కొత్త సభ కొలువు తీరిందన్న మాటే కానీ, పార్లమెంట్‌లో పాత దృశ్యాలే పునరావృతమయ్యాయి. 18వ లోక్‌సభ ఏర్పడ్డాక జరిగిన తొలి పార్లమెంట్ సమావేశాలు సభ్యుల ప్రమాణ స్వీకారం, రాష్ట్ర పతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికే పరిమితమయ్యాయి. కానీ, నేతలెవరు మాట్లాడుతున్నా... వెనుక నుంచి అవే అరుపులు, గందరగోళ పరిస్థితులు, రన్నింగ్ కామెంటరీలు, సభాపతితో వాగ్వాదాలు, చివరకు వాకౌట్లు తప్పలేదు. సర్వసాధారణంగా ఏకగ్రీవం గానో, లేదంటే అధికార – ప్రతిపక్షాల మధ్య పోటీతోనో జరగాల్సిన లోక్‌సభ స్పీకర్ ఎన్నిక సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మూజువాణి ఓటుతో సాగింది.
ఇక, ప్రతిపక్షాలకు కేటాయించాల్సిన లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని తద్భిన్నంగా గత అయిదేళ్ళుగా ఖాళీగా అట్టిపెట్టేసిన అధికార బీజేపీ, ఈసారి కూడా ఆ పదవిని వారికి వదిలిపెట్టే పెద్దమనసు చేస్తున్నట్టు లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథిగా తన మిత్రపక్షాలకు ఆ పదవిని కట్టబెట్టాలని బీజేపీ చూస్తున్నట్టు వస్తున్న కథనాలే అందుకు నిదర్శనం. ఇక, సభానాయకుడికీ, ప్రతిపక్ష నేతకూ మధ్య పొసగని పరిస్థితి సరేసరి. వెరసి లోక్‌సభలో మంగళవారం, రాజ్యసభలో బుధవారం ముగిసిన తొలి సమావేశాలు అసంతృప్తినే మిగిల్చాయి.
ఈ పాపంలో అధికార, ప్రతిపక్షాలు రెంటికీ సమాన భాగస్వామ్యం ఉంది. కొద్ది నెలలుగా పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారంలో మునిగితేలిన పార్టీలు ఇప్పటికీ ఆ మానసిక స్థితి నుంచి బయట పడినట్టు లేవు. ఎన్నికల ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పార్లమెంట్ సాక్షిగా ఇరుపక్షాలూ పరస్పరం ఎన్నికల ప్రచార తరహా ఆరోపణల పర్వం కొనసాగించడం దురదృష్టం. ప్రతిపక్ష నాయకుడిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ తన ప్రథమ ప్రసంగంలోనే ప్రభుత్వంపై నిశిత విమర్శలతో దూకుడు ప్రదర్శించారు.
ఇతర ప్రతిపక్ష నేతలు సైతం శక్తిమంత మైన ప్రసంగాలే చేశారు. కాబట్టి వారికి తగినంత సమయం ఇవ్వలేదన్న ప్రసక్తే లేదు. రాహుల్ ఉద్వేగభరితంగా మాట్లాడుతూ మార్కులు సంపాదించినా, సరైన గణాంకాలతో సమస్యల్ని నిర్దిష్టంగా ప్రస్తావించలేకపోయారు. అగ్నివీర్ లాంటి అంశాల్లో ఆయన లెక్కలు తప్పు చెప్పారు. మరోపక్క ప్రధాని లోక్‌సభలో మాట్లాడుతున్నంత సేపూ ప్రతిపక్షాలు నినాదాలు హోరెత్తించాయే తప్ప, హుందాతనం పాటించలేదు. రాహుల్ సైతం సభలో సభ్యుల్ని రెచ్చిపొమ్మన్నట్టు ప్రేరేపించడం సైతం ఏ మాత్రం సమర్థనీయం కాదు.
రాహుల్‌ది పిల్లతనం, కాంగ్రెస్ పరాన్నజీవి లాంటి రాజకీయ విమర్శలు గుప్పించిన మోదీ కూడా తక్కువేమీ తినలేదు. ఎంతసేపటికీ పాత ఎమర్జెన్సీ గాయాన్ని గుర్తు చేసి, కాంగ్రెస్‌ను తప్పు బట్టడానికి ప్రయత్నించారు. లేదంటే గడచిన తమ పదేళ్ళ ప్రస్థానాన్ని గుణగాన సంకీర్తన చేశారు. అంతేతప్ప లోక్‌సభలో చేసిన రెండున్నర గంటల సుదీర్ఘ ప్రసంగంలో ప్రతిపక్షాలు ప్రస్తావించిన, దేశాన్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కార్యాచరణ ఏమిటన్నది మాత్రం చెప్పలేదు. చెప్పాలనుకోలేదు.
సంక్షుభిత మణిపుర్‌లో ఏడాదిగా ఒక్కసారైన పర్యటించని మోదీ సదరు ఈశాన్య రాష్ట్రంలో పరిస్థితులు మెరుగుపడ్డాయంటూ రాజ్యసభలో అసత్యాలాపన చేయడం మరీ విడ్డూరం. ఒక్కమాటలో... ఈసారి సొంత మెజారిటీ తగ్గి, కూటమి ప్రభుత్వం నడుపుతున్న మోదీ ఇప్పటికీ గత రెండుసార్లు తిరుగులేని మెజారిటీతో సాగిన బీజేపీ ప్రభుత్వ ఆధిపత్య ధోరణినే ప్రదర్శిస్తు న్నారు. ప్రభుత్వ పెద్దగా, అనుభవజ్ఞుడిగా ప్రతిపక్షాలను సైతం కలుపుకొని పోవాలన్న ఆలోచన చేయట్లేదు. పట్టువిడుపులు చూపట్లేదు. దాంతో ఇరుపక్షాలకూ మధ్య రాజీ కుదిరేలా కనిపించట్లేదు.
అందరూ కలిసి నాటకీయ చర్యలు, వ్యాఖ్యలతో పార్లమెంట్‌ను (రణ) రంగస్థలిగా మార్చేశా రన్నది చేదు నిజం. అధికార, ప్రతిపక్ష నేతలు అంశాల వారీగా చర్చిస్తే, విభేదిస్తే ఫరవాలేదు కానీ, నిత్యం ఉప్పు నిప్పుగా ఉంటే పార్లమెంట్ నడిచేదెట్లా? మళ్ళీ జనం ముందుకు వెళ్ళడానికి మరో అయిదేళ్ళుండగా, రేపే ఎన్నికలన్నట్టు రాజకీయ విమర్శల్లో మునిగితేలితే లాభమేంటి? నీట్ పరీక్ష, నిరుద్యోగం, ఈ అయిదేళ్ళలో సాగాల్సిన నియోజక వర్గ పునర్విభజన, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిన జనగణన లాంటి అనేక తక్షణ, దీర్ఘకాలిక అంశాలు చర్చకు మిగిలే ఉన్నాయి. అలాంటి వాటిపై దృష్టి పెట్టాలి.
కీలకమైన బిల్లుల ఆమోదానికి లోక్‌సభలో టీడీపీ, జేడీయూల పైన, రాజ్యసభలో బిజూ జనతాదళ్ సైతం దూరమైనందున ఇతరులపైన ఆధారపడాల్సిన మోదీ 3.0 ఆభిజాత్యం వదులుకోకపోతే కష్టం. ఘర్షణ, విద్వేషం మరింత పెరిగిపోవడాని కన్నా ముందే నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేశ శ్రేయస్సు కోసం హుందా చర్చకు తెర తీయాలి.
బడ్జెట్ కోసం జూలై మూడో వారంలో పార్లమెంట్ తిరిగి సమావేశం కానుంది. అప్పుడైనా అధికార, ప్రతిపక్షాలు తమ వైఖరి మార్చుకోవాలి. ఇరుపక్షాలూ విజ్ఞతతో వ్యవహరించాలి. ప్రతిపక్ష వాదనకు చెవి ఒగ్గాల్సిన బాధ్యత పాలకులకు తప్పనిసరిగా ఉంది. అదే సమయంలో– ప్రజలిచ్చిన మెజారిటీతో గద్దెనెక్కి, చెప్పే అధికారం చేజిక్కించుకున్న పాలకుల మాటలను ప్రతిపక్షాలూ సావధానంగా విని తీరాలి. ఎవరు ఎవరిని మాట్లాడనివ్వబోమన్నా, వినిపించుకోబోమన్నా అది ప్రజాస్వామ్యం కాదు.
ప్రజాక్షేమానికి అసలు పనికిరాదు. అనేక అంశాలపై పరస్పర భిన్నమైన అభిప్రాయాలు సహజంగానే ఉంటాయి. కానీ పార్లమెంట్‌లో జరగాల్సింది అర్థవంతమైన చర్చే తప్ప అనవసర రాద్ధాంతం కాదు. ప్రజాస్వామ్య దేవాలయంగా, అత్యున్నత నిర్ణాయక వేదికగా పార్లమెంట్‌కు ఉన్న ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే అది అందరికీ నష్టం. గత పదేళ్ళుగా చట్ట సభల్లో అంతకంతకూ పెరిగిపోతున్న ఇలాంటి ప్రవర్తన ఇలాగే కొనసాగితే, మొదటికే మోసం వస్తుంది. ప్రజాసమస్యలపై చర్చించాల్సిన చట్టసభల సమావేశాలకు ప్రయోజనం లేకుండా పోతుంది.
రచ్చ కాదు... చర్చ కావాలి!
Published Fri, Jul 5 2024 12:08 AM | Last Updated on Fri, Jul 5 2024 12:08 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment