సైబర్‌ చోర్‌ టెకీస్‌ | Cybercriminals are mostly highly educated | Sakshi
Sakshi News home page

సైబర్‌ చోర్‌ టెకీస్‌

Published Mon, Nov 18 2024 4:51 AM | Last Updated on Mon, Nov 18 2024 4:51 AM

Cybercriminals are mostly highly educated

సైబర్‌ నేరగాళ్లలో ఉన్నత విద్యావంతులే అధికం 

45 శాతం మంది విద్యార్హత బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ 

నేరస్తుల్లో 30 ఏళ్ల లోపువారే 49 శాతం మంది 

వ్యాపారాల్లో ఉంటూ నేరాలు చేస్తున్నవారు 34 శాతం 

మూడు శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు 

తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో గణాంకాల్లో వెల్లడి 

ఆరు నెలల్లో 165 మందిని అరెస్టు చేసిన టీజీసీఎస్బీ  

సాక్షి, హైదరాబాద్‌: ‘చదువుకోకపోతే దొంగ అవుతావా?’అని చిన్నప్పుడు స్కూలుకు వెళ్లకపోతే తల్లిదండ్రులు తిట్టడం అందరికీ అనుభవమే. కానీ, మంచి చదువు చదివినవారు కూడా కొందరు ఈజీ మనీకి అలవాటుపడి నేరాల బాట పడుతున్నారు. తమకున్న కంప్యూటర్‌ పరిజ్ఞానాన్ని వాడి సైబర్‌ నేరాలకు తెగబడుతున్నారు. 

తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) నివేదిక ప్రకారం సైబర్‌ నేరా లు చేస్తున్నవాళ్లలో 45 శాతం మంది బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ వంటి ఉన్నత సాంకేతిక విద్య పట్టభద్రులే ఉన్నారు. వారిలోనూ 49 శాతం మంది వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్యనే ఉన్నది. సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నవాళ్లలో మూడు శాతం మంది ప్రభు త్వ ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. 

ఉక్కుపాదం మోపుతున్న టీజీసీఎస్పీ 
సైబర్‌ నేరాల కట్టడి కోసం తెలంగాణ పోలీసులు టీజీసీఎస్బీని ఏర్పాటు చేశారు. ఈ నేరాల తీవ్రత దృష్ట్యా కేసుల దర్యాప్తులో అడ్డంకులను అధిగమించడంతోపాటు పక్కాగా దర్యాప్తు చేపట్టేందుకు నేరుగా టీజీసీఎస్బీ డైరెక్టర్‌ పర్యవేక్షణ కింద ఈ ఏడాది ఏప్రిల్‌లో మొత్తం ఏడు సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్లను (సీసీపీఎస్‌) ఏర్పాటు చేశారు. 

ఈ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో గత ఆరు నెలల్లో 76 సైబర్‌ నేరాల్లో దేశవ్యాప్తంగా 165 మంది సైబర్‌ నేరగాళ్లను అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితులకు తెలంగాణవ్యాప్తంగా 795 సైబర్‌నేరాలతో, దేశవ్యాప్తంగా 3,357 సైబర్‌ నేరాలతో సంబంధం ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

న్యూ ఢిల్లీ, గుజరాత్, ఒడిశా, అస్సాం, రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల నుంచి వీరిని అరెస్టు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో సైబర్‌ నేరగాళ్లను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీస్‌లపై స్థానికులు దాడులకు పాల్పడ్డారు. కొన్ని కేసుల్లో స్థానిక పోలీసుల సహకారం సైతం ఉండటంలేదని టీజీసీఎస్బీ పోలీసులు తెలిపారు.  

ఏ తరహా నేరాలు ఎక్కువ? 
సైబర్‌ నేరాల్లో పార్ట్‌టైం జాబ్స్, బిజినెస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (స్టాక్‌ ట్రేడింగ్‌), డిజిటల్‌ అరెస్టులు, లోన్‌ యాప్, హ్యాకింగ్, అడ్వరై్టజ్‌మెంట్, మ్యాట్రిమోనియల్‌ మోసాలు ఎక్కువ ఉంటున్నాయి. పట్టుబడుతున్న వారిలో సైబర్‌ మోసాలకు పాల్పడే వారితోపాటు మ్యూల్‌ బ్యాంక్‌ ఖాతాదారులు, బ్యాంకు ఖాతాలు ఇచ్చే ఏజెంట్లు, అకౌంట్‌ ఆపరేటర్లు, సిమ్‌కార్డులు సరఫరా చేసేవాళ్లు, బ్యాంకు అధికారులు, ట్రావెల్‌ ఏజెంట్లు, హ్యాకర్లు సైతం ఉన్నారు.  

సైబర్‌సేఫ్‌ తెలంగాణే మా లక్ష్యం 
సైబర్‌ నేరగాళ్ల విషయంలో అత్యంత కఠిన వైఖరితో ఉన్నాం. సైబర్‌సేఫ్‌ తెలంగాణే మా లక్ష్యం. ప్రజలు సైతం సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్‌ చేయవద్దు. మీరు సైబర్‌ నేరానికి గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌ లేదా 87126 72222 వాట్సప్‌ నంబర్‌లో లేదా  ఠీఠీఠీ.ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీn లోనూ ఫిర్యాదు చేయవచ్చు.   – శిఖాగోయల్, డైరెక్టర్, టీజీసీఎస్బీ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement