Andhra Pradesh: ప్రశ్నిస్తే.. పీడీ చట్టం! | Chandrababu Naidu govt oppressive conspiracies with black laws | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ప్రశ్నిస్తే.. పీడీ చట్టం!

Published Thu, Nov 28 2024 4:19 AM | Last Updated on Thu, Nov 28 2024 9:45 AM

Chandrababu Naidu govt oppressive conspiracies with black laws

నల్ల చట్టంతో చంద్రబాబు సర్కారు అణచివేత కుట్రలు 

సోషల్‌ మీడియా పోస్టులనూ సైబర్‌ నేరాలుగా నమోదు చేసే పన్నాగం

‘సైబర్‌ నేరాలు’ పదాన్ని చట్టంలో స్పష్టంగా నిర్వచించకుండా కుతంత్రం

‘పీడీ’ చట్టానికి సవరణ పేరుతో కూటమి ప్రభుత్వం పన్నాగం

కేంద్ర ఐటీ చట్టం పరిధిలోని అంశాలు సైబర్‌ నేరాలుగా ముద్ర.. సైబర్‌ నేరాలను ఏకంగా పీడీ చట్టం పరిధిలోకి తెస్తూ సవరణలు

నోటీసు ఇవ్వకుండానే అక్రమ అరెస్ట్‌లకు బాబు సర్కారు ఎత్తుగడ 

ఏడాది పాటు అక్రమ నిర్బంధానికి పథకం 

బడ్జెట్‌ సమావేశాల చివరి రోజు అదనపు అజెండాగా మండలిలో బిల్లు పెట్టి ఆమోదం 

విస్తృత చర్చకు అవకాశం లేకుండా సర్కారు కుటిల వ్యూహం.. ప్రభుత్వ వైఫల్యాలపై నిగ్గదీస్తే అక్రమ కేసులే లక్ష్యం 

రౌడీలు, స్మగ్లర్ల మీద పెట్టినట్లుగా సోషల్‌ మీడియా పోస్టులపై పీడీ చట్టం ఏమిటి?  

ఆ ఆంక్షలు, కేసులు న్యాయస్థానాల్లో నిలబడవంటున్న రాజ్యాంగ నిపుణులు 

ఎక్కడికక్కడ కోర్టులను ఆశ్రయించనున్న బాధితులు, ప్రజస్వామ్యవాదులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాల­రాస్తున్న చంద్రబాబు సర్కారు మరింత బరితెగించింది! యావత్‌ భారతం ‘రాజ్యాంగ దినోత్సవ వజ్రోత్సవ’ వేడుకలను జరుపుకొంటున్న తరుణంలో.. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కు­లపై ఉక్కుపాదం మోపే కుట్రలకు కూటమి ప్రభు­త్వం తెర తీసింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ‘నల్ల చట్టాన్ని’ తీసు­కువచ్చింది. ‘పీడీ’ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ డేంజరస్‌ యాక్టివి­టీస్‌) చట్టానికి సవరణ ముసుగులో పచ్చ పన్నాగా­న్ని పన్నింది. 

రాజ్యాంగ స్ఫూర్తిని, భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. సైబర్‌ నేరాలను పీడీ చట్టం పరిధిలోకి తెస్తున్నట్లు చట్ట సవరణ చేసినట్టు డ్రామా ఆడిన చంద్రబాబు ప్రభుత్వం అసలు కుతంత్రం వేరే ఉంది! అసలు సైబర్‌ నేరాలు అంటే ఏమిటో నిర్వచించకపోవడం ప్రభుత్వ కుతంత్రానికి నిదర్శనం. కేంద్ర ఐటీ చట్టంలోని అంశాలను సైబర్‌ నేరాలు అంటూ గంపగుత్తగా అధికా­రిక ముద్ర వేసేసింది. 

తద్వారా సోషల్‌ మీడియా పోస్టులను కూడా సైబర్‌ నేరాలుగా జమ కట్టేసేందుకు తెగించింది. ఆ నెపంతో సోషల్‌ మీడియా పోస్టులపై ఏకంగా పీడీ చట్టం కింద అక్రమ కేసులు నమోదు చేసి జైళ్లలో మగ్గేలా చేసేందుకు పథకం వేసింది. ఈ దుర్మార్గంపై ఎక్కడికక్కడ బాధితులు, ప్రజాస్వామ్యవాదులు, పౌరహక్కుల సంఘం నేతలు న్యాయస్థానాలను ఆశ్రయించనున్నారు. 


ప్రశ్నించే గొంతుల అణచివేతకు కుట్ర...
పీడీ చట్టానికి సవరణ పేరుతో పన్నాగం
తీవ్రమైన నేరాలను కట్టడి చేసేందుకు 1986లో తీసుకువచ్చిన పీడీ చట్టానికి సవరణ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం కుతంత్రానికి తెరతీసింది. పీడీ చట్టం పరిధిని విస్తృతం చేస్తున్న నెపంతో కథ నడిపించింది. పీడీ చట్టం ప్రకారం ఆరు కేటగిరీల నేరాలపై కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉంది. నాటుసారా, అక్రమ మద్యం తయారీ / సరఫరా / రవాణాదారులు, దొంగతనాలకు పాల్పడే బందిపోటు ముఠాలు, మాదక ద్రవ్యాల తయారీ / సరఫరా / విక్రయదారులు, మానవ అక్రమ రవాణాదారులు, గూండాలు, భూ కబ్జాలకు పాల్పడేవారిపై పీడీ చట్టం ప్రయోగించవచ్చు. 

టీడీపీ కూటమి ప్రభుత్వం ఇటీవల ముగిసిన బడ్జెట్‌ సమావేశాల్లో పీడీ చట్టాన్ని సవరించింది. భూ కబ్జాలకు పాల్పడేవారు అనే అంశాన్ని విస్తృతం చేస్తూ దాని పరిధిలోకి మరో 15 అంశాలను చేర్చింది. వాటిలో ‘సైబర్‌ నేరాలు’ చేర్చింది. సైబర్‌ నేరాలకు పాల్పడేవారిపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు అవకాశం కల్పించింది. 

కేంద్ర ఐటీ చట్టం పరిధిలోని కేసులన్నీ సైబర్‌ నేరాలట!
కూటమి సర్కారు కుట్ర
చంద్రబాబు ప్రభుత్వం పీడీ చట్టానికి సవరణ చేస్తూ సైబర్‌ నేరాలకు తనదైన భాష్యం చెప్పడం విడ్డూరంగా ఉంది. ‘కేంద్ర ఐటీ చట్టం 2000’ పరిధిలోకి వచ్చే నేరాలన్నీ సైబర్‌ నేరాలే అని గంపగుత్తగా పేర్కొనడం ప్రభుత్వ కుతంత్రానికి నిదర్శనం. ‘నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌’లో పొందుపరిచిన నేరాలకు కేంద్ర ప్రభుత్వం పీడీ చట్టం లాంటి తీవ్రమైన చట్టాన్ని ప్రయోగించడం లేదు. ఐటీ చట్టం ప్రకారమే కేసులు నమోదు చేస్తోంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఐటీ చట్టం పరిధిలోని అంశాలను సైబర్‌ నేరాలుగా పేర్కొంటూ పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్ధపడింది.

ఒకటికి మించి అక్రమ కేసులు.. 
వేధింపుల పన్నాగం
ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో సోషల్‌ మీడియా అనేది ప్రధాన మాధ్యమంగా మారింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు సామాన్యులు సోషల్‌ మీడియాను అస్త్రంగా చేసుకుంటున్నారు. 



చంద్రబాబు సర్కారు వైఫల్యాలు, ఎన్నికల హామీలను అమలు చేయకపోవటాన్ని సోషల్‌మీడియా వేదికగా యాక్టివిస్టులు, ప్రజాస్వామ్యవాదులు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రభుత్వం వారిని అక్రమ కేసులతో వేధిస్తోంది. తాజాగా ఆ కుట్రలకు మరింత పదును పెట్టేందుకే పీడీ చట్టానికి సవరణ పేరుతో కుట్ర పన్నింది. సోషల్‌ మీడియా పోస్టులపై అభ్యంతరం ఉంటే ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసేందుకు ప్రస్తుతం అవకాశం ఉంది. 

ఆ చట్టం ప్రకారం సోషల్‌ మీడియా పోస్టులు పెట్టినవారికి ‘41 ఏ’ కింద  నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుని పంపించి వేయాలి. ఏకపక్షంగా అరెస్ట్‌ చేసేందుకు అవకాశం లేదు. నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేస్తే న్యాయస్థానాలు సమ్మతించవు. రిమాండ్‌ను తిరస్కరిస్తాయి. దీంతో చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు పదును పెట్టింది. ఐటీ చట్టం పరిధిలోకి వచ్చే అంశాలను సైబర్‌ నేరాలుగా పేర్కొంటూ వాటిని ఏకంగా పీడీ చట్టం పరిధిలోకి తెచ్చింది. 

తద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై పీడీ చట్టం కింద అక్రమ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైంది. సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై ఒకటికి మించి కేసులు నమోదు చేసి... దాన్ని సాకుగా చూపించి వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఆ కుట్రలో భాగంగానే నెల రోజులుగా ఒక్కో సోషల్‌ మీడియా కార్యకర్తపై పలు జిల్లాల్లో అక్రమ కేసులను నమోదు చేస్తోంది. వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగించి ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం కలిగించేందుకు పూర్తిస్థాయి కుట్రలకు బరి తెగించింది.

ఏడాదిపాటు అక్రమ నిర్బంధానికే...!
పీడీ చట్టం ప్రకారం కేసు నమోదైన వారిని గరిష్టంగా ఏడాది పాటు జైలులో ఉంచవచ్చు. ఎర్రచందనం స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా, అక్రమ మద్యం దందా లాంటి తీవ్రమైన నేరాలకు తరచూ పాల్పడేవారిపై కఠిన చర్యలకు పీడీ చట్టాన్ని రూపొందించారు. 

చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తమ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్‌ మీడియా కార్యకర్తలను వేధించేందుకు, రాజ్యాంగ హక్కులను కాలరాసేందుకు పీడీ చట్టాన్ని సవరించింది. పీడీ చట్టం కింద నమోదు చేసిన కేసులను రాష్ట్ర స్థాయి సలహా కమిటీ సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. కమిటీకి చైర్మన్‌తోపాటు ఇద్దరు సభ్యులు ఉంటారు. వారిని రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుందన్నది గమనార్హం.

సోషల్‌ మీడియాపై పీడీ చట్టం రాజ్యాంగ విరుద్ధం
సోషల్‌ మీడియాపై పీడీ చట్టాన్ని ప్రయోగించాలన్న ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ద్ధం. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్‌ మీడియాలో ప్రశ్నించడానికి – దూషించడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించకపోవడం ప్రభుత్వ పెద్దల వైఫల్యం. రౌడీలు, స్మగ్లర్ల మీద పెట్టినట్లుగా సోషల్‌ మీడియా పోస్టులపై పీడీ చట్టం ఏమిటి? రాష్ట్రంలో కొన్ని టీవీ చానళ్లు రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నా­యి. 

న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న కేసులపై డిబేట్లు నిర్వహిస్తూ ఏకపక్షంగా తీర్పులు చెబుతున్నాయి. స్వీయ నియంత్రణ పాటించాలని మీడియా సంస్థలను సుప్రీంకోర్టు అనేకసార్లు హెచ్చరించింది. కొన్ని టీవీ చానళ్లు రాజకీయ పార్టీలతో కలసి ప్రజలను బెదిరించేందుకు యత్నిస్తున్నాయి. సోషల్‌ మీడియాపై ఆంక్షలు, కేసులు న్యాయ­స్థానాల్లో నిలవవు. రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్యానిదే అంతిమ విజయం.       
– మామిడి సుదర్శన్, ‘సెంటర్‌ ఫర్‌ పొలిటికల్‌ రీసెర్చ్‌ – స్ట్రాటజీ (సీపీఆర్‌ఎస్‌) వ్యవస్థాపకుడు

బిల్లు ఆమోదంలోనూ కనికట్టు...
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ఉద్దేశించిన పీడీ చట్ట సవరణ బిల్లును టీడీపీ ప్రభుత్వం ఆమోదించుకున్న తీరు తీవ్ర విస్మయం కలిగిస్తోంది. శాసనసభలో ఈ నెల 21న ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించుకుంది. ఆ తరువాత బడ్జెట్‌ సమావేశాల చివరి రోజు అంటే ఈ నెల 22న శాసన మండలిలో అదనపు అజెండాగా ఈ బిల్లును చేర్చింది. ప్రధాన అజెండాలో దీన్ని పేర్కొనకపోవడం గమనార్హం. తద్వారా ఆ బిల్లుపై విస్తృత చర్చకు అవకాశం లేకుండా ప్రభుత్వం ఎత్తుగడ వేసినట్టు స్పష్టమవుతోంది.

సైబర్‌ నేరాలను నిర్వచించని కూటమి ప్రభుత్వం
నిజమైన సైబర్‌ నేరాలకు పాల్పడేవారిపై పీడీ చట్టం ప్రయోగిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఎందుకంటే సైబర్‌ నేరాలు ఏమిటన్నది కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్వచిస్తూ పేర్కొంది. అందుకోసం ‘నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌’ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి టోల్‌ ఫ్రీ నంబర్‌ ‘1930’ అందుబాటులోకి తెచ్చింది. 

ఆ పోర్టల్‌ పరిధిలోకి వచ్చే అంశాలను అంటే బ్యాంకుల మోసాలు, ఆర్థిక నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలు మొదలైన నేరాలను ఏపీ ప్రభుత్వం పీడీ చట్టం పరిధిలోకి తీసుకువస్తే ఎవరూ అభ్యంతరం పెట్టరు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశం సైబర్‌ నేరాలను అరికట్టడం కాదు. 

ఆ ముసుగులో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం! ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవారిని అక్రమ కేసులతో వేధించడం. అందుకోసమే పీడీ చట్టానికి సవరణ చేస్తూ సైబర్‌ నేరాలను అనే అంశాన్ని చేర్చింది. కానీ అసలు సైబర్‌ నేరాలు అంటే ఏమిటో నిర్వచించకపోవడం ప్రభుత్వ కుట్రకు బట్టబయలు చేస్తోంది.

భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం..
చంద్రబాబు సర్కారు అరాచక చర్యలు రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 ప్రకారం దేశ పౌరులకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంది. 

అయితే సోషల్‌ మీడియా పోస్టులను పీడీ చట్టం పరిధిలోకి తేవడం ద్వారా కూటమి సర్కారు ఆ హక్కును కాల రాస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు కుట్ర పన్నిందని న్యాయ నిపుణులు హెచ్చరి­స్తున్నారు. ఈ బిల్లును ప్రజాస్వామ్యవాదులు సమష్టి­గా వ్యతిరేకించాలని, న్యాయ పోరాటం చేయాలని సూచిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement