
బంజారాహిల్స్(హైదరాబాద్) : ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. సదరు యువతితో చనువుగా మెదిలాడు. పెళ్లి మాట ఎత్తేసరికి మాత్రం.. మరిచిపో అంటూ తాపీగా చెప్పేశాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని గాయత్రీహిల్స్‌లో నివసిస్తున్న సాయిప్రణీత్ (26) సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పని చేస్తున్నాడు.
ఆయన బెంగళూరులో ఉన్న సమయంలో 2023లో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఒకే హాస్టల్ గదిలో పేయింగ్ గెస్ట్‌గా ఉండేవారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నమ్మిన యువతి సాయిప్రణీత్‌తో సాన్నిహిత్యం పెంచుకుంది. అనంతరం నగరంలోని గాయత్రీ హిల్స్‌కు మకాం మార్చిన సాయిప్రణీత్.. కొద్ది రోజులు యువతితో కలిసి సహజీవనం కూడా చేశాడు. తన చెల్లెలి పెళ్లి తర్వాత మన పెళ్లి జరుగుతుందంటూ ఆమెను నమ్మించి గత ఏడాది నవంబర్‌లో వెళ్లిపోయాడు.
మీ చెల్లెలి పెళ్లి ఫొటోలు పంపించాలని యువతి చెప్పగా.. కొన్నింటిని పంపించాడు. ఆ ఫొటోలను చూసి అనుమానం వచ్చినది బాధితురాలు ఇటీవల మరింతగా ఒత్తిడి చేయడం ప్రారంభించింది. దీంతో రెండు రోజుల క్రితం సాయిప్రణీత్ గదికి వెళ్లిన ఆమెను కొట్టి.. మెడ పట్టి గెంటివేశాడు. ఇన్ని రోజులు నాతో తిరిగినందుకు ఖరీదుగా రూ.20 లక్షలు ఇస్తాను.. మన బంధం మరిచిపో అంటూ చెప్పేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు జూబ్లీహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment