
రాస్తారోకో చేస్తున్న రెస్టారెంట్ నిర్వాహకులు, బంధువులు
నిర్వాహకుడికి టీడీపీ నేత బెదిరింపులు
కొల్లూరు : బాపట్ల జిల్లా కొల్లూరులో ఈనాడు గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో రెస్టారెంట్ నిర్వాహకులు ఆందోళనకు దిగారు. పోలీసులు, రెస్టారెంట్ నిర్వాహకుల కథనం మేరకు.. కొల్లూరుకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన్‌ప్రసాద్ ఆదివారం అర్ధరాత్రి రెస్టారెంట్ నిర్వాహకులకు రెండు పర్యాయాలు ఫోన్ చేసి అసభ్యపదజాలంతో దూషించారు. అంతేగాక రెస్టారెంట్ ఏమవుతుందో చూసుకోవాలంటూ హెచ్చరించారు.
అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం నిర్వాహకులు వచ్చి చూసే సరికి రెస్టారెంట్ ధ్వంసమై కనిపించింది. దీంతో నిర్వాహకులు, బంధువులు ఆందోళనకు దిగారు. తెనాలి–రేపల్లె రహదారిపై కొల్లూరు బస్టాండ్ సెంటర్లో బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. గతంలో మద్యం దుకాణాల టెండర్ల సమయంలో ఇదే టీడీపీ నేత తాము వేసిన రూ.4 లక్షలు విలువ చేసే రెండు టెండర్ల డాక్యుమెంట్లను బలవంతంగా తీసుకుని బెదిరింపులకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రెస్టారెంట్ నిర్వాహకుడు గిరికుమార్‌స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు కొల్లూరు ఎస్‌ఐ ఏడుకొండలు చెప్పారు.