సాయంత్రం మల్కాజిగిరిలో రోడ్ షో
రేపు నాగర్‌కర్నూల్‌లో బహిరంగ సభ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు నేపథ్యంలో... తెలంగాణలో బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో వరుసగా శుక్ర, శని, సోమవారాల్లో వివిధ చోట్ల బహిరంగసభలు, రోడ్‌షోల్లో పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు రానున్న మోదీ రాత్రికి రాజ్‌భవన్‌లో బసచేయనున్నారు. శనివారం ఉదయం నాగర్‌కర్నూల్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. మళ్లీ 18న జగిత్యాలలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
శుక్ర, శనివారాల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చనే అంచనాల మధ్య ప్రధాని పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మోదీ ఇప్పటికే ఈ నెల 4న ఆదిలాబాద్‌లో, 5న పటాన్‌చెరువులో రూ.15వేల కోట్ల పైచిలుకు విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందా లేదా అన్న దానితో నిమిత్తం లేకుండా మోదీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కొనసాగుతాయని పార్టీ వర్గాల సమాచారం.
ఇదీ మోదీ షెడ్యూల్...
► శుక్రవారం సాయంత్రం 4.50 గంటలకు కేరళ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు...
► రోడ్డుమార్గాన మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని రోడ్డుషో స్టార్టింగ్ పాయింట్‌కు...
► సాయంత్రం 5.15 గంటల నుంచి 6.15 గంటల వరకు మల్కాజిగిరిలో రోడ్డుషో
► రోడ్డుమార్గాన 6.40 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస
► శనివారం ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.50 గంటలకు నాగర్‌కర్నూల్‌కు చేరుకుంటారు
► మధ్యాహ్నం 12 నుంచి 12.45 గంటల దాకా అక్కడ బహిరంగసభలో పాల్గొంటారు
► ఒంటిగంటకు నాగర్‌కర్నూల్ నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 2.05 గంటలకు కర్ణాటకలోని గుల్బర్గాకు బయలుదేరుతారు.
► తిరిగి 18వ తేదీ రాష్ట్రానికి వస్తారు. ఆ రోజు షెడ్యూల్ అధికారికంగా విడుదల కావాల్సి ఉంది. ఔ
నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాని మోదీ రెండు రోజుల నగర పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ విభాగం తెలిపింది. శుక్రవారం సాయంత్రం 4.40 నుంచి 7 గంటల మధ్య బేగంపేట, పీఎన్‌టీ జంక్షన్, రసూల్‌పురా, సీటీఓ, ప్లాజా, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్‌రోడ్డు, ఆలుగడ్డ బావి, మెట్టుగూడ, రైల్వే హాస్పిటల్, మెట్టుగూడ రోటరీ, మీర్జాలగూడ టి–జంక్షన్, మల్కాజిగిరి ఆర్చి, లాలాపేట్, తార్నాక, గ్రీన్‌ల్యాండ్స్, మోనప్ప జంక్షన్, రాజ్‌భవన్, ఎంఎంటీఎస్ జంక్షన్, వీవీ విగ్రహం మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పేర్కొంది. ఆయా మార్గాల్లో వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించింది. అదేవిధంగా శనివారం ఉదయం 10.40 నుంచి 11.15 గంటల మధ్య ప్రధానమంత్రి రాజ్‌భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. ఆ సమయంలో వీవీ విగ్రహం, మెట్రో రెసిడెన్షీ లేన్, ఎంఎంటీఎస్ రాజ్‌భవన్, పంజగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్, హెచ్‌పీఎస్ ఔట్ గేట్, బేగంపేట ఫ్లైఓవర్, పీఎన్‌టీ ఫ్లైఓవర్, ఎయిర్‌పోర్ట్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వివరించింది.
మోదీ రాక.. భద్రత కట్టుదిట్టం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల(నేడు, రేపు) నగర పర్యటన దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశా రు. మోదీ విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న నేపథ్యంలో దానిని కేంద్ర బలగాలు తమ ఆ«దీనంలోకి తీసుకు న్నాయి. ఎయిర్‌పోర్ట్ పరిసరాలను అణువణువూ జాగిలాలతో జల్లెడ పట్టాయి. ప్రధాని పయనించే మార్గాల్లో పోలీసులు గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు. నేడే మోదీ రోడ్ షో పూర్తిచేసుకుని తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. శనివారం ఉద యం 10.40 నుంచి 11.15 మధ్య రాజ్‌భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
సాక్షి, సిటీబ్యూరో, మల్కాజిగిరి/ సనత్‌నగర్: మల్కాజిగిరిలో నేడు సాయంత్రం 5.15 గంటలకు జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్‌షోకు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ మరి కొద్దిరోజుల్లో వెలువడనున్న తరుణంలో ప్రధానమంత్రి రోడ్ షో బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపనుంది. మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నేతలు మల్కాజిగిరిలో రోడ్‌షో ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసేందుకు సన్నాహాక సమావేశాలు ఇ ప్పటికే ఏర్పాటు చేశారు.
రోడ్ షో ఇలా...
► ప్రధాని మోదీ రోడ్ షో మీర్జాలగూడ చౌరస్తా నుంచి సాయంత్రం 5.15 గంటలకు ప్రారంభం కానున్నది.
► సుమారు 1.3 కి.మీ. దూరంలో ఉన్న మల్కాజిగిరి చౌరస్తా వరకు రోడ్‌షో జరుగుతుంది.
► మల్కాజిగిరి చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌కు ఏర్పాటు చేశారు. అక్కడ మోదీ ప్రసంగించే అవకాశం ఉంది.
► దారి పొడవునా సుమారు 60 స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తున్నారు.
► ప్రజలతోపాటు పార్టీ నాయకులు స్వాగతం పలికేందుకు రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు.
► రోడ్‌షోలో భాగంగా సుమారు ముప్ఫై కార్లతో కాన్వాయి ట్రయల్ రన్ నిర్వహించారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞలు
ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన భద్రతాచర్యల్లో భాగంగా రోడ్ షో జరిగే ప్రాంతం చుట్టూ నిషేధాజ్ఞలు విధిస్తూ కమిషనర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిర్ బెలూన్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్, ప్యారా గ్లైడింగ్‌లను నిషేధించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రోడ్ షో ముగిసే వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు.
రహదారి మళ్లింపులు ఇలా..
► మెట్టుగూడ నుంచి మీర్జాలగూడ క్రాస్ రోడ్, నేరేడ్‌మెట్ వైపునకు వచ్చే ప్రయాణికులు శాంతినగర్ టీ జంక్షన్ వద్ద మళ్లించి, లాలాపేట మీదుగా జెడ్‌టీసీ, మౌలాలి, రమాదేవి, ఈసీఐఎల్ మీదుగా నేరేడ్‌మెట్‌కు చేరుకోవాలి.
► నేరేడ్‌మెట్, వినాయక్‌నగర్, సఫిల్‌గూడ జంక్షన్ మీదుగా మల్కాజ్‌గిరి క్రాస్ రోడ్స్‌కు వచ్చే వాహనదారులు ఆనంద్‌బాగ్ క్రాస్ రోడ్స్ వద్ద మలుపు తీసుకొని ఉత్తమ్ ఆర్‌యూబీ మీదుగా ఉత్తమ్ నగర్, ఏఓసీ రూట్, సికింద్రాబాద్ మీదుగా వెళ్లిపోవాలి.
► జెడ్‌టీసీ జంక్షన్ నుంచి ఆనంద్‌బాగ్‌కు వచ్చే వాహనాలు జెడ్‌టీసీ వద్ద మళ్లించి, మౌలాలి, రమాదేవి, ఈసీఐఎల్, నేరేడ్‌మెట్, వినాయక్‌నగర్ మీదుగా వెళ్లిపోవాలి.
పార్కింగ్‌లు ఇక్కడే..
రోడ్ షోకు హాజరయ్యేవారు తమ వాహనాలను అనుటెక్స్ పెట్రోల్ బంక్, అషూర్‌ఖానా మైదానం, ప్రశాంత్ నగర్, జైన్ కన్‌స్ట్రక్షన్, సఫిల్‌గూడ ప్రాంతాలలో మధ్యాహ్నం 2 గంటల లోపు పార్కింగ్ చేయాలి. ఆ సమయం తర్వాత పార్కింగ్ చేయడానికి అనుమతి లేదు.
Comments
Please login to add a commentAdd a comment