సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థి క అక్రమాల కేసు దర్యాప్తులో సీఐడీ మరో కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో ఏ–1గా ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఏ–2గా ఉన్న శైలజా కిరణ్‌ను ఆంధ్ర ప్రదేశ్‌లో విచారించాలని దర్యాప్తు సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు జూలై 5వ తేదీన ఉదయం 10.30 గంటలకు గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంటూ వారికి నోటీసులు జారీ చేసింది.
రామోజీరావు, శైలజా కిరణ్‌తోపాటు గుంటూరు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్(ఫోర్‌మేన్) శివరామకృష్ణకు ఈ మేరకు సీఐడీ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం, ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు స్టాంపులు–రిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ సోదాల్లో ఆధారాలతో సహా బహిర్గతమైంది.
దీంతో సీఐడీ అధికారులు రామోజీరావు, శైలజా కిరణ్‌లతోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లపై కేసు నమోదు చేసి ఏడు ఎఫ్‌ఐఆర్‌లు రిజిస్టర్ చేసిన విషయం విదితమే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే రామోజీరావును ఒకసారి విచారించగా శైలజా కిరణ్‌ను రెండుసార్లు హైదరాబాద్‌లోని వారి నివాసంలో సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు వారిద్దరిని గుంటూరులో విచారించాలని సీఐడీ నిర్ణయించింది.
న్యాయ సూత్రాల ప్రకారం..
రామోజీరావు, శైలజా కిరణ్, ఇతరులపై సీఐడీ నమోదు చేసిన ఏడు ఎఫ్‌ఐఆర్‌ల ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆంధ్రప్రదేశ్‌లో నేరానికి పాల్పడింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చందాదారుల సొమ్మును చిట్‌ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా మళ్లించింది. ఎఫ్‌ఐఆర్‌లు కూడా ఇక్కడే నమోదయ్యాయి. దీంతో న్యాయ సూత్రాల ప్రకారం ఈ కేసులో నిందితులను ఆంధ్రప్రదేశ్‌లోనే విచారించాల్సి ఉంది.
రామోజీరావు, శైలజా కిరణ్‌ను హైదరాబాద్‌లో విచారించినప్పుడే సీఐడీ అధికారులు వారికి ఇదే విషయాన్ని తెలియచేశారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు కోసం వారిద్దరినీ ఆంధ్రప్రదేశ్‌కు పిలిచి విచారిస్తామని సీఐడీ అధికారులు గతంలోనే మీడియాకు తెలిపారు. దేశంలో అన్ని కేసుల్లో దర్యాప్తు సంస్థలు ఇదే మాదిరిగా వ్యవహరిస్తున్నాయి.
హాజరు కావడం ఆనవాయితీ
నిందితులు దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వచ్చి విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సీబీఐ, ఈడీ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థలతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసు, సీఐడీ విభాగాలు ఇదే రీతిలో నిందితులను విచారిస్తున్నాయి. మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో నిందితులు రామోజీరావు, శైలజా కిరణ్ ప్రముఖులు కావడం, వారికి ఈనాడు పత్రిక, సొంత మీడియా ఉన్నందున ఇంటి వద్దకు వెళ్లి విచారించడం సరికాదని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
సామాన్యులకు ఒక విధానం, మీడియా బలం ఉన్న వారికి మరో విధానమా? వారికి చట్టం నుంచి మినహాయింపులు ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. కాగా గతంలో హైదరాబాద్‌లో శైలజా కిరణ్‌ను విచారించిన సందర్భంగా సీఐడీ అధికారులను తన నివాసంలోకి రానివ్వకుండా గంటల తరబడి రోడ్డుపైనే నిలబెట్టి అవమానకర రీతిలో వ్యవహరించినా సంయమనంతో వ్యవహరించిన విషయం తెలిసిందే.
కాగా, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాల కేసులో నమోదు చేసిన ఏడు ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి దశలవారీగా విచారించాలని సీఐడీ భావిస్తోంది. గుంటూరులోని అరండల్ పేట మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచి కార్యాలయంలో ఆర్థిక అక్రమాలకు సంబంధించి జూలై 5న రామోజీరావు, శైలజా కిరణ్‌ను విచారించనున్నట్లు తెలుస్తోంది. అరండల్‌పేట బ్రాంచి కార్యాలయ మేనేజర్(ఫోర్‌మేన్)కు కూడా నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment