సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ హౌసింగ్ కాలనీ (టౌన్‌షిప్)గా జీహెచ్‌ఎంసీ నగర శివార్లలోని కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తిలకించనున్నారా ? అంటే అవును అనే వాదన వినిపిస్తోంది. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ, అక్కడ జరుగుతున్న హడావుడి, స్వచ్ఛ కార్యక్రమాలు, తదితరమైనవి అందుకు ఆస్కారం కల్పిస్తున్నాయి.
అక్కడి డబుల్‌బెడ్రూం ఇళ్లను వచ్చే నెల మొదటివారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు అధికారులకు సమాచార మున్నప్పటికీ, ప్రధాని సందర్శనకు సంబంధించి సమాచారం లేదు. ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరంలో రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 5వ తేదీన రామానుజుల విగ్రహావిష్కరణకు ప్రధాని హైదరాబాద్‌కు రానుండటం తెలిసిందే. అదే సందర్భంగా వీలును బట్టి హెలికాప్టర్‌నుంచి ఏరియల్ వ్యూ ద్వారా ఇళ్ల సముదాయాన్ని చూపించేందుకు అనుమతి పొందే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లలో కొల్లూరు– 2 ప్రాజెక్టు అత్యంత పెద్దది. కేవలం ఇళ్లు మాత్రమే కాక మౌలిక సదుపాయాలతోపాటు ప్రజలకవసరమైన అన్ని సదుపాయాలు అక్కడ రానున్నాయి. దేశంలోనే ప్రభుత్వపరంగా ఇంత పెద్ద కాలనీ ఎక్కడా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానికి చూపించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ఇళ్లకు పీఎంఏవై ద్వారా నిధులందజేస్తుండటం తెలిసిందే.
కొల్లూరు టౌన్‌షిప్ ఇలా..
కొల్లూరు– 2 ప్రాజెక్టులో భాగంగా జీహెచ్‌ఎంసీ పటాన్‌చెరు నియోజకవర్గంలో 15,660 డబుల్‌బెడ్రూం ళ్లు నిర్మించింది.
వీటిల్లో సెల్లార్+స్టిల్ట్+ 9 అంతస్తులు, 10 అంతస్తులు, 11 అంతస్తులవి ఉన్నాయి.
ఒక్కో ఇంటికి (అంతర్గత మౌలిక సదుపాయాలతో) రూ.8.65 లక్షలు ఖర్చు చేశారు. 2018 ఫిబ్రవరిలో ప్రాజెక్టు పనులు ప్రారంభం కాగా, 2020 డిసెంబర్‌లో ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వానలొస్తే నీటి నిల్వలు లేకుండా దాదాపు 14 కి.మీ మేర వీడీసీసీ రోడ్లు. రోడ్ల కటింగ్ జరగకుండా డక్ట్ ఏర్పాటు.
లిఫ్టులకు పవర్‌బ్యాకప్‌తోపాటు కారిడార్లలో జనరేటర్ల సదుపాయం. 12,500 కిలోలీటర్ల నీరు నిల్వచేయగల 12 భూగర్భ సంపులు.విద్యుత్, తాగునీటి సదుపాయాలు,రూ. 10 కోట్ల వ్యయంతో 9 ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన ఎస్టీపీ. వాననీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలు.
భూగర్భ డ్రైనేజీ, వీధిదీపాలు, ట్రాన్స్‌ఫార్మర్లు. 118 దుకాణాలతో 3 షాపింగ్ కాంప్లెక్సులున్నాయి. వీటితోపాటు వాకింగ్‌ట్రాక్, సైక్లింగ్ ట్రాక్స్‌తో పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు, మార్కెట్లు, బస్‌టర్మినల్, పోలీస్‌స్టేషన్ తదితర అవసరాలకు స్థలాలు అందుబాటులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment