వరంగల్, సాక్షి: మూడో విడత పోలింగ్‌లో రెండు విషయాలు స్పష్టం అయ్యాయి. బీజేపీ వీజయం వైపు దూసుకెళ్తోంది. కాంగ్రెస్ తాము ఎక్కడ గెలుస్తామా? అని భూతద్దంతో చూస్తోంది. కానీ, నాలుగో విడతలో కాంగ్రెస్ గెలిచే సీట్లను చూడాలంటే భూతద్దం సరిపోదు.. మైక్రోస్కోప్ కావాల్సిందే అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. బుధవారం మధ్యాహ్నాం బీజేపీ నిర్వహించిన ఓరుగల్లు జన గర్జన సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.
ప్రపంచమంతా అస్థిరత, సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో అబ్‌కీ బార్ మోదీ సర్కార్ అంటోంది. గతంలో కాంగ్రెస్ వచ్చిందంటే సమస్యలు వచ్చేవి. ఇండియా కూటమిలో ఒక్కో ఏడాది ఒక్కో ప్రధాని అనే ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఏడాది ఒక్కో ప్రధాని ఉంటే దేశం బాగుపడుతుందా?.
.. ఇండియా కూటమి ఎక్కడ అధికారంలో ఉంటే.. ఆ రాష్ట్రంలో సంపదను ఏటీఎంలాగా దోచుకుంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తొలగించి ముస్లింలకు ఇవ్వాలని ఇండియా కూటమి చూస్తోంది. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దన్న రాజ్యాంగ సూత్రాన్ని కాంగ్రెస్ పట్టించుకోవడం లేదు. ద్రౌపది ముర్మును కాంగ్రెస్ ఎందుకు ఓడించాలనుకుందో అర్థం కావడం లేదు. బహుశా రంగుచూసి ఓడించాలని నిర్ణయించినట్లు ఉంది. యువరాజుకు అమెరికాలో ఒక ఫ్రెండ్, గైడ్ (శ్యామ్ పిట్రోడాను ఉద్దేశిస్తూ..) ఉన్నారు. నల్లగా ఉన్నవారంతా ఆఫ్రికన్లే అని ఆ యువరాజుకి ఆ అంకుల్ చెప్పారు. అయినా చర్మం రంగు ఆధారంగా మన దేశంలో యోగ్యత నిర్ణయిస్తారా?’’ అని ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.
.. కాంగ్రెస్ అబద్ధాలు ఎలా ఉంటాయో.. ప్రజలకు బాగా తెలుసు. తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్నవాళ్లకు పెన్షన్ ఇచ్చిందా?. మహిళలకు రూ.2,500 ఇస్తామన్న కాంగ్రెస్ హామీ నెరవేరిందా?. రుణ మాఫీ ఆగష్టు 15వ తేదీకి మార్చారు. అది మోసం చేయడం కాదా?. తెలంగాణలో పవర్‌కట్స్ పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలో ఆర్‌ఆర్ ట్యాక్స్ వసూలు అవుతోంది. ఆ ఆర్‌ఆర్ ట్యాక్స్‌లో ఒక వాటా ఇక్కడి హైదరాబాద్ ఆర్‌కు, మరో వాటా ఢిల్లీలోని ఆర్‌కు వెళ్తోంది
.. కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్ కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది.2014లో దళితులను సీఎం చేస్తానని బీఆర్‌ఎస్ మాట తప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలను బీఆర్‌ఎస్ కూడా మోసం చేసింది. దళిత బంధు పేరుతోనూ బీఆర్‌ఎస్ మోసం చేసింది. తమ హక్కుల కోసం పోరాడుతున్న మాదిగలకు రిజర్వేషన్లు నేను ఇప్పిస్తాను.
తెలంగాణలో కొందరు వేములవాడ రాజన్నపై ఒట్టు పెడుతున్నారు.. మరోవైపు సనాతన ధర్మాన్ని తిడుతున్నారు. సనాతన ధర్మాన్ని తిడుతున్న వాళ్ల మాటలు ఎవరైనా నమ్ముతారా?. కాకతీయ సామ్రాజ్యపు ప్రతీక వరంగల్. అహ్మదాబాద్ నా కర్మభూమి.. ఆ నగర దేవత కూడా భద్రకాళినే. గతంలో బీజేపీకి రెండు సీట్లు ఉన్నప్పుడు అందులో ఒకరు వరంగల్ నుంచే ఉన్నారు. వరంగల్‌ను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ బారి నుంచి కాపాడాలి. అందుకోసం వరంగల్, మహబూబాబాద్ బీజేపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలి అని ప్రధాని మోదీ ఉమ్మడి వరంగల్ ఓటర్లను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment