతంగా కలిగి ఉంటామని పేర్కొంది. కానీ, తమ పేరుతో ఉన్న టికెట్లపై చందాను ఏనాడూ చెల్లించలేదు. కేవలం ఒక చిట్టీలోని తమ పేరుతో ఉన్న టికెట్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని మరో చిట్టీలోని టికెట్లపై డిస్కౌంట్ మొత్తం నుంచి.., మళ్లీ ఆ చిట్టీలోని తమ టికెట్లను మరో చిట్టీలోని డిస్కౌంట్ మొత్తం నుంచి మళ్లించినట్టు రికార్డుల్లో కనికట్టు చేసింది.
అంటే సంస్థ పేరిట ఉన్న టికెట్లపై మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందా ఏనాడూ చెల్లించలేదు. కేవలం రికార్డుల్లో జంబ్లింగ్ అంటే బుక్ అడ్జస్ట్‌మెంట్స్ ద్వారా చూపించి చందాదారులను మోసం చేసింది. మళ్లీ తమ టికెట్లపై చందా పాట మొత్తాన్ని మాత్రం వసూలు చేసుకుంటోంది. ఆ విధంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఒక్క రూపాయి కూడా చందాగా పెట్టకుండానే భారీగా చందాదారుల సొమ్మును దాని ఖాతాల్లోకి మళ్లించుకుంటోంది.
ఆ ఒక్క బ్యాంకు ఖాతా... రామోజీ దోపిడీకి కేంద్ర బిందువు
బ్యాంకు ఖాతాల నిర్వహణలోనూ రామోజీరావు నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. చిట్‌ఫండ్ సంస్థలు ప్రతి చిట్టీకి ఓ ప్రత్యేక బ్యాంకు ఖాతా నిర్వహించాలి. ఆ చిట్టీకి సంబంధించిన చందాల వసూళ్లు, చెల్లింపులు దాని ద్వారానే జరగాలి. ఇలా ఏ ఏ బ్యాంకు ఖాతాల ద్వారా చిట్టీలు నిర్వహిస్తారో వెల్లడించాలి. ఈ నిబంధనలను మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఉల్లంఘిస్తోంది. అన్ని చిట్టీల చందా మొత్తాలను ఒకే బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. చిట్టీల ఒప్పందాల్లో కేవలం బ్యాంకు పేరునే పేర్కొంటోంది గానీ, బ్యాంకు ఖాతాల నంబర్లు, ఇతర వివరాలను ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తోంది.
తద్వారా ఒక బ్యాంకు ఖాతాలో భారీ మొత్తాన్ని పోగేస్తోంది. రామోజీరావు ఇలా చేయడం వెనుక అతి పెద్ద ఆర్థిక కుతంత్రం దాగుంది. నిబంధనల ప్రకారం చిట్టీల బ్యాంకు ఖాతాలపై చిట్çœండ్ సంస్థ బ్రాంచి మేనేజర్ (ఫోర్‌మేన్)కు చెక్ పవర్ ఉండాలి. ఆ మేనేజరే చందాదారులకు చిట్టీ మొత్తాన్ని చెల్లించడంతోపాటు ఆన్‌లైన్ వ్యవహారాలు నిర్వహించాలి. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థలో ఏ బ్రాంచి మేనేజర్‌కూ చెక్ పవర్ ఇవ్వలేదు. చెక్ పవర్ అంతా ప్రధాన కార్యాలయం వద్దే అట్టిపెట్టారు. రామోజీరావు, శైలజ కిరణ్‌తోపాటు ప్రధాన కార్యాలయంలో ఉన్న కొద్దిమందికే చెక్ పవర్ కల్పించారు.
సొమ్ము చందాదారులది.. సోకు రామోజీది
కేంద్ర చట్టం ప్రకారం చిట్‌ఫండ్ కంపెనీలు చందాదారుల సొమ్మును ఇతర కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టకూడదు. కానీ రామోజీరావు మాత్రం చందాదారుల సొమ్మును సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం అక్రమ పెట్టుబడులుగా మళ్లిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులే డైరెక్టర్లుగా ఉన్న ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్‌ప్రైజస్, మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్–చెన్నై, మార్గదర్శి చిట్స్ (కర్ణాటక) ప్రైవేట్ లిమిటెడ్–బెంగళూరులో అక్రమ పెట్టుబడులుగా తరలించారు. ఆ కంపెనీల్లో ఏకంగా 88.5% వాటా పెట్టుబడిగా పెట్టడం గమనార్హం. దాంతోపాటు ముంబయిలోని పలు మ్యూచువల్ ఫండ్స్‌లో అక్రమ పెట్టుబడులు పెట్టారు. రామోజీరావు సొంతంగా ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా చందాదారుల సొమ్మును అక్రమంగా పెట్టుబడులుగా మళ్లిస్తూ భారీగా అక్రమ ఆదాయాన్ని పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment