
ఫుల్బాని (ఒడిశా): లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 50 సీట్లు కూడా గెలవదని, ఎన్నికల తర్వాత ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం ఆయన ఒడిశాలోని కంధమాల్ లోక్‌సభ స్థానంలోని ఫుల్బానీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఒడియా భాష, సంస్కృతి తెలిసిన, అర్థం చేసుకున్న ఒడిశా బిడ్డనే రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు.
అటల్ బిహారీ వాజ్‌పేయీ హయాంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను గుర్తుచేస్తూ.. 26 ఏళ్ల క్రితం ఇదే రోజున పోఖ్రాన్ పరీక్షలు ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్టను పెంచాయన్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం ద్వారా తమ ప్రభుత్వం దేశ ప్రజల 500 ఏళ్ల నిరీక్షణకు తెర దించిదని పేర్కొన్నారు.
ఒడిశాలో మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు, 21 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీకి, పార్లమెంటు స్థానాలకు ఏకకాలంలో నాలుగు దశల్లో మే 13 నుంచి జూన్ 1 వరకు ఎన్నికలు జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4 జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment