శుక్రవారం హైదరాబాద్‌లోని మీర్జాలగూడ–మల్కాజిగిరి రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్
మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి దాకా సాగిన రోడ్ షో
మోదీ పక్కన కిషన్‌రెడ్డి, బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల
ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రధానికి ప్రజల అభివాదం
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ప్రధాని మోదీ నిర్వహించిన రోడ్ షోకు వివిధ వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసిన ఈ రోడ్‌షో పార్టీ నాయకులు, కేడర్‌లో జోష్ నింపింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, ఇతర వర్గాల వారు రోడ్డుకు ఇరువైపులా, ఇళ్లపై, షాపింగ్, కమర్షియల్ కాంప్లెక్స్‌లపై నుంచి ప్లకార్డులు ప్రదర్శిస్తూ మోదీకి అభివాదం తెలిపారు.
అబ్‌కీ బార్ 400 పార్...(ఈసారి 400 సీట్లు దాటాలి) ఇతర నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రద ర్శించారు. ప్రధానిని ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించడంపై పలువురు ఆనందం వ్యక్తం చేశారు. రోడ్‌షో సాగిన మార్గమంతా రెండువైపులా ఉన్న ప్రజలను మోదీ రెండు చేతులు ఊపుతూ పలకరించారు. ఈ సంద ర్భంగా డప్పు, డోలు, ఇతర వాయిద్య బృందాల ప్రదర్శనలు, తెలంగాణ సాంస్కృతిక కళారూపాలు ఆకట్టుకున్నాయి.
నేడు నాగర్‌కర్నూల్‌కు మోదీ
కేరళ నుంచి బయలుదేరి శుక్రవారం సాయంత్రం బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగిన ప్రధానికి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు. మోదీ నేరుగా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మీర్జాల గూడకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక ఓపెన్‌టాప్ వాహనంలో మల్కాజి గిరి దాకా దాదాపు 1.3 కి.మీ. దూరం రోడ్‌షో నిర్వహించారు. ఆయన వెంట జీప్‌లో ఓ వైపు కిషన్‌రెడ్డి మరోవైపు బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాత్రమే (ఇద్దరు భద్రతా సిబ్బంది మినహా) రోడ్‌షోలో పాల్గొన్నారు.
అంతకుముందు చేవెళ్ల, భువనగిరి, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థులు కొండా విశ్వేశ్వేర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, మాధవీలతలను మోదీకి పరిచయం చేశారు. ఈ రోడ్‌షో మొదలు, చివరి పాయింట్ల వద్ద పలువురు బీజేపీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు స్వాగతం పలికేలా లైనప్‌లు ఏర్పాటు చేశారు. కాగా రోడ్‌షో ముగియగానే మోదీ రాజ్‌భవన్ బసకు చేరుకున్నారు. ప్రధాని శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నాగర్‌కర్నూల్‌కు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ ముగిసిన తర్వాత హెలికాప్టర్‌లో కర్ణాటకలోని గుల్బర్గా వెళతారు.
Comments
Please login to add a commentAdd a comment