మోదీపై రాహుల్ ధ్వజం
అమరావతి/ చిముర్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాగే ప్రధాని నరేంద్ర మోదీ మతిమరుపుతో బాధపడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని దేశ డీఎన్‌ఏగా భావిస్తుందని, అధికార బీజేపీ, రాష్ట్రయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లకు మాత్రం అదో ఖాళీ పుస్తకమని రాహుల్ గాంధీ అన్నారు. శనివారం రాహుల్ అమరావతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చవచ్చని రాజ్యాంగంలో ఎక్కడా రాసిలేదని, కానీ మహారాష్ట్రలో అదే జరిగిందని పేర్కొన్నారు.
బడా వ్యాపారవేత్తలకు సంబంధించి 16 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశారని బీజేపీపై ధ్వజమెత్తారు. ‘రాజ్యాంగమే మన దేశ డీఎన్‌ఏగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కానీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు అదో ఖాళీ పుస్తకం’అని రాహుల్ అన్నారు. ఎన్నికల ప్రచారసభల్లో రాహుల్ ప్రదర్శిస్తున్న రాజ్యాంగ ప్రతిలో లోపలి పేజీలు ఖాళీగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ విమర్శించిన నేపథ్యంలో రాహుల్ ఈ విధంగా స్పందించారు. నేను లెవనెత్తుతున్న అంశాలపైనే మోదీ మాట్లాడుతున్నారని సోదరి ప్రియాంకగాంధీ నా దృష్టికి తెచ్చారు. ‘కులగణన జరగాలని, రిజర్వేషన్లపై 50 శాతం గరిష్ట పరిమితిని ఎత్తివేయాలని నేను మోదీకి లోక్‌సభలో చెప్పాను.
కానీ ఆయన మాత్రం నేను రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఎన్నికల సభల్లో చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ లాగే మతిమరుపుతో బాధపడుతున్నారు’అని రాహుల్ ధ్వజమెత్తారు. బైడెన్ ఒక సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌గా పరిచయం చేయడాన్ని ఉదహరించారు. అలాంటి లక్షణాలే మోదీలోనూ కనపడుతున్నాయని విమర్శించారు. రాహుల్ గాంధీ కులగణనకు వ్యతిరేకమని కూడా మోదీ చెబుతారని ఎద్దేవా చేశారు.
రాహుల్ బ్యాగ్ తనిఖీ
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని అమరావతిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం తనిఖీ చేసింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాహుల్ మహారాష్ట్రలోని అమరావతికి వెళ్లా రు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్ ధమన్‌గావ్ రైల్వే హెలిప్యాడ్‌లో దిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ హెలికాప్టర్‌లో ఎన్నికల సంఘం అధికారులు సోదాలు చేశారు. ఎన్నికల సంఘం తనిఖీలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
Comments
Please login to add a commentAdd a comment