సాక్షి, కొల్లాపూర్ : దొరల తెలంగాణ - ప్రజల తెలంగాణకు మధ్య తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలమూరు ప్రజాభేరి సభ జరిగింది. ఈ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా..‘దొరల తెలంగాణలో ఏం జరుగుతోందో ప్రజలు నిత్యం గమనిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద మోసం. బీఆర్ఎస్ కట్టిన బ్యారేజ్ కుంగి పోయింది. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్ట్‌లను చూడండి’ అని రాహుల్ గాంధీ కోరారు.
ఉద్యమం చేసింది.. దొరల తెలంగాణ కోసం కాదు
'ప్రజా తెలంగాణ కోసం కలలుగన్నాం.. దొరల తెలంగాణ కోసం కాదు. ప్రజల కలలుగన్న తెలంగాణ సాకారం కాబోతోంది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సర్కారు 6 గ్యారంటీలను అమలు చేస్తుంది.' అని రాహుల్ గాంధీ అన్నారు.
బీజేపీ, ఎంఐఎంకి వేస్తే బీఆర్‌ఎస్‌కి ఓటు వేసినట్లే
'బీజేపీ, బీఆర్ఎస్ , ఎంఐఎం ఒకటే. బీజేపీ సర్కారు ఉభయ సభల్లో ప్రవేశపెట్టే బిల్లులకు బీఆర్ఎస్ మద్దతిస్తుంది. ఈడీ , విజిలెన్స్, సీబీఐ కేసులు కాంగ్రెస్ లీడర్ల మీద తప్ప బీఆర్ఎస్ లీడర్ల మీద ఉండవు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ గెలిపించేందుకే ఎంఐఎం ప్రయత్నిస్తుంది. బీజేపీ, ఎంఐఎంకి వేస్తే బీఆర్‌ఎస్‌కి ఓటు వేసినట్లే' అని రాహుల్ పేర్కొన్నారు.
కాంగ్రెస్‌కు ప్రజా బలం
'డబ్బులు , మీడియా, అధికారం బీఆర్‌ఎస్‌కు ఉంటే కాంగ్రెస్‌కు ప్రజా బలం ఉంది. భయపెట్టాలని చూసినా భయపడకండి . ప్రజల ప్రభుత్వం నిర్మాణానికి ప్రజలతో కలసి కృషి చేయాలి. మన బంధం రాజకీయ బంధం కాదు.. కుటుంబ బంధం. అత్యవసర పరిస్థితిలో తెలంగాణ ప్రజల మద్దతు ఇందిరాగాంధీకి అండగా నిలిచింది' అని రాహల్ గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment