![Golden hour is most crucial in cyber fraud incident](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/cyber.jpg.webp?itok=mwLoQPW8)
సైబర్ క్రైం జరిగినప్పుడు గోల్డెన్ అవర్ అత్యంత కీలకమంటున్న నిపుణులు
ఆ సమయంలో ఫిర్యాదు చేస్తే త్వరగా రికవరీ జరిగే ఛాన్స్
సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకూ వీలు
ఆలస్యం చేస్తే ఇతర రాష్ట్రాలకు, క్రిప్టో కరెన్సీగా మారే అవకాశం
పట్నంబజారు: అత్యవసర పరిస్థితుల్లో ఎంతో అవసరమైన సమయంలో మనం వాడే పదం గోల్డెన్ అవర్. ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాలు సంభవించేటప్పుడు మాత్రమే ఈ పదం విని ఉంటారు. ప్రమాదాలు సంభవించిన గంటలోపే క్షతగాత్రులను ఆస్పత్రికి చేర్చడం దీని ఉద్దేశం. ఇదే తరహాలో సైబర్ మోసాలకు గురయ్యే బాధితులు సైతం నేరం జరిగిన గంటలోగా ఫిర్యాదు చేయగలిగితే.. ఖాతాలో పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రాబట్టుకునే వీలుంటుంది. బాధితులు చేయాల్సిందల్లా గోల్డెన్ అవర్లో సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయటమే.
జిల్లాలో ఇప్పటివరకు వందల సంఖ్యలో సైబర్ నేరాలు నమోదు అయ్యాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తాము మోసానికి గురయ్యామని ఎస్‌సీఆర్‌బీకి ఫిర్యాదు చేయటం ద్వారా, లేదా 1930 సైబర్ సెల్ నంబరు డయల్ చేసి ఫిర్యాదు ఇవ్వడం వలన ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయలు వెనక్కి తీసుకువచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
ఫిర్యాదు చేయాలిలా..
» మోసపోయామని తెలుసుకున్న వెంటనే బాధితులు 1930 నంబర్‌కు కాల్ చేయాలి.
» లేదంటే https:// cybercrime. gov. in అనే పోర్టల్‌పై క్లిక్ చేయాలి. హోం పేజీలోకి వెళ్లి ఫైల్ ఎ కంప్లైంట్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని నియమాలు, షరతులు చూపిస్తుంది. వాటిని చదివి యాక్సెప్ట్ చేసి రిపోర్ట్ అదర్ సైబర్ క్రైమ్ బటన్‌పై క్లిక్ చేయాలి.
తర్వాత సిటిజన్ లాగిన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పేరు, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ వంటి వివరాలు ఎంటర్ చేస్తే రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్‌ను బాక్స్‌లో ఫిల్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి. తర్వాత పేజీలోకి తీసుకెళ్తుంది. అసలు ప్రక్రియ మొదలయ్యేది ఇక్కడే.
» ఈ పేజీలో ఒక ఫామ్ కనిపిస్తుంది.. దానిలో జరిగిన సైబర్ మోసం గురించి క్లుప్తంగా రాయాలి. అక్కడ నాలుగు సెక్షన్లుగా విభజించి ఉంటుంది. సాధారణ సమాచారం (విక్టిమ్ ఇన్ఫర్మేషన్), సైబర్ నేరానికి సంబంధించి సమాచారం (సైబర్ క్రైమ్ ఇన్ఫర్మేషన్), ప్రివ్యూ అనే సెక్షన్‌లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో అడిగిన వివరాలను సమరి్పస్తూ.. ప్రక్రియను పూర్తిచేయాలి. మూడు సెక్షన్లు పూర్తయ్యాక ప్రివ్యూను వెరిఫై చేయాలి.
అన్ని వివరాలు సరిగా ఉన్నాయని భావిస్తే సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత ఘటన ఎలా జరిగిందనేది వివరాలు నమోదుచేయాలి. నేరానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు (అకౌంట్ ట్రాన్సాక్షన్ తదితర) ఫైల్స్ వంటి ఆధారాలు, సాక్ష్యాలు అందులో పొందుపర్చాలి. వివరాలు సేవ్ చేసి నేరగాళ్ల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే ఫిల్ చేయాలి.
» అంతా వెరిఫై చేసుకున్నాక సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. కంప్‌లైంట్ ఐడీతో పాటు ఇతర వివరాలతో కూడిన ఈ–మెయిల్ వస్తుంది. తర్వాత అధికారులు దర్యాప్తు ప్రారంభిస్తారు. ఫిర్యాదు చేయడం ఆలస్యమైతే దుండగుడు డబ్బును వేర్వేరు ఖాతాల్లో మళ్లించేస్తాడు. లేదంటే క్రిప్టో కరెన్సీగా మార్చుకునే ప్రమాదముంది. సైబర్ మోసానికి గురైతే 1930 నంబర్‌కు కాల్ చేయాలి.
వెంటనే ఫిర్యాదు చేయండి..
సైబర్ మోసానికి గురయ్యేవారు వెంటనే గుర్తించాలి. తక్షణం ఫిర్యాదు చేస్తే మన డబ్బులు వెనక్కి వచ్చే అవకాశాలెక్కువ. లేదంటే ఎక్కడ ఉంటారో.. వారి ఖాతాలు ఏ రాష్ట్రానికి చెందినవో.. ఇవన్నీ కనుక్కోవడం పెద్ద ప్రక్రియ అవుతుంది. డయల్ 1930కు గానీ, ఎన్‌సీఆర్‌బీ గానీ ఫిర్యాదు చేసి బ్యాంకు వాళ్లను, దగ్గరలో ఉన్న పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలి. తద్వారా బాధితుడికి న్యాయం చేసే అవకాశం ఉంటుంది. – ఎస్.సతీష్ కుమార్, ఎస్పీ, గుంటూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment