Kollur
-
అన్విత గ్రూప్ 2,000 కోట్ల ప్రాజెక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ సంస్థ అన్విత గ్రూప్ రూ.2,000 కోట్ల భారీ ప్రాజెక్టు చేపట్టింది. హైదరాబాద్ సమీపంలోని కొల్లూరు వద్ద ఇవానా పేరుతో గృహ నిర్మాణ ప్రాజెక్టును నెలకొల్పుతోంది. 12.9 ఎకరాల్లో రెండు దశల్లో 1,850 ఫ్లాట్లు రానున్నాయి. మొదటి దశలో 15 అంతస్తుల్లో 2 టవర్లలో 450 ఫ్లాట్ల నిర్మాణం పూర్తి కావస్తోంది. వీటిని ఈ ఏడాది చివరికల్లా కస్టమర్లకు అప్పగిస్తారు. రెండవ దశలో 36 అంతస్తుల్లో 4 టవర్లను నిర్మించనుంది. ఇందులో భాగంగా 1,400 ఫ్లాట్లను 2027లో వినియోగదార్లకు అందజేస్తామని అన్విత గ్రూప్ సీఎండీ అచ్యుతరావు బొప్పన గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. 36 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇవానా ఉంటుందని కంపెనీ డైరెక్టర్ అనూప్ బొప్పన చెప్పారు. భారత్‌లో 6, అమెరికాలో 3 స్థిరాస్తి ప్రాజెక్టులను గ్రూప్ చేపట్టింది. -
బ్రహ్మరథం పడుతున్న ప్రజలు @కల్లూరు
-
దొరల తెలంగాణ - ప్రజల తెలంగాణకు మధ్య జరిగే ఎన్నికలు ఇవి
సాక్షి, కొల్లాపూర్ : దొరల తెలంగాణ - ప్రజల తెలంగాణకు మధ్య తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలమూరు ప్రజాభేరి సభ జరిగింది. ఈ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా..‘దొరల తెలంగాణలో ఏం జరుగుతోందో ప్రజలు నిత్యం గమనిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద మోసం. బీఆర్ఎస్ కట్టిన బ్యారేజ్ కుంగి పోయింది. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్ట్‌లను చూడండి’ అని రాహుల్ గాంధీ కోరారు. ఉద్యమం చేసింది.. దొరల తెలంగాణ కోసం కాదు 'ప్రజా తెలంగాణ కోసం కలలుగన్నాం.. దొరల తెలంగాణ కోసం కాదు. ప్రజల కలలుగన్న తెలంగాణ సాకారం కాబోతోంది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సర్కారు 6 గ్యారంటీలను అమలు చేస్తుంది.' అని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ, ఎంఐఎంకి వేస్తే బీఆర్ఎస్కి ఓటు వేసినట్లే 'బీజేపీ, బీఆర్ఎస్ , ఎంఐఎం ఒకటే. బీజేపీ సర్కారు ఉభయ సభల్లో ప్రవేశపెట్టే బిల్లులకు బీఆర్ఎస్ మద్దతిస్తుంది. ఈడీ , విజిలెన్స్, సీబీఐ కేసులు కాంగ్రెస్ లీడర్ల మీద తప్ప బీఆర్ఎస్ లీడర్ల మీద ఉండవు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ గెలిపించేందుకే ఎంఐఎం ప్రయత్నిస్తుంది. బీజేపీ, ఎంఐఎంకి వేస్తే బీఆర్ఎస్కి ఓటు వేసినట్లే' అని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ప్రజా బలం 'డబ్బులు , మీడియా, అధికారం బీఆర్ఎస్కు ఉంటే కాంగ్రెస్‌కు ప్రజా బలం ఉంది. భయపెట్టాలని చూసినా భయపడకండి . ప్రజల ప్రభుత్వం నిర్మాణానికి ప్రజలతో కలసి కృషి చేయాలి. మన బంధం రాజకీయ బంధం కాదు.. కుటుంబ బంధం. అత్యవసర పరిస్థితిలో తెలంగాణ ప్రజల మద్దతు ఇందిరాగాంధీకి అండగా నిలిచింది' అని రాహల్ గుర్తు చేశారు. -
కాంగ్రెస్‌వి దొంగ డిక్లరేషన్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ప్రకటించినవన్నీ దొంగ డిక్లరేషన్లేనని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. వాటిని నమ్మితే ప్రజలు నిలువునా మోసపోతారన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు టౌన్షిప్లో జీహెచ్ఎంసీ నిర్మించిన డబుల్ బెడ్రూం గృహాలను గురువారం 4,800 మంది లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హరీశ్‌రావు మాట్లాడు తూ కేసీఆర్ కిట్టు.. న్యూట్రీషియన్ కిట్టు.. ఎన్సీడీ కిట్టు.. ఇలా బీఆర్ఎస్ సర్కారు లబ్ధిదారులకు కిట్లు పంపిణీ చేస్తుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు తిట్లకే పరిమితం అవుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిని చూసి సినీ నటుడు రజనీకాంత్ మెచ్చుకున్నప్పటికీ., ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన గజనీగాళ్లకు మా త్రం అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ బెంగళూరును మించి పోయిందనీ, ఇప్పుడు ఈ రంగంలో దేశంలోనే హైదరాబాద్ నం.1 స్థానంలో నిలుస్తోందన్నారు. ఇచ్చే రూ.60 వేలల్లోనూ లంచాలు తీసుకునేవారు.. కాంగ్రెస్ హయాంలో ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ.60 వేలల్లోనూ ఆ పార్టీ నేతలు లంచాలు అడిగే వారని హరీశ్‌రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎలాంటి లంచాలు లేకుండా ఇంటిని కేటాయిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఒక్కొక్కరు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదీ జలాల్లో 90 టీఎంసీల నీటి వాటా మనకే దక్కిందని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా అనుమతి తెచ్చుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాశ్‌గౌడ్, మాగంటి గోపీ నాథ్, సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ పాల్గొన్నారు. -
డబుల్ బెడ్రూమ్ టౌన్షిప్ ప్రారంభించిన కేసీఆర్.. స్పెషల్ ఇదే..
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా కొల్లూరులో కేసీఆర్ నగర్ పేరుతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ టౌన్‌షిప్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అంతకుముందు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. కాగా, సుమారు 60 వేల మంది ఆవాసం ఉండేలా ఒకేచోట ఏకంగా 15,660 ఇండ్ల నిర్మాణాన్ని తెలంగాణ సర్కారు చేపట్టింది. నిరుపేదల కోసం సకల సౌకర్యాలతో కొల్లూరులో ఈ ఆదర్శ టౌన్‌షిప్‌ను నిర్మించింది. నాణ్యతలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కార్పొరేట్ హంగులతో పేదల కోసం కలల సౌధాలను నిర్మించింది. రూ.1,489.29 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో కార్పొరేట్ అపార్ట్మెంట్లకు తీసిపోకుండా సకల హంగులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించారు. ఈ టౌన్షిప్లో 145 ఎకరాల విస్తీర్ణంలో 1432.50 కోట్ల రూపాయల వ్యయంతో ఒకే చోట 15,600 ఇళ్ల నిర్మాణం జరిగింది. సుమారు 60 వేల మంది ఆవాసం ఉండేలా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. G+9 నుంచి G+10, G+11 అంతస్తుల వరకు టౌన్షిప్ నిర్మాణం జరిగింది. మొత్తం 117 బ్లాక్‌లు, బ్లాక్‌కి 2 లిఫ్ట్‌ల చొప్పున మొత్తం 234 లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు. టౌన్షిప్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్, స్కూల్స్, 118 వాణిజ్య దుకాణాల నిర్మాణం జరిగింది. ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది.. వారి మౌనం వెనుక కారణం? -
కొల్లూరు టౌన్షిప్: సారొస్తారా.. చూస్తారా?
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ హౌసింగ్ కాలనీ (టౌన్షిప్)గా జీహెచ్ఎంసీ నగర శివార్లలోని కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తిలకించనున్నారా ? అంటే అవును అనే వాదన వినిపిస్తోంది. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ, అక్కడ జరుగుతున్న హడావుడి, స్వచ్ఛ కార్యక్రమాలు, తదితరమైనవి అందుకు ఆస్కారం కల్పిస్తున్నాయి. అక్కడి డబుల్బెడ్రూం ఇళ్లను వచ్చే నెల మొదటివారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు అధికారులకు సమాచార మున్నప్పటికీ, ప్రధాని సందర్శనకు సంబంధించి సమాచారం లేదు. ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరంలో రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 5వ తేదీన రామానుజుల విగ్రహావిష్కరణకు ప్రధాని హైదరాబాద్‌కు రానుండటం తెలిసిందే. అదే సందర్భంగా వీలును బట్టి హెలికాప్టర్‌నుంచి ఏరియల్ వ్యూ ద్వారా ఇళ్ల సముదాయాన్ని చూపించేందుకు అనుమతి పొందే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లలో కొల్లూరు– 2 ప్రాజెక్టు అత్యంత పెద్దది. కేవలం ఇళ్లు మాత్రమే కాక మౌలిక సదుపాయాలతోపాటు ప్రజలకవసరమైన అన్ని సదుపాయాలు అక్కడ రానున్నాయి. దేశంలోనే ప్రభుత్వపరంగా ఇంత పెద్ద కాలనీ ఎక్కడా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానికి చూపించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ఇళ్లకు పీఎంఏవై ద్వారా నిధులందజేస్తుండటం తెలిసిందే. కొల్లూరు టౌన్షిప్ ఇలా.. కొల్లూరు– 2 ప్రాజెక్టులో భాగంగా జీహెచ్ఎంసీ పటాన్చెరు నియోజకవర్గంలో 15,660 డబుల్బెడ్రూం ళ్లు నిర్మించింది. వీటిల్లో సెల్లార్+స్టిల్ట్+ 9 అంతస్తులు, 10 అంతస్తులు, 11 అంతస్తులవి ఉన్నాయి. ఒక్కో ఇంటికి (అంతర్గత మౌలిక సదుపాయాలతో) రూ.8.65 లక్షలు ఖర్చు చేశారు. 2018 ఫిబ్రవరిలో ప్రాజెక్టు పనులు ప్రారంభం కాగా, 2020 డిసెంబర్లో ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వానలొస్తే నీటి నిల్వలు లేకుండా దాదాపు 14 కి.మీ మేర వీడీసీసీ రోడ్లు. రోడ్ల కటింగ్ జరగకుండా డక్ట్ ఏర్పాటు. లిఫ్టులకు పవర్బ్యాకప్తోపాటు కారిడార్లలో జనరేటర్ల సదుపాయం. 12,500 కిలోలీటర్ల నీరు నిల్వచేయగల 12 భూగర్భ సంపులు.విద్యుత్, తాగునీటి సదుపాయాలు,రూ. 10 కోట్ల వ్యయంతో 9 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన ఎస్టీపీ. వాననీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలు. భూగర్భ డ్రైనేజీ, వీధిదీపాలు, ట్రాన్స్ఫార్మర్లు. 118 దుకాణాలతో 3 షాపింగ్ కాంప్లెక్సులున్నాయి. వీటితోపాటు వాకింగ్‌ట్రాక్, సైక్లింగ్ ట్రాక్స్‌తో పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు, మార్కెట్లు, బస్‌టర్మినల్, పోలీస్‌స్టేషన్ తదితర అవసరాలకు స్థలాలు అందుబాటులో ఉంచారు. -
అగ్ని ప్రమాదంలో వరి కుప్పలు దగ్ధం
కంచిలి : కొల్లూరు పంచాయతీ పరిధి అరవసరియాపల్లి గ్రామ సమీపంలో వరి పంట పొలాల్లో నూర్పు చేసే ట్రాక్టర్‌తో ఉన్న యంత్రం అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. దీంతో సంబంధిత పంట పొలంలో వరికుప్పలు కూడా పూర్తిగా కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే...మంగళవారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన బుడ్డెపు తమ్మయ్యకు చెందిన పొలంలో వరి ధాన్యాన్ని ట్రాక్టర్ సహాయంతో నడిచే యంత్రంతో నూర్పు చేస్తుండగా , అనుకోకుండా సంబంధిత ట్రాక్టర్ ఇంజిన్ నుంచి హఠాత్తుగా మంటలు వచ్చి, అప్పటికప్పుడు ట్రాక్టర్ ఇంజిన్, యంత్రం వరకు అంతటా మంటలు వ్యాపించాయి. దీంతో కాలిపోయాయి. దీంతో సంబంధిత పొలంలో నూర్పు చేస్తున్న వరి కుప్పలకు కూడా ఆ మంటలు వ్యాపించటంతో ఆ ధాన్యం కూడా కుప్పల్లోనే కాలిపోయాయి. ఈ సమాచారం తెలుసుకొన్న సోంపేట అగ్నిమాపక శకటం వచ్చి మంటల్ని అదుపు చేశారు. నూర్పిడి ట్రాక్టర్ యంత్రం సమీప ఒడిశా గ్రామమైన భవానీపురం గ్రామానికి చెందిన ఇసురు సుబ్బారెడ్డికి చెందినది. వరి కుప్పలు కాలిపోవటంతో సుమారు 50 బస్తాల ధాన్యం కాలి బూడిదయ్యాయని రైతు బుడ్డెపు తమ్మయ్య విలేకర్లతో చెప్పారు. రూ.50 వేల వరకు నష్టం జరిగినట్టు రోదిస్తూ వాపోయాడు.